Yagna Shetty
-
ఆ ప్రశంసను మరచిపోలేను
‘‘నాటకాల్లో నేను అచ్చం ఎన్టీఆర్‌గారిలా చేస్తానని ఎవరో రామ్‌గోపాల్ వర్మగారికి చెప్పారు. అప్పుడు వర్మగారు నాకు ఓ డైలాగ్ పంపించి ఎన్టీఆర్‌గారిలా చేసి పంపమన్నారు. పంపిన వీడియో చూసి ఎన్టీఆర్‌గారి పాత్రకు తీసుకున్నారు’’ అన్నారు విజయ్‌కుమార్. యజ్ఞాశెట్టి, శ్రీతేజ్, విజయ్ కుమార్ ముఖ్య తారలుగా రామ్‌గోపాల్ వర్మ, అగస్త్య మంజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. రాకేష్ రెడ్డి, దీప్తి బాలగిరి నిర్మించిన ఈ సినిమా మార్చి 29న ఏపీ మినహా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రంలో లీడ్ రోల్స్‌లో నటించిన విజయ్ కుమార్ (ఎన్టీఆర్), యజ్ఞాశెటి ్ట(లక్ష్మీ పార్వతి), శ్రీతేజ్ (బాబు) హైదరాబాద్‌లో సోమవారం విలేకరులతో ముచ్చటించారు. విజయ్ కుమార్ మాట్లాడుతూ– ‘‘నాకు 45ఏళ్ల నాటకానుభవం ఉంది. సినిమా అవకాశాల కోసం హైదరాబాద్‌లో ఉంటున్నాను కానీ సరైనవి రాలేదు. ఎన్టీఆర్‌గారి పాత్ర చేసే అవకాశం ఇచ్చిన వర్మగారికి థ్యాంక్స్. సినిమాలకు పునాది నాటకాలు. నాటకాలకు ఇప్పుడు కూడా ప్రజాదరణ ఉంది. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో వందలకొద్దీ కళా పరిషత్‌లు ఉన్నాయి. నాటకానుభవం ఉండటంతో సినిమాలో నటించడం కష్టం అనిపించలేదు. రెండు మూడు రోజులు కొత్తగా అనిపించిందంతే. ఓసారి నా నాటకం చూసిన సి.నారాయణరెడ్డిగారు ‘మా అన్నగారు (ఎన్టీఆర్) కనిపించారు’ అన్నారు. ఆ ప్రశంస మరచిపోలేను. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చేస్తున్నప్పుడు వర్మగారితో మాట్లాడుతుంటే నటరాజుతో మాట్లాడినట్టు అనిపించింది. ‘ఎన్టీఆర్‌గారి పాత్రకు మిమ్మల్ని ఎంపిక చేసుకోవడంతో చాలామంది నన్ను తప్పుబట్టారు. నేను చెప్పినదాంట్లో మీరు కనీసం 50 శాతం నటిస్తే చాలనుకున్నా. కానీ 100 శాతం చేశారు’ అని వర్మగారు చెప్పడం నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్. నటులకు రాజకీయాలతో సంబంధం లేదు. ఆర్టిస్ట్‌ని ఆర్టిస్ట్‌గానే చూడాలి’’ అన్నారు. శ్రీతేజ్ మాట్లాడుతూ– ‘‘నటుడిగా నేను కెరీర్ స్టార్ట్ చేసి 13ఏళ్లయినా సరైన బ్రేక్ రాలేదు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా నా కెరీర్‌కి టర్నింగ్ పాయింట్. ఇండస్ట్రీలో ఓ గుర్తింపు తీసుకొచ్చింది. చంద్రబాబునాయుడుగారి పాత్ర చాలా బాగా చేశావంటూ అందరూ అభినందిస్తుంటే సంతోషంగా ఉంది. ‘వంగవీటి’లో దేవినేని నెహ్రూగారి పాత్ర, ‘యన్.టి.ఆర్ కథానాయకుడు, మహానాయకుడు’ చిత్రాల్లో వైఎస్ రాజశేఖరరెడ్డిగారి పాత్ర, ఈ సినిమాలో చంద్రబాబుగారి పాత్ర చేశా. వరుసగా బయోపిక్ చిత్రాల్లో నటిస్తుండటం ఎగై్జటింగ్‌గా ఉంది. నేను రెగ్యులర్ యాక్టర్‌గా ఉండకూడదనుకుంటున్నా. కైకాల సత్యనారాయణ, రావుగోపాలరావు, నాగభూషణం, ప్రకాశ్‌రాజ్, రావు రమేశ్గార్లలా విలక్షణమైన పాత్రలు చేయాలని ఉంది. ఈ తరంలో మేము వారిలా గొప్ప పాత్రలు చేయడం లేదు. బాలీవుడ్ నుంచి ఇర్ఫాన్‌ఖాన్, నవాజుద్దీన్ సిద్దిఖీ లాంటి విలక్షణమైన నటులను టాలీవుడ్‌కి తెచ్చుకుంటున్నాం. వారిలా విలక్షణమైన పాత్రలు చేయాలన్నదే నా లక్ష్యం. ఈ ఏడాది మార్చి 29వ తేదీ శుక్రవారం నా భవిష్యత్‌ని మార్చేసింది. ఇందుకు వర్మగారికి, అగస్త్యమంజుగారికి ధన్యవాదాలు. కొన్ని సినిమాలకు చర్చలు జరగుతున్నాయి’’ అన్నారు. యజ్ఞాశెట్టి మాట్లాడుతూ– ‘‘వర్మగారితో ‘కిల్లింగ్ వీరప్పన్’ సినిమా చేశా. ఆ తర్వాత ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఈ సినిమా కోసం లుక్ టెస్ట్ చేసి, ఓకే చేశారు. ఇందులో లక్ష్మీ పార్వతిగారి పాత్ర నాకు ఓ చాలెంజ్. కథ చాలా సెన్సిటివ్. నాకు తెలుగు రాదు. కానీ, తెలుగు లిటరేచర్ని పెట్టుకుని డైలాగ్స్ నేర్చుకున్నాను. ఈ సినిమా నా కెరీర్లో ఓ మైలురాయి. ప్రస్తుతం బాలాజీ దర్శకత్వంలో ‘9 డైరీస్’ అనే ద్విభాషా చిత్రం (తెలుగు, కన్నడ) చేస్తున్నా’’ అన్నారు. హరికృష్ణ పాత్రధారి గంగాధర్ పాల్గొన్నారు. -
వర్మగారి నమ్మకమే ముందుకు నడిపించింది
