
‘‘ఈ అమ్మాయి (లక్ష్మీ మంచు) ఎవరు? ‘ఇంట్లో ట్రెడిషనల్‌గా, బయట మోడ్రన్‌గా ఉంటుంది. సడన్‌గా కైలాష్ మానస సరోవర్‡ యాత్రలకు వెళ్తుంది!’ అనే కన్‌ఫ్యూజన్ చాలామందిలో ఉంది. మనకి మనుషులను ఓ కేటగిరీలో పెట్టడం అలవాటు. నన్నెవరైనా ఓ కేటగిరీలో పెడితే... దాన్ని బ్రేక్ చేయడం నా అలవాటు. నేను వాటర్ లాంటిదాన్ని. ఎందులోనైనా ఇమిడిపోగలను’’ అన్నారు లక్ష్మీ మంచు. నేడు ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా శనివారం లక్ష్మీ మంచు మీడియాతో మాట్లాడారు.
► బర్త్‌డే స్పెషల్ ఏంటి?
ఫ్రెండ్స్‌కి పార్టీ ఇస్తున్నా. నాన్నగారి (మంచు మోహన్‌బాబు) దగ్గర్నుంచి బర్త్‌డేని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవడమనే కాన్సెప్ట్ నేర్చుకున్నా. ఈ రోజుకీ డాడీ బర్త్‌డే అంటే మాకు పెద్ద పండగ. అమెరికాలో కాలేజ్ డేస్‌లోనూ నా సొంత డబ్బులతో గ్రాండ్ పార్టీ ఇచ్చేదాన్ని. ఇప్పుడూ అంతే.
► లాస్ట్ బర్త్‌డేకి, ఈ బర్త్‌డేకి మీ లైఫ్‌లో మీరు గమనించిన స్పెషల్ థింగ్ ఏంటి?
నేనింకా బతికున్నా. ఓ నటిగా, ఫిల్మ్ మేకర్‌గా మన చుట్టూ పాజిటివిటీ కంటే ఎక్కువ నెగిటివిటీ ఉంటోంది. ఓ మహిళగా, తెలుగమ్మాయిగా అందరూ నన్నో బాక్స్‌లో ఫిక్స్ చేశారు. నేను సర్కిల్‌లాంటి దాన్ని. బాక్స్‌లో ఎలా ఫిక్స్ అవుతాను? ఎన్ని కష్టా లొచ్చినా... సినిమా బాగున్నా లేకున్నా... నా కలను సాకారం చేసుకోవడానికి ఈరోజు నేను బతికున్నా.
► సినిమాల మధ్య గ్యాప్ వస్తున్నట్టుంది?
లాస్ట్ సిన్మా విషయంలో బాధపడ్డా. నాకు చెప్పిన కథ వేరు, తీసిన సిన్మా వేరు. వాళ్ల వ్యక్తిగత రాజకీయాల కోసం నన్ను మోసం చేశారనే ఫీలింగ్. అందుకే, జాగ్రత్తపడి నచ్చిన సినిమాలు చేయాలనుకుంటున్నా. ప్రస్తుతం జెమిని టీవీ కోసం ‘ఫిదా’ అనే షో, యప్ టీవీ కోసం ‘బేబీస్ డే అవుట్’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నా. స్టార్స్ లైఫ్‌లో ఒక రోజు ఎలా ఉంటుందనేది ‘ఫిదా’లో చూపించబోతున్నాం.
భర్తపై కోపంతో ఓ వారం రోజులు భార్య అతన్ని వదిలేసి వెళ్తే ఏమవుతుంది? అతను పడే టెన్షన్స్ ఏంటి? అనేది క్లుప్తంగా ‘బేబీస్ డే అవుట్’ కాన్సెప్ట్. ‘దొంగాట’ ఫేమ్ వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. విజయ్ అనే కొత్త దర్శకుణ్ణి పరిచయం చేస్తూ, పీపుల్స్ మీడియా గ్రూప్ సంస్థ నిర్మించనున్న థ్రిల్లర్ సిన్మా చేయబోతున్నా.
► మీరెప్పుడైనా మీ భర్త (ఆండీ)పై కోపం వచ్చి అలా వెళ్లిన సందర్భాలున్నాయా?
