వర్మచెప్పిన ఎన్టీఆర్‌ కథ | Lakshmi's NTR Telugu Movie Review | Sakshi
Sakshi News home page

వర్మచెప్పిన ఎన్టీఆర్‌ కథ

Published Sat, Mar 30 2019 12:48 AM | Last Updated on Sat, Mar 30 2019 3:58 AM

Lakshmi's NTR Telugu Movie Review - Sakshi

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’లో విజయ్‌కుమార్, యజ్ఞాశెట్టి

ఎన్టీఆర్‌ జీవితంలో వెన్నుపోట్ల వెనుక ఉన్న కథను ప్రేక్షకులకు చెప్తానని ప్రకటించిన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమాతో తాను అనుకున్నది చేసి చూపించాడు. ఎన్టీఆర్‌ జీవితంలో అందరికీ తెలియాల్సిన క్రూరపథకాలు ఉన్నాయని ఈ సినిమాతో చెప్పాడు. పత్రికలు ఈ విషయాలను ఎప్పుడూ రాయలేదని తొక్కిపెట్టాయని చాటింపు వేశాడు. నిజం నివురుకప్పి ఉన్నా ఎప్పుడో ఒకసారి అగ్నిని వెదజల్లుతుందని ఈ సినిమాతో తేల్చి చెప్పేందుకు ప్రయత్నించాడు. ఎన్టీఆర్‌ జీవితంలో చోటు చేసుకున్న కష్టకాలాన్ని, దుఃఖకాలాన్ని, ఆయనను క్షోభకు గురి చేసిన కాలాన్ని ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’తో తెర మీదకు తీసుకువచ్చి  గతకాలపు జర్నీ చేయించాడు. వర్తమానం పట్ల ప్రేక్షకులకు ఆలోచన కలిగించాడు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లో మినహా ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం భారీ ఓపెనింగ్స్‌తో ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ (ట్యాగ్‌ లైన్‌ అసలు కథ) విడుదలైంది. ఏపీలో విడుదల కోర్టు పరిధిలో ఉంది.

కథ విషయానికొస్తే...
ఇది ఎన్టీఆర్‌ కథనా లేదా లక్ష్మీ పార్వతి కథనా లేదా లక్ష్మీపార్వతికి తెలిసిన ఎన్టీఆర్‌ కథనా లేక లోకానికి తెలియని ఎన్టీఆర్‌ కథనా అనేది సినిమా చూశాకనే ప్రేక్షకులకు తెలుస్తుంది. నిన్నమొన్న వచ్చిన ఎన్టీఆర్‌ బయోపిక్‌ రెండు భాగాలు (కథానాయకుడు, మహానాయకుడు) వదిలిపెట్టిన అనేక విషయాలు ఈ సినిమాలో కనిపించాయని ప్రేక్షకులు అనుకుంటారు. ఎన్టీఆర్‌ జీవితంలోకి లక్ష్మీపార్వతి అనే అభిమాని ఎంటరైనప్పటి నుంచి ఎన్టీఆర్‌ మరణించే వరకు జరిగిన సంఘటనలు ఈ సినిమాలో ప్రధాన కథ.

సినిమా కథ ప్రకారం ‘మనదేశం’ పార్టీ స్థాపించి తెలుగువారి విజేతగా నిలిచిన ఎన్టీఆర్‌ (సినిమాలో నటుడు విజయకుమార్‌) 1989లో మొదటిసారి ఓడిపోయినప్పుడు చేదు పరిస్థితులు ఎదుర్కొంటాడు. సొంత కుటుంబం, తను నిర్మించుకున్న రాజకీయ కుటుంబం ఒక్కసారిగా దూరం కావడంతో పలకరించే దిక్కు లేక ఇక రాజకీయాలు వద్దు, జీవితాన్ని ఏదో ఒకలా బతికేస్తానని అనుకుంటాడు. ఆ సమయంలో ఆయన జీవితంలోకి వస్తుంది లక్ష్మీపార్వతి (నటి యజ్ఞా శెట్టి). ఆయన జీవిత చరిత్రను రాయడమే తన జీవితాశయమని చెప్పి ఎన్టీఆర్‌ మనసు ఆకట్టుకుంటుంది.