‘‘అవకాశం వచ్చినప్పుడే మనలో ఉన్న సామర్థ్యం బయటకు తెలుస్తుంది. నా పదిహేనేళ్ల కెరీర్లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వంటి బ్లాక్‌బస్టర్ కోసమే ఎదురుచూస్తున్నాను. సంగీతదర్శకునిగా ఇది నా 16వ సినిమా. వర్మగారితో ఫస్ట్ టైమ్ వర్క్ చేశాను. నా కెరీర్‌ను బిఫోర్ ఆర్జీవీ (రామ్‌గోపాల్ వర్మ).. ఆఫ్టర్ ఆర్జీవీ అని చెప్పేంత స్పందన వచ్చింది ఈ సినిమాకు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను మెచ్చుకుంటున్నారు’’ అన్నారు కల్యాణీ మాలిక్. విజయ్ కుమార్, యజ్ఞా శెట్టి, శ్రీతేజ ముఖ్య తారలుగా రామ్‌గోపాల్‌వర్మ, అగస్త్య మంజు దర్శకత్వం వహించిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్: అసలు కథ’. ఏ జీవీ, ఆర్జీవీ ఫిల్మ్స్ సమర్పణలో రాకేశ్ రెడ్డి, దీప్తి బాలగిరి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంగీతం అందించిన కల్యాణీ మాలిక్, గీత రచయిత సిరాశ్రీ హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. కల్యాణీ మాలిక్ మాట్లాడుతూ– ‘‘అనుకోకుండా సంగీత దర్శకుడిని అయ్యాను. మా అన్నయ్య (యం.యం. కీరవాణి), నేను ఇద్దరం మ్యూజిక్ డైరెక్టర్స్ విభాగంలోనే ఉన్నాం. క్రిష్ ‘యన్.టీ.ఆర్’కి అన్నయ్య సంగీత దర్శకునిగా చేశారు. నేను వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్: అసలు కథ’ చిత్రానికి సంగీతం అందించాను. ఎవరి సృజనాత్మక శైలి వారికి ఉంటుంది. ఆయనతో నాకు పోలిక పెట్టడం నాకు ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఒక కుటుంబంలో ఉన్న ఇద్దరు అన్నదమ్ములు ఒకే డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు పోలికలు పెట్టడం కామనే. కానీ ఆయన స్థాయికి నేను అస్సలు సరిపోను. ఆయనతో నేను సరితూగుతానా? అన్న భయం నాకు జీవితాంతం ఉంటుంది. కానీ ట్రావెల్లో ముందుకు వెళ్లాలి. రాజమౌళి సినిమాలకు సౌండ్ సూపర్ విజనింగ్ చేస్తుంటాను. అన్నయ్య ప్రతి సినిమాకు నేను పని చేయలేదు. వర్మగారితో తొలిసారి పని చేయడం హ్యాపీ. నేను ఊహించినదానికన్నా ఎక్కువగా ఈ సినిమాకు నాకు పేరు వచ్చింది. ఈ సినిమాకు ముందు రామ్‌గోపాల్‌వర్మగారితో నాకు పరిచయం లేదు. రచయిత సిరాశ్రీ వల్లే ఈ సినిమాకు పని చేసే అవకాశం నాకు వచ్చింది. సిరాశ్రీగారితో కూడా నాకు ఇంతకుముందు పరిచయం లేదు. ఫేస్బుక్ ఫ్రెండ్స్ మేము. ఈ సినిమాకు సంగీతం అందించే అవకాశం డెస్టినీగా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమాకు అవకాశం వచ్చినప్పుడు ‘నేను సంగీతం అందించగలనా?’ అనే భయం వేసింది. వర్మగారు నా పై ఉంచిన నమ్మకం నన్ను ముందుకు నడిపించింది. ఇందులో 11 పాటలు ఉన్నాయి. ఇలాంటి పాటలు చేయలేదు. నా కెరీర్‌కు బాగా ఫ్లస్ అయ్యింది. వివాదాలను మా వరకు రానివ్వరు వర్మగారు. ఆయన దగ్గర పక్కా ప్రణాళిక ఉంటుంది. నా కెరీర్ పట్ల నేను సంతృప్తిగానే ఉన్నాను. కల్యాణీ మాలిక్ మంచి సంగీతం ఇవ్వగలడనే పేరును నిలబెట్టుకోవాలి’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ–‘‘అస్ట్రాలజీ, న్యూమరాలజీ ప్రకారం నేను పేర్లు మార్చుకోలేదు. ఇక కెరీర్లో కల్యాణీ మాలిక్గానే కొనసాగుతాను. కీర్తీసురేశ్ సినిమాకు వర్క్ చేస్తున్నాను. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ఫైనల్ స్టేజ్‌లో సౌండ్ సూపర్ విజనింగ్లో నా పని మొదలవుతుంది’’ అని చెప్పుకొచ్చారు. ఆయన ఆంచనాలకు అందరు సిరాశ్రీ మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకు దాదాపు 150 పాటలు రాశాను. అందులో 50కి పైగా పాటలు వర్మగారి చిత్రాలకు రాశాను. ఆయన పిలిస్తే ఇండస్ట్రీలో చాలా మంది లిరిసిస్టులు ఉన్నారు. కానీ ఆయన నాకే అవకాశం ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. వర్మగారిని నేను ఒక ఈవెంట్‌గా చూస్తాను. మన మైండ్సెడ్తో ఆయన్ను అర్థం చేసుకోలేం. ఫిలసాఫికల్ ఔట్లుక్ వస్తుంది. వర్మగారు అంచనాలకు అందనివారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మ్యూజిక్ డిస్కషన్స్‌లో ‘ఇది ఆర్జీవీ మ్యూజిక్‌లా ఉండకూడదంటే ఏం చేయాలి. ‘శంకరాభరణం, మేఘ సందేశం’లా బెంచ్‌మార్క్ క్లాసిక్ సంగీతంలా ఉండాలి’’ అని నాతో ఆర్జీవీగారు అన్నారు. వెంటనే నాకు కల్యాణీ మాలిక్‌గారి పేరు మైండ్లోకి