కోపం రాని రోజు ఉండదేమో (నవ్వుతూ). భార్యకు భర్తపై కోపం రావడం వెరీ కామన్. ఆయన సాధు జంతువు కాబట్టి ఏదొచ్చినా కామ్‌గా ఉంటారు. కోపం అంటే ఏదో కాదు, పనులు సరిగ్గా జరగనప్పుడు వచ్చే చిన్న ఇరిటేషన్ అంతే. పక్కన ఉన్నోళ్లు నా స్పీడ్ అందుకోకపోతే కోపం వస్తుంది. మళ్లీ... నెక్ట్స్ సెకన్‌లో ఉండదది. ‘మేము సైతం’ తర్వాత మరింత కామ్‌గా మారా.
► ‘మేము సైతం’ తర్వాత సహాయం కోసం మీ తలుపు తట్టే ప్రజలు ఎక్కువయ్యారట?
యస్. కానీ, మా ఇంట్లో మామిడిచెట్టుకి మామిడిపళ్లే కాస్తున్నాయి. డబ్బులు కాస్తే బాగుంటుంది. అందరికీ హెల్ప్ చేసేదాన్ని. ఇంటికి వచ్చినవాళ్లను ఆఫీసుకి పంపిస్తా. ఆఫీసులో మా టీమ్, మేం చేయగలిగిన సహాయాన్ని చేస్తున్నారు. ఒకసారి తిరుమల గర్భగుడిలో దేవుడి దగ్గర ఉన్నప్పుడు ‘అక్కడ దేవుణ్ణి చూశాం. ఇక్కడ దేవతను చూశాం’ అంటే ఎలా ఫీలవ్వాలో తెలీదు.
► అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో మీరు సమస్యలపై స్పందిస్తుంటే కొన్ని విమర్శలు వస్తున్నాయి కదా?
నేనేది మాట్లాడినా పాలిటిక్స్ అంటున్నారు. హిందువులుగా మనం ప్రతి పండగను సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ, రోడ్డును తవ్వేసి పందిరిలు వేయడానికి అనుమతి ఎవరిచ్చారు? వాళ్లు మళ్లీ రోడ్లను బాగు చేస్తారా? నీళ్లలో కలిపే వినాయకుడి కోసం రోడ్లు పాడు చేస్తే, బైకర్స్ మెడలు నొప్పి పెడుతున్నాయి. సిటిజన్‌గా నేను బాధపడినప్పుడు సోషల్ మీడియాలో స్పందిస్తా. మొన్న హైటెక్ సిటీ దగ్గర మామూలుగా 20 నిమిషాల్లో వెళ్లే దూరానికి సుమారు రెండు గంటలు పట్టింది. రాజకీయ నాయకులకు అవగాహన లేదేమో? ఉంటే... ఆ టైమ్‌లో అటు ఎందుకొస్తారు? ప్రొటోకాల్ తప్పనడం లేదు.
నాన్న ఎంపీగా ఉన్నప్పుడు ఎక్ట్స్రా సెక్యూరిటీ ఉండేది. కృష్ణదేవరాయులు వంటి రాజులందరూ మఫ్టీల్లో మామూలు మనుషులుగా తిరిగారు కదా! అలా మీరూ బైకుల్లో వెళితే ప్రజల కష్టాలు తెలుస్తాయని చెప్పా. కొందరు రాళ్లు వేయడానికి ప్రయత్నించారు. ఐ డోంట్ కేర్... మీకు నేను నచ్చినా? నచ్చకున్నా? నా మనసులో మాటల్ని చెప్పానంతే. అందరికీ నచ్చాలంటే ‘నాది తప్పు’ అవుతుంది. వెనక్కి తిరిగి చూస్తూ మనం ఎన్ని అడుగులు ముందుకు వేయగలం? అందుకని, నా వెనక తిట్టినోళ్లను నేను పట్టించుకోను. ఆ కామెంట్స్ చూసి ఇరిటేట్ అవుతా. నన్ను ఇరిటేట్ చేసేవాళ్లను బ్లాక్ చేస్తా.
Comments
Please login to add a commentAdd a comment