‘మీరు మామూలు మనిషి కాదు స్వామీ, మీలో చాలా గొప్ప శక్తి ఉంది’ అని ఆయన్ని ఉత్తేజపరుస్తుంది. అలా అడుగుపెట్టిన ఆమె రోజురోజుకూ∙ఆయన జీవితానికి ఎంత దగ్గరయిందీ ఈ క్రమంలో కుటుంబ సభ్యులందరూ ఆమెని ఏ విధంగా ఇబ్బంది పెట్టిందీ కథలో చూపిస్తారు. ఇదంతా ఫస్ట్‌హాఫ్‌లో ఉంటుంది. అయితే వారి బంధాన్ని అప్పటి  మీడియా సహకారంతో ఎన్టీఆర్‌ అల్లుడైన బాబు (సినిమాలో శ్రీతేజ్‌) లక్ష్మీపార్వతిపై విషం చిమ్మడంతో కథపై పట్టు బిగియటం సెకండ్‌ హాఫ్‌లో మొదలవుతుంది.

ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యుల తరపున రాయబారిలా ఎన్టీఆర్‌ వద్దకు వెళ్లిన బాబు మీరు చేస్తున్నది తప్పు అని ఎన్టీఆర్‌ను హెచ్చరిస్తాడు. అప్పటి నుంచి బాబుని దూరం పెడతాడు ఎన్టీఆర్‌. ఆ టైమ్‌లో ఎన్టీఆర్‌ని ‘మేజర్‌ చంద్రకాంత్‌’ సినిమా చేయమని అడుగుతాడు ఒక ఆత్మీయ నటుడు. ఆ సినిమా మంచి విజయం సాధిస్తుంది. ఆ సినిమా 100 రోజుల వేడుక తిరుపతిలో భారీగా చేస్తున్నానని ఆ నటుడు ఆహ్వానితుల జాబితాని ఎన్టీఆర్‌కి చూపిస్తాడు.

ఆ జాబితాలో లేని లక్ష్మీపార్వతి పేరుని ఎన్టీఆర్‌ స్వయంగా రాస్తాడు. అది తెలుసుకున్న బాబు ఎలాగైనా ఆ సభకి ఆమె రాకుండా అడ్డుకునేందుకు కుటుంబ సభ్యులందర్నీ ఎన్టీఆర్‌ వద్దకు తీసుకొచ్చి, ఆమె సభకి వచ్చినా ఫర్వాలేదు కానీ, స్టేజ్‌పైకి రానివ్వద్దని ఆంక్షలు విధిస్తాడు. సరేనన్న ఎన్టీఆర్‌ తిరుపతి సభలో ఆమె గురించి ప్రస్తావించడమే కాక ఆమెను అర్ధాంగిగా స్వీకరిస్తున్నానని సభాముఖంగా తెలియజేస్తాడు. దాంతో కుటుంబ సభ్యులతో పాటు అందరూ నివ్వెరపోతారు.

అక్కడి నుంచి బాబు తన రాజకీయ చదరంగాన్ని ప్రారంభిస్తాడు. ఆమెను అనేకసార్లు దూషించిన బాబు ఆమెకే ఫోను చేసి, సంధి చేసుకుని ఎన్టీఆర్‌కి మళ్లీ దగ్గరవుతాడు. 1994లో మళ్లీ ఎన్టీఆర్‌ తన చరిష్మాతో అత్యధిక సీట్లు గెలుచుకుని సీఎంగా పగ్గాలు చేపడతాడు. ఇది ఓర్వలేని బాబు ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవడం కోసం ఎలాంటి కుట్రలు పన్నాడు? ఎంతమందిని పావులుగా వాడుకున్నాడు? మీడియాని ఎలా హస్తగతం చేసుకున్నాడు?  సీఎంగా ఉన్న ఎన్టీఆర్‌ని ఎలా వెన్నుపోటు పొడిచాడనేది ప్రీ క్లైమాక్స్‌.

సినిమాలో వైశ్రాయ్‌ ఉదంతాన్ని ఎమోషనల్‌గా చూపించాడు వర్మ.  74 ఏళ్ల వయస్సులో ఒక సీఎం పదవిలో ఉండి ఎంతో జీవితాన్ని చూసిన ఎన్టీఆర్‌ ఏడుస్తూ ఉండే సంఘటన చూసిన ఎవరైనా చలించిపోతారు. ‘సొంత కొడుకులు, సొంత కూతుళ్లు, అల్లుళ్లు, నా బొమ్మతో గెలిచిన ఎమ్మెల్యేలు నన్ను వెన్నుపోటు పొడిచారు. చెప్పులతో దాడి చేశారు. ఆ సంఘటన జరిగిన రోజునే నేను చచ్చిపోయాను లక్ష్మీ’ అని ఎన్టీఆర్‌ అంటారు.
 