వచ్చింది. ఆ తర్వాత ఆయన సంగీతం అందించిన ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాలోని పాటను వినిపించాను. వెంటనే ఆర్జీవీగారు కల్యాణి మాలిక్‌ను తీసుకుందాం అన్నారు. వర్మగారికి సాహిత్యంపై పట్టు ఉంది. ఆయనకు ఎన్టీఆర్‌గారంటే విపరీతమైన అభిమానం. అగస్త్య మంజు ఈ సినిమాకు చీఫ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పడిన కష్టానికి దర్శకత్వంలో అర్ధభాగం ఇచ్చారు వర్మగారు. జయాపజయాల గురించి పెద్దగా ఆలోచించను. నా కెరీర్ పట్ల నేను హ్యాపీగా ఉన్నాను. ఖాళీ లేకుండానే పని చేస్తున్నాను’’ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ‘లక్ష్మీస్ఎన్టీఆర్: అసలు కథ’ చిత్రం విడుదల కాకపోవడం చాలా బాధగా ఉంది. బాగా నిరుత్సాహపడ్డాను. ఆంధ్రప్రదేశ్‌లో విడుదల కాకపోవడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. అక్కడ కూడా విడుదలైతే... ఇంత మంచి పేరు అక్కడ కూడా వచ్చి ఉండేదనే ఫీలింగ్ ఉంది. నా పరంగానే కాదు నిర్మాత కూడా చాలా నష్టపోయి ఉంటారు. నా సొంత ఊరు కొవ్వూరు. నా సొంత ఊరు కొవ్వూరులో నేను పని చేసిన సినిమా విడుదల కాలేదు. -
వర్మచెప్పిన ఎన్టీఆర్ కథ
ఎన్టీఆర్ జీవితంలో వెన్నుపోట్ల వెనుక ఉన్న కథను ప్రేక్షకులకు చెప్తానని ప్రకటించిన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో తాను అనుకున్నది చేసి చూపించాడు. ఎన్టీఆర్ జీవితంలో అందరికీ తెలియాల్సిన క్రూరపథకాలు ఉన్నాయని ఈ సినిమాతో చెప్పాడు. పత్రికలు ఈ విషయాలను ఎప్పుడూ రాయలేదని తొక్కిపెట్టాయని చాటింపు వేశాడు. నిజం నివురుకప్పి ఉన్నా ఎప్పుడో ఒకసారి అగ్నిని వెదజల్లుతుందని ఈ సినిమాతో తేల్చి చెప్పేందుకు ప్రయత్నించాడు. ఎన్టీఆర్ జీవితంలో చోటు చేసుకున్న కష్టకాలాన్ని, దుఃఖకాలాన్ని, ఆయనను క్షోభకు గురి చేసిన కాలాన్ని ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’తో తెర మీదకు తీసుకువచ్చి గతకాలపు జర్నీ చేయించాడు. వర్తమానం పట్ల ప్రేక్షకులకు ఆలోచన కలిగించాడు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లో మినహా ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం భారీ ఓపెనింగ్స్‌తో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ (ట్యాగ్ లైన్ అసలు కథ) విడుదలైంది. ఏపీలో విడుదల కోర్టు పరిధిలో ఉంది. కథ విషయానికొస్తే... ఇది ఎన్టీఆర్ కథనా లేదా లక్ష్మీ పార్వతి కథనా లేదా లక్ష్మీపార్వతికి తెలిసిన ఎన్టీఆర్ కథనా లేక లోకానికి తెలియని ఎన్టీఆర్ కథనా అనేది సినిమా చూశాకనే ప్రేక్షకులకు తెలుస్తుంది. నిన్నమొన్న వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు (కథానాయకుడు, మహానాయకుడు) వదిలిపెట్టిన అనేక విషయాలు ఈ సినిమాలో కనిపించాయని ప్రేక్షకులు అనుకుంటారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి అనే అభిమాని ఎంటరైనప్పటి నుంచి ఎన్టీఆర్ మరణించే వరకు జరిగిన సంఘటనలు ఈ సినిమాలో ప్రధాన కథ. సినిమా కథ ప్రకారం ‘మనదేశం’ పార్టీ స్థాపించి తెలుగువారి విజేతగా నిలిచిన ఎన్టీఆర్ (సినిమాలో నటుడు విజయకుమార్) 1989లో మొదటిసారి ఓడిపోయినప్పుడు చేదు పరిస్థితులు ఎదుర్కొంటాడు. సొంత కుటుంబం, తను నిర్మించుకున్న రాజకీయ కుటుంబం ఒక్కసారిగా దూరం కావడంతో పలకరించే దిక్కు లేక ఇక రాజకీయాలు వద్దు, జీవితాన్ని ఏదో ఒకలా బతికేస్తానని అనుకుంటాడు. ఆ సమయంలో ఆయన జీవితంలోకి వస్తుంది లక్ష్మీపార్వతి (నటి యజ్ఞా శెట్టి). ఆయన జీవిత చరిత్రను రాయడమే తన జీవితాశయమని చెప్పి ఎన్టీఆర్ మనసు ఆకట్టుకుంటుంది. ‘మీరు మామూలు మనిషి కాదు స్వామీ, మీలో చాలా గొప్ప శక్తి ఉంది’ అని ఆయన్ని ఉత్తేజపరుస్తుంది. అలా అడుగుపెట్టిన ఆమె రోజురోజుకూ∙ఆయన జీవితానికి ఎంత దగ్గరయిందీ ఈ క్రమంలో కుటుంబ సభ్యులందరూ ఆమెని ఏ విధంగా ఇబ్బంది పెట్టిందీ కథలో చూపిస్తారు. ఇదంతా ఫస్ట్‌హాఫ్‌లో ఉంటుంది. అయితే వారి బంధాన్ని అప్పటి మీడియా సహకారంతో ఎన్టీఆర్ అల్లుడైన బాబు (సినిమాలో శ్రీతేజ్) లక్ష్మీపార్వతిపై విషం చిమ్మడంతో కథపై పట్టు బిగియటం సెకండ్ హాఫ్‌లో మొదలవుతుంది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల తరపున రాయబారిలా ఎన్టీఆర్ వద్దకు వెళ్లిన బాబు మీరు చేస్తున్నది తప్పు అని ఎన్టీఆర్‌ను హెచ్చరిస్తాడు. అప్పటి నుంచి బాబుని దూరం పెడతాడు ఎన్టీఆర్. ఆ టైమ్‌లో ఎన్టీఆర్‌ని ‘మేజర్ చంద్రకాంత్’ సినిమా చేయమని అడుగుతాడు ఒక ఆత్మీయ నటుడు. ఆ సినిమా మంచి విజయం సాధిస్తుంది. ఆ సినిమా 100 రోజుల వేడుక తిరుపతిలో భారీగా చేస్తున్నానని ఆ నటుడు ఆహ్వానితుల జాబితాని ఎన్టీఆర్‌కి చూపిస్తాడు. ఆ జాబితాలో లేని లక్ష్మీపార్వతి పేరుని ఎన్టీఆర్ స్వయంగా రాస్తాడు. అది తెలుసుకున్న బాబు ఎలాగైనా ఆ సభకి ఆమె రాకుండా అడ్డుకునేందుకు కుటుంబ సభ్యులందర్నీ ఎన్టీఆర్ వద్దకు తీసుకొచ్చి, ఆమె సభకి వచ్చినా ఫర్వాలేదు కానీ, స్టేజ్‌పైకి రానివ్వద్దని ఆంక్షలు విధిస్తాడు. సరేనన్న ఎన్టీఆర్ తిరుపతి సభలో ఆమె గురించి ప్రస్తావించడమే కాక ఆమెను అర్ధాంగిగా స్వీకరిస్తున్నానని సభాముఖంగా తెలియజేస్తాడు. దాంతో కుటుంబ సభ్యులతో పాటు అందరూ నివ్వెరపోతారు. అక్కడి నుంచి బాబు తన రాజకీయ చదరంగాన్ని ప్రారంభిస్తాడు. ఆమెను అనేకసార్లు దూషించిన బాబు ఆమెకే ఫోను చేసి, సంధి చేసుకుని ఎన్టీఆర్‌కి మళ్లీ దగ్గరవుతాడు. 1994లో మళ్లీ ఎన్టీఆర్ తన చరిష్మాతో అత్యధిక సీట్లు గెలుచుకుని సీఎంగా పగ్గాలు చేపడతాడు. ఇది ఓర్వలేని బాబు ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవడం కోసం ఎలాంటి కుట్రలు పన్నాడు? ఎంతమందిని పావులుగా వాడుకున్నాడు? మీడియాని ఎలా హస్తగతం చేసుకున్నాడు? సీఎంగా ఉన్న ఎన్టీఆర్‌ని ఎలా వెన్నుపోటు పొడిచాడనేది ప్రీ క్లైమాక్స్. సినిమాలో వైశ్రాయ్ ఉదంతాన్ని ఎమోషనల్‌గా చూపించాడు వర్మ. 74 ఏళ్ల వయస్సులో ఒక సీఎం పదవిలో ఉండి ఎంతో జీవితాన్ని చూసిన ఎన్టీఆర్ ఏడుస్తూ ఉండే సంఘటన చూసిన ఎవరైనా చలించిపోతారు. ‘సొంత కొడుకులు, సొంత కూతుళ్లు, అల్లుళ్లు, నా బొమ్మతో గెలిచిన ఎమ్మెల్యేలు నన్ను వెన్నుపోటు పొడిచారు. చెప్పులతో దాడి చేశారు. ఆ సంఘటన జరిగిన రోజునే నేను చచ్చిపోయాను లక్ష్మీ’ అని ఎన్టీఆర్ అంటారు. విశ్లేషణ ఇది దర్శకుడు వర్మ తాను పరిశోధించి తాను యదార్థమని తలిచి చెప్పిన కథ. ఎన్టీఆర్ వంటి ఓ గొప్పనాయకుడు ఎందుకు ఒంటరివాడయ్యారు? ఆ సమయంలో లక్ష్మీ పార్వతికి ఎలా దగ్గర అయ్యారు? వారి మధ్య ప్రేమ చిగురించడానికి దారితీసిన సంఘటనలు ఏంటి? లక్ష్మీపార్వతి మీద ఎన్టీఆర్ కుటుంబం ఎలాంటి కుట్రలు చేసింది? ఆ కుట్రలకు ముఖ్య కారకులు ఎవరు? ఎన్టీఆర్ మరణానికి కారణమైన వెన్నుపోటు వెనక ఉన్న అసలు వ్యక్తి ఎవరు? వంటి అంశాలను ప్రేక్షకుల కళ్లకు కట్టేట్టు చూపించారు. ఎవరెలా చేశారంటే... పాత్రల ఎంపిక విషయంలో వర్మ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఎన్టీఆర్ పాత్ర చేసిన రంగస్థల నటుడు పి.విజయ్ కుమార్ ఆహార్యం, హావభావాలు, డైలాగ్ డెలివరీ అచ్చం ఎన్టీఆర్‌ను తలపించింది. లక్ష్మీపార్వతి పాత్రలో యజ్ఞాశెట్టి ఆకట్టుకుంది. ఎన్టీఆర్ పట్ల ప్రేమ, అమాయకత్వం, బాధ, వేదన, అవమాన భారం.. ఇలా అన్ని భావాలను అద్భుతంగా పలికించింది. బాబు పాత్ర చేసిన శ్రీతేజ్ సినిమాకు హైలైట్‌గా నిలిచాడు. వెన్నుపోటు రాజకీయాలు చేసే కుటిల రాజకీయ నాయకుడిగా ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతిల మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను కదిలించే లా ఉన్నాయి. సాంకేతిక నిపుణుల పనితీరు... నిజజీవిత కథలను తెర మీద మలచడం వర్మకు బాగా తెలుసు. అందుకు నిదర్శనం ఆయన తీసిన ‘రక్తచరిత్ర‘, ‘కిల్లింగ్ వీరప్పన్’, ‘వంగవీటి’ తదితర చిత్రాలు. ఇప్పుడు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఆ విషయాన్ని మరోసారి నిరూపించింది. పకడ్బందీ స్క్రీన్‌ప్లేతో వర్మ ఈ కథను నడిపారు. ఈ సినిమాకి కళ్యాణి మాలిక్ సంగీతం, నేపథ్య సంగీతం మరో ప్లస్ పాయింట్. రమ్మీ అందించిన ఫోటోగ్రఫీ చాలా కొత్తగా ఉంది. డైలాగులు... ► నా 70 ఏళ్ల జీవితంలో చేసిన ఒకే ఒక తప్పు వాడిని నేను నమ్మడం.. ► పాముకు పాలుపోసి పెంచినా అది విషంతోనే కాటేస్తుంది.. వాడూ అంతే... ► జీవితం ఎప్పుడు ఎందుకు ఎలా మలుపు తిరుగుతుందో ఎవ్వరికీ అర్థం కాదు ► మీరు నా పిల్లలు అయ్యుండి కూడా వాడితో చేరారా సిగ్గు లేకుండా ఛీ.. ► తమ్ముళ్లూ.. వాడి మాట వినకండి.. మీకు నేనున్నా.. ధైర్యంగా బయటకు రండి ► ఇక పార్టీలో ఏ నిర్ణయమైనా నాకు తెలీయకుండా జరగడానికి వీల్లేదు. ► అబద్ధానికి నోరు పెద్దది.. అన్యాయానికి చేతులు పెద్దవి. తారాగణం: విజయ్ కుమార్, యజ్ఞాశెట్టి, శ్రీతేజ్ దర్శకత్వం: రామ్‌గోపాల్ వర్మ, అగస్త్య మంజు నిర్మాత: రాకేష్ రెడ్డి, దీప్తి బాలగిరి సంగీతం: కల్యాణీ మాలిక్ -
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ రివ్యూ
టైటిల్ : లక్ష్మీస్ ఎన్టీఆర్ జానర్ : బయోగ్రాఫికల్ మూవీ తారాగణం : విజయ్ కుమార్, యజ్ఞ శెట్టి, శ్రీ తేజ్ సంగీతం : కల్యాణీ మాలిక్ దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజు నిర్మాత : రాకేష్ రెడ్డి, దీప్తి బాలగిరి సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన మరో బయోగ్రాఫికల్ మూవీ లక్ష్మీస్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తరువాత జరిగిన సంఘటనలు లక్ష్మీ పార్వతికి ఎదురైన అవమానాలు, ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతిల మధ్య ప్రేమానురాగాలను ఈ సినిమాలో ప్రధానంగా చూపించాడు. ఇంకా ముఖ్యంగా తెలుగు రాష్ట్ర రాజకీయాల ముఖ చిత్రాన్ని మార్చేసిన వెన్నుపోటు అంశంపై సినిమాలో చర్చించడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు సినిమా విడుదలను అడ్డుకునేందుకు శతవిదాల ప్రయత్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా రిలీజ్‌పై స్టే విధించటంతో ఇతర ప్రాంతాల్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి వర్మ చెప్పినట్టుగా నిజంగా నిజాలనే తెరకెక్కించాడా..? ఎన్టీఆర్ అసలైన బయోపిక్ ఈ సినిమానేనా..? కథ : లక్ష్మీస్ ఎన్టీఆర్ కొత్త కథేం కాదు, తెలుగు ప్రజలందరికి తెలిసిన కథే. 1989లో ఎన్టీఆర్ (విజయ్ కుమార్) అధికారం కోల్పోయిన సమయంలో ఒంటరిగా ఉన్న ఎన్టీఆర్ దగ్గరకు ఆయన జీవిత చరిత్ర రాసేందుకు లక్ష్మీ (యజ్ఞ శెట్టి) వస్తుంది. ఉన్నత చదువులు చదువుకున్న ఆమె గురించి తెలుసుకున్న ఎన్టీఆర్ జీవిత చరిత్ర రాసేందుకు లక్ష్మీ పార్వతికి అనుమతి ఇస్తాడు. అలా ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించిన లక్ష్మీ పార్వతి గురించి కొద్ది రోజుల్లొనే దుష్ప్రచారం మొదలవుతుంది. ఆ ప్రచారం ఎన్టీఆర్ దాకా రావటంతో మేజర్ చంద్రకాంత్ సినిమా ఫంక్షన్లో లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ఎన్టీఆర్ ప్రకటిస్తాడు. ఎన్టీఆర్ అల్లుడైన బాబు రావ్ ఓ పత్రికా అధిపతితో కలిసి లక్ష్మీ పార్వతి మీద చెడు ప్రచారం మొదలు పెడతాడు. 1994లో లక్ష్మీ తో కలిసి ప్రచారం చేసిన ఎన్టీఆర్ భారీ మెజారిటీ సాధించి తిరిగి అధికారం చేపడతాడు. ఆ తరువాత జరిగిన పరిణామాలు.. కుటుంబాన్ని తనవైపు తిప్పుకున్న బాబు రావు కుట్రలకు తెరతీస్తాడు. కుటుంబ సభ్యులను బెదిరించి తనవైపు తిప్పుకొని ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీ లాక్కుంటాడు. పదవి కోల్పోయి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న ఎన్టీఆర్‌పై వైస్రాయ్ హోటల్ దగ్గర చెప్పులు వేయటంతో కుమిలి కుమిలి చనిపోతాడు. ఇదే లక్ష్మీస్ ఎన్టీఆర్ కథ. నటీనటులు : ఈ సినిమా కోసం వర్మ ఎంచుకున్న ప్రధాన పాత్రదారులంతా తెలుగు ప్రేక్షకులకు కొత్తవారే. ముఖ్యంగా ఎన్టీఆర్ పాత్రలో కనిపించిన విజయ్ కుమార్ అయితే సినీరంగానికే కొత్త. రంగస్థల నటుడిగా ఉన్న విజయ్ కుమార్‌ను ఎన్టీఆర్ లాంటి పాత్రకు ఎంచుకోవటం సాహసం అనే చెప్పాలి. అయితే వర్మ తన మీద పెట్టుకున్న నమ్మకానికి విజయ్ కుమార్ పూర్తి న్యాయం చేశాడు. ఎన్టీఆర్ హావభావాలను, డైలాగ్ డెలివరినీ చాలా బాగా తెర మీద చూపించాడు. మరో కీలక పాత్రలో నటించిన యజ్ఞశెట్టి నటన సినిమాకు హైలెట్‌గా నిలిచింది. నిష్కల్మశమైన ప్రేమ, అమాయకత్వం, బాధ, వేదన, అవమాన భారం ఇలా అన్ని భావాలను తెరమీద అద్భుతంగా పలికించారు యజ్ఞ. బాబు రావు పాత్రలో శ్రీతేజ్ జీవించాడనే చెప్పాలి. కుళ్లు, కుతంత్రం, వెన్నుపోటు రాజకీయాలు చేసే కుటిల రాజకీయ నాయకుడిగా శ్రీ తేజ్ నటన ఆకట్టుకుంటుంది. ఇతర పాత్రలో అంతా కొత్తవారే కనిపించిన ఎవరికి వారు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. విశ్లేషణ : ముందు నుంచి చెపుతున్నట్టుగా వర్మ ఈ సినిమాలో అసలు నిజాలను ప్రేక్షకుల ముందు ఉంచే ప్రయత్నం చేశాడు. ఎన్టీఆర్ అనే మహానాయకుడు ఎలా ఒంటరి వాడయ్యాడు.? ఆ సమయంలో లక్ష్మీకి ఎలా దగ్గరయ్యాడు.? వారిద్దరి మధ్య ప్రేమ ఎలాంటి పరిణామాలకు దారి తీసింది.? లక్ష్మీపార్వతి మీద ఎన్టీఆర్ కుటుంబం ఎలాంటి కుట్రలు చేసింది.? ఆ కుట్రల వెనుక ఉన్న అసలు మనుషులు ఎవరు? చివరకు ఎన్టీఆర్ మరణానికి కారణమైన వెన్నుపోటు వెనుక ఉన్న అసలు వ్యక్తి ఎవరు? అన్న విషయాలను ఈ సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించారు. వర్మ మార్క్ టేకింగ్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. ఎన్టీఆర్, లక్ష్మీల మధ్య సన్నివేశాలను వర్మ తెరకెక్కించిన విధానం ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. అయితే అక్కడక్కడా కాస్త కథనం నెమ్మదించినట్టుగా అనిపించినా ఒకసారి కథలో లీనమైతే అవేవి పెద్దగా ఇబ్బంది పెట్టవు. పాత్రల ఎంపికతోనే సగం విజయం సాదించిన వర్మ.. వారి నుంచి అద్భుతమైన నటనను రాబట్టుకోవటంలోనూ సక్సెస్ అయ్యాడు. ప్రతీ నటుడు తన పాత్రలో లీనమై సహజంగా నటించాడు. సినిమాకు మరో ప్లస్ పాయింట్ కల్యాణీ మాలిక్ సంగీతం. పాటలతో పాటు నేపథ్య సంగీతంతోనూ సన్నివేశాల స్థాయిని పెంచాడు కల్యాణీ మాలిక్. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో సంగీతం సూపర్బ్ అనిపిస్తుంది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : కథా కథనాలు ఎమోషనల్ సీన్స్ సంగీతం మైనస్ పాయింట్స్ : అక్కడక్కడా నెమ్మదించిన కథనం సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
వైశ్రాయ్ ఘటనే పెద్ద కుట్ర
‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని ఈ నెల 22న విడుదల చేయాలనుకున్నాం. కొన్ని సాంకేతిక కారణాల వల్ల 29న విడుదల చేస్తున్నాం. సెన్సార్ సమస్య వల్ల విడుదల వాయిదా పడలేదు. మా సినిమా విడుదలకు కోర్టు, ఎలక్షన్ కమిషన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాయి. ఎన్నికలు అయిపోయేవరకూ మా చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వరంటూ మాకు సమాచారం అందడంతో బోర్డుపై కేసు పెట్టాలనుకున్నాం. అయితే అలాంటిదేమీ లేదని తెలియడంతో ఆ ఆలోచన విరమించుకున్నాం’’ అని రామ్‌గోపాల్ వర్మ అన్నారు. విజయ్ కుమార్, యజ్ఞాశెట్టి లీడ్ రోల్స్‌లో రామ్‌గోపాల్ వర్మ, అగస్త్య మంజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఏ జీవీ ఆర్జీవీ ఫిల్మ్స్ సమర్పణలో రాకేష్ రెడ్డి–దీప్తి బాలగిరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదలకానుంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో వర్మ పంచుకున్న విశేషాలు... బాలకృష్ణకి అంకితం ఎన్టీఆర్‌గారి బయోపిక్ చేద్దామని బాలకృష్ణ అన్నారు. పొలిటికల్ విషయాలు తెలుసుకునేందుకు ఆయనే కొందరు వ్యక్తుల్ని నాకు పరిచయం చేశారు. ఎన్టీఆర్‌గారి జీవితంలోకి లక్ష్మీపార్వతిగారు వచ్చాక జరిగిన ఘటన లేకుండా చేద్దామని బాలకృష్ణ అన్నారు. అందుకు నేను ఒప్పుకోకపోవడంతో మా కాంబినేషన్లో సినిమా ఆగిపోయింది. అయితే బాలకృష్ణ నన్ను సంప్రదించకపోయి ఉంటే మాత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ఐడియా నాకు వచ్చేది కాదు. అందుకే గతంలో ప్రెస్మీట్లో చెప్పినదే మళ్లీ చెబుతున్నా.. ఈ సినిమా బాలకృష్ణకే అంకితం. నా కెరీర్లో చాలా ప్రత్యేకం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నా కెరీర్లో చాలా ప్రత్యేకమైన సినిమా అని ఎందుకు అంటున్నానంటే.. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన తెలుగు వ్యక్తి ఎన్టీఆర్‌గారు. అటు సినిమా రంగంలో, ఇటు రాజకీయాల్లో చరిత్ర సృష్టించారాయన. అలాంటి వ్యక్తి జీవితంలో జరిగిన ఎక్స్ట్రీమ్ ట్రాజెడీని తెరకెక్కించడం డిఫికల్ట్, ఎమోషనల్ టాస్క్. దాన్ని జస్టిస్ చేయడం చాలా పెద్ద బాధ్యత. దాన్ని గుర్తు పెట్టుకునే ఎన్టీఆర్‌గారి వ్యక్తిత్వానికి ఏమాత్రం అగౌరవం కలగకుండా ఈ సినిమా తీశా. నేను నమ్మిన నిజంతో... ‘వైశ్రాయ్ హాటల్’ సంఘటన జరిగినప్పుడు నేను ‘రంగీలా’ సినిమా తీస్తూ బొంబాయిలో ఉన్నా. 25ఏళ్ల కిందట జరిగిన ఆ ఘటనలో వాస్తవం ఏంటన్నది నాకు తెలియదు. ఆ సంఘటన జరిగినప్పుడు రాజకీయాల్లో ఉండి, ప్రస్తుతం లైమ్‌లైట్‌లో లేని దాదాపు 35మందిని కలిసి ఏం జరిగిందన్నది తెలుసుకుని, నేను నిజమని నమ్మిన దాంతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం తీశా. నా మాటను నమ్మని వాళ్లకు సినిమాటిక్‌గా అనిపించవచ్చు. ఈ సినిమా చూశాక ‘ఇలా జరగలేదు’ అనుకుంటే వారు నమ్మినదాన్ని సినిమా తీసుకోవచ్చు. నిజం బయటకు వస్తుందని భయం మాఫియా నేపథ్యంలో బాలీవుడ్లో సినిమాలు తీసినా వివాదాలు లేవు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విషయంలో మాత్రం వివాదాలు రావడానికి కారణం నిజం బయటకు వస్తుందని, ఇంతకు ముందెప్పుడూ తెలియని నిజాలు ఇప్పుడు ప్రజలకు ఎక్కడ తెలుస్తాయేమోననే భయం. అందుకే సినిమా విడుదల కాకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. అవతలివారి దగ్గరే నిజం ఉంటే, సినిమాని ఆపడానికి ఎందుకు ప్రయత్నించాలి? లక్ష్మీపార్వతిగారు వచ్చాకే... ఈ సినిమాని లక్ష్మీపార్వతిగారి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పలేదు. ఎన్టీఆర్‌గారి జీవితంలోకి ఆమె వచ్చినప్పటి నుంచే సినిమా తీశా. ఆమె పైన చాలా అభియోగాలు వచ్చాయి. అయితే ఎన్టీఆర్గారిలాంటి సూపర్‌స్టార్‌కి మామూలు వాళ్లు దగ్గరవలేరు కదా? అంటే ఆమెలో ఏదో ప్రత్యేకం ఉందనేగా? ఈ చిత్రంలో నాదెండ్ల భాస్కరరావుగారి ఎపిసోడ్ ఉండదు. అందుకే కొత్తవారితో... రియలిస్టిక్ క్యారక్టర్లను పెద్దగా ఫేమస్ కానివారు చేసినప్పుడు ఆ పాత్రలు బాగా ఎలివేట్ అవుతాయని నా నమ్మకం. అందుకే ‘వీరప్పన్, వంగవీటి’ చిత్రాలను కూడా కొత్తవాళ్లతోనే చేశా. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో విజయ్‌కుమార్ చక్కగా ఒదిగిపోయారు. థియేటర్ ఆర్టిస్ట్ అయిన ఆయన రెండు నెలలు వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. ఎన్టీఆర్‌గారిని మనం సినిమాల్లోనూ, పొలిటికల్ స్పీచుల్లోనే చూశాం. కానీ, ఆయన లివింగ్ రూమ్‌లో, బెడ్రూమ్లో వ్యవహరించిన తీరు పట్టుకోవడమంటే ఏ నటుడికైనా ఒక ట్రెమండస్ ఎమోషనల్ డెప్త్‌ను కేప్చర్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని ఆయన చాలా బాగా చేశారు. యజ్ఞాశెట్టి కన్నడ నటి. ఏ పార్టీకీ సపోర్ట్ కాదు ఈ సినిమా వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీకి అనుకూలంగా, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉంటుందనడం అవాస్తవం. మనం ఏం చెప్పినా అవతలివాళ్లు ఏది నమ్మాలనుకుంటే దాన్నే నమ్ముతారు. నిర్మాత రాకేష్‌రెడ్డి వైసీపీ అని ముందు నాకు తెలియదు.. తెలిసినా నేను ఏమీ అనేవాడిని కాదు.. అది వేరే విషయం. 25 ఏళ్ల క్రితం జరిగిన కథ ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ఉండొచ్చేమో కానీ, వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఎలా ఉంటుంది? అవి అవాస్తవాలు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదల ఆపేస్తే రూ. 50 కోట్లు ఇస్తామని నిర్మాతకి ఆఫర్ వచ్చిందనేమాట అవాస్తవం. నేను సినిమా మేకర్ని. కష్టపడి ఓ సినిమా చేసినప్పుడు దాన్ని రిలీజ్ చేయాలనే అనుకుంటా. అంతేకానీ విడుదల చేయకూడదనుకోను. సినిమాను విడుదల చేయొద్దని డిస్ట్రిబ్యూటర్లకు బెదిరింపులు వచ్చాయనడం కూడా తప్పు. అవన్నీ యూట్యూబ్ చానళ్లలో వచ్చిన విషయాలు. ఏది అబద్ధమో? నాకు చంద్రబాబు మూలాన నష్టం జరగలేదు.. వైఎస్ జగన్ వల్ల లాభం కూడా లేదు. అటువంటప్పుడు బాబుగారికి వ్యతిరేకంగా ఈ సినిమా తీయాల్సిన అవసరం ఏముంది?. ఎన్టీఆర్‌గారి బయోపిక్ గురించి నేను బాలకృష్ణని కలిశాను. కానీ, ఆయన నన్ను కలవలేదంటున్నారంటే.. ఆయన చెప్పింది అబద్ధమై ఉండాలి. లేదంటే నేను చెప్పిందైనా అబద్ధం అయి ఉండాలి. దేన్ని నమ్ముతారో మీ ఇష్టం (నవ్వుతూ). చంద్రబాబుగారే విడుదల చేయిస్తారు ఇది ప్రజాస్వామ్య దేశం. ఒకరి భావ స్వేచ్ఛను అడ్డుకునే హక్కు మరొకరికి లేదు. మా సినిమాని ఆపడం 100శాతం ఎవరి వల్లా కాదు. చంద్రబాబునాయుడుగారు ముఖ్యమంత్రి కనుక లా అండ్ ఆర్డర్ ఆయన చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఎలాంటి సమస్యలు లేకుండా మా సినిమాని ఏపీలో ఆయనే విడుదల చేయిస్తారు. నాకు చాలా వ్యసనాలున్నాయి వివాదాల వల్ల వచ్చే పబ్లిసిటీ నాకు వ్యసనం అయిపోయిందనే మాట ఉంది. నాకు ఉన్న చాలా వ్యసనాల్లో ఇది కూడా ఓ వ్యసనమైనా పర్వాలేదు. నా కెరీర్లో 90శాతం ఔట్ ఆఫ్ ద బాక్స్ కాంట్రవర్శీలను తీసుకునే సినిమాలు చేశా. ‘సర్కార్, రక్తచరిత్ర, వంగవీటి’... ఇలా ఏదైనా అలాంటిదే. ‘కథానాయకుడు’ చూశా బాలకృష్ణ ‘కథానాయకుడు’ సినిమా చూశా. అందులో ఎక్కడ తప్పు జరిగిందో చెప్పడానికి నేనెవరిని? అయితే నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ లేకుండా సీన్లను పేర్చారనిపించింది. అది కరెక్ట్ కాదు ఆడియన్స్ ఎక్కువగా నెగటివిటీని ఇష్టపడతారనడం కరెక్ట్ కాదు. సినిమాలో ఫండమెంటల్‌గా ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ అనేది మెయిన్. గాంధీ సినిమా చేస్తున్నామని చెప్పి బ్రిటీష్‌ని అందులో నుంచి తీసేస్తే ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ ఎక్కడ ఉంటుంది? సినిమా అంటే ఆయన ఎప్పుడు పుట్టారు? ఏ స్కూల్‌కి వెళ్లారు? ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు? అన్నది కాదు. బ్రిటీషర్ల రాకతో సినిమా ఆపేస్తే ఎలా ఉంటుంది? ఓటర్లకు అవగాహన ఉంటుంది నాయకులు ఇచ్చిన హామీలు, వాటిని నెరవేర్చిన విధానంపై ఓటర్లకు ఓ అవగాహన ఉంటుంది. ఆ నమ్మకంతోనే వారికి ఇష్టమైన వ్యక్తికి ఓటు వేస్తారు. వారు బాగా నమ్మిన వ్యక్తి గురించి సడన్‌గా ఏదో తెలిసి నమ్మకం పోగొట్టుకున్నారనుకోండి.. ఏ మేరకు సాధ్యమవుతుంది? అది ఎంత మందిని ప్రభావితం చేస్తుందనే విషయం నాకు తెలియదు. ముందుపోటు పొడుస్తా... నేను ఎవరికీ వెన్నుపోటు పొడవలేదు. ఎప్పుడూ ముందుపోటే పొడుస్తా. నేను జ్యోతిష్కుడిని కాదు ఆంధ్రప్రదేశ్‌కి కొత్త ముఖ్యమంత్రి ఎవరని చెప్పడానికి నేను జ్యోతిష్కుడిని కాదు. కాకపోతే ఎవరు వచ్చినా ఫరక్ పడదు. మార్పు అనేది ప్రాసెస్‌లో రావాలేగానీ, ఎన్నికలతో జరుగుతుందని అనుకోను. కాకపోతే సీఎంగా ఒక చాయిస్ పవన్ కల్యాణ్, మరో చాయిస్ కేఏ పాల్. పవన్ కల్యాణ్ మంచి అందగాడు. తనొస్తే అందమైన ముఖ్యమంత్రి అవుతాడు. ఇప్పుడు మధ్యలోని సినిమా పేజీల్లో చూసే అతని ఫొటో ముఖ్యమంత్రి అయితే రోజూ మొదటి పేజీలో చూడొచ్చు. కేఏ పాల్ ముఖ్యమంత్రి అయితే ప్రతి రోజూ కామెడీనే. రూ.200 పెట్టి కామెడీ సినిమా చూడాల్సిన అవసరం ప్రజలకు రాదు. ఆయన గతంలో నన్ను ముంబైలో కలిశారు. మనిషి పుట్టి దాదాపు 60వేల ఏళ్లు అవుతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కేఏ పాల్ అంత అబద్ధాలు చెప్పేవారిని నేనెప్పుడూ చూడలేదు. కేసీఆర్ బయోపిక్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌గారి బయోపిక్ గురించి రీసెర్చ్ చేస్తున్నా. ఇందులో వివాదాలేమీ ఉండవు. త్వరలోనే వివరాలు చెబుతా. నేను తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్‌లో ఒకటి సెప్టెంబరులో విడుదల అవుతుంది. చంద్రబాబుగారే ఓ సినిమా తీసుకోవచ్చు ఎన్టీఆర్‌గారి వైపు నుంచి చూస్తే వైశ్రాయ్ హోటల్ ఘటనలో 100శాతం కుట్ర దాగి ఉంది. నాదెండ్ల భాస్కరరావుగారు పార్టీ కోసం తప్ప ఎన్టీఆర్‌గారిని పెద్దగా కలిసింది లేదు. సీబీఎన్ (చంద్రబాబునాయుడు), రక్తసంబంధీకులు, దగ్గరివాళ్లు చేసిన ‘వైశ్రాయ్’ కుట్ర ఎప్పుడూ పెద్ద కుట్రే అవుతుంది. చంద్రబాబు పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనదే నిజమైనప్పుడు బాబుగారే ఒక సినిమా తీసుకోవచ్చు. వార్నింగ్ ఇచ్చారు ఈ సినిమా తీస్తున్న టైమ్‌లో ‘ఇ లాంటి వ్యవహారాలు నీకెందుకు? సినిమా తీయకపోవడమే మంచిది’ అంటూ నాకు కొందరు సలహాలు ఇచ్చారు. కానీ, నేనెవరి సలహాలు పాటించను (నవ్వుతూ).. సినిమా పూర్తయ్యాక విడుదల ఆపాలంటూ టీవీ డిబేట్లో ఉన్నప్పుడు వార్నింగ్‌లు ఇచ్చారు. ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. మనం లీగల్‌గా కరెక్ట్‌గా చేస్తున్నప్పుడు డెమోక్రటిక