
ఆ నిజాయితీతోనే అంత ఎత్తుకు ఎదిగారు
కోలీవుడ్‌లో నీతి, నిజాయితీ, న్యాయం అన్న పదాలకు నిదర్శనాలు కష్టమనే చెప్పాలి. అయితే అసలు నిజాయితీ పరులుండరనిచెప్పడం సరికాదన్నది అన్నది దర్శకుడు కేఎస్.రవికుమార్‌ను చూస్తే అనిపించకమానదు. పలు విజయవంతమైన చిత్రాలందించిన దర్శకుల్లో కేఎస్.రవికుమార్ ఒకరు.ఒక ప్రణాళిక ప్రకారం చిత్రాలను తెరకెక్కించే ఈయన తన చిత్రాల్లో ఒక్క సన్నివేశంలో అయినా కనిపించడాన్ని సెంటిమెంట్‌గా పెట్టుకున్నారు.
అలాంటి కేఎస్.రవికుమార్ ఇప్పుడు పూర్తి కాల నటుడైపోయారు. తంగమగన్ చిత్రంలో ధనుష్‌కు తండ్రిగా జీవించారనే చెప్పాలి. తాజాగా శివకార్తికేయన్,కీర్తీసురేశ్ జంటగా నటిస్తున్న రెమో చిత్రంలో ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. ఏఎం.స్టూడియోస్ పతాకంపై ఆర్‌డీ.రాజా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇందులో నటిస్తున్న కేఎస్.రవికుమార్‌కు ఏరోజు పారితోషికం ఆ రోజు చెల్లిస్తున్నారు. అలా ఒక రోజు షూటింగ్‌లో పాల్గొన్న ఆయనకు చిత్ర నిర్వాహకులు యథావిధిగా ఇంటికి వెళ్లి పారితోషికం చెల్లించారు. అది తీసుకున్న కేఎస్.రవికుమార్ వెంటనే ఫోన్ చేసి తానీరోజు షూటింగ్‌లో గంట సేపు మాత్రమే నటించాను. మీరు రోజు మొత్తానికి పారితోషికం చెల్లించారు.
దాన్ని తాను తీసుకోను అని చెప్పారు. అందుకు వాళ్లు సగం రోజు చేయాల్సిన షూటింగ్‌ను మీరు గంటలోనే పూర్తి చేశారు అని చెప్పినా కేఎస్.రవికుమార్ అంగీకరించకుండా సగం పారితోషికాన్ని తిరిగి ఇచ్చేశారు. కేఎస్.రవికుమార్ నిజాయితీ రెమో చిత్ర యూనిట్‌ను ఆశ్చర్యపరచింది. ఈ రోజుల్లో ఇలాంటి వాళ్లు కూడా ఉన్నారా? అంటూ చర్చించుకున్నారట.అంత నిజాయితీ, నిబద్దత గల దర్శకుడు కాబట్టే అంత ఎత్తుకు ఎదిగారని రెమో చిత్ర యూనిట్ కేఎస్.రవికుమార్ నీతికి ప్రశంసించకుండా ఉండలేకపోయారట.