విశ్లేషణ
ఇది దర్శకుడు వర్మ తాను పరిశోధించి తాను యదార్థమని తలిచి చెప్పిన కథ. ఎన్టీఆర్‌ వంటి ఓ గొప్పనాయకుడు ఎందుకు ఒంటరివాడయ్యారు? ఆ  సమయంలో లక్ష్మీ పార్వతికి ఎలా దగ్గర అయ్యారు? వారి మధ్య ప్రేమ చిగురించడానికి దారితీసిన సంఘటనలు ఏంటి? లక్ష్మీపార్వతి మీద ఎన్టీఆర్‌ కుటుంబం ఎలాంటి కుట్రలు చేసింది? ఆ కుట్రలకు ముఖ్య కారకులు ఎవరు? ఎన్టీఆర్‌ మరణానికి కారణమైన వెన్నుపోటు వెనక ఉన్న అసలు వ్యక్తి ఎవరు? వంటి అంశాలను ప్రేక్షకుల కళ్లకు కట్టేట్టు చూపించారు.   

ఎవరెలా చేశారంటే...  
పాత్రల ఎంపిక విషయంలో వర్మ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఎన్టీఆర్‌ పాత్ర చేసిన రంగస్థల నటుడు పి.విజయ్‌ కుమార్‌ ఆహార్యం, హావభావాలు, డైలాగ్‌ డెలివరీ అచ్చం ఎన్టీఆర్‌ను తలపించింది. లక్ష్మీపార్వతి పాత్రలో యజ్ఞాశెట్టి ఆకట్టుకుంది. ఎన్టీఆర్‌ పట్ల ప్రేమ, అమాయకత్వం, బాధ, వేదన, అవమాన భారం.. ఇలా అన్ని భావాలను అద్భుతంగా పలికించింది. బాబు పాత్ర చేసిన శ్రీతేజ్‌ సినిమాకు హైలైట్‌గా నిలిచాడు.  వెన్నుపోటు రాజకీయాలు చేసే కుటిల రాజకీయ నాయకుడిగా ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.  క్లైమాక్స్‌లో ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతిల మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను కదిలించే లా ఉన్నాయి.  

సాంకేతిక నిపుణుల పనితీరు...  
నిజజీవిత కథలను తెర మీద మలచడం వర్మకు బాగా తెలుసు. అందుకు నిదర్శనం ఆయన తీసిన ‘రక్తచరిత్ర‘, ‘కిల్లింగ్‌ వీరప్పన్‌’, ‘వంగవీటి’ తదితర చిత్రాలు. ఇప్పుడు ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ ఆ విషయాన్ని మరోసారి నిరూపించింది. పకడ్బందీ స్క్రీన్‌ప్లేతో వర్మ ఈ కథను నడిపారు. ఈ సినిమాకి కళ్యాణి మాలిక్‌ సంగీతం, నేపథ్య సంగీతం మరో ప్లస్‌ పాయింట్‌. రమ్మీ అందించిన ఫోటోగ్రఫీ చాలా కొత్తగా ఉంది.

డైలాగులు...
► నా 70 ఏళ్ల జీవితంలో చేసిన ఒకే ఒక తప్పు వాడిని నేను నమ్మడం..
► పాముకు పాలుపోసి పెంచినా అది విషంతోనే కాటేస్తుంది.. వాడూ అంతే...
► జీవితం ఎప్పుడు ఎందుకు ఎలా మలుపు తిరుగుతుందో ఎవ్వరికీ అర్థం కాదు
► మీరు నా పిల్లలు అయ్యుండి కూడా వాడితో చేరారా సిగ్గు లేకుండా ఛీ..
► తమ్ముళ్లూ.. వాడి మాట వినకండి.. మీకు నేనున్నా.. ధైర్యంగా బయటకు రండి
► ఇక పార్టీలో ఏ నిర్ణయమైనా నాకు తెలీయకుండా జరగడానికి వీల్లేదు.
► అబద్ధానికి నోరు పెద్దది.. అన్యాయానికి చేతులు పెద్దవి.


తారాగణం: విజయ్‌ కుమార్, యజ్ఞాశెట్టి, శ్రీతేజ్‌
దర్శకత్వం: రామ్‌గోపాల్‌ వర్మ, అగస్త్య మంజు
నిర్మాత: రాకేష్‌ రెడ్డి, దీప్తి బాలగిరి
సంగీతం: కల్యాణీ మాలిక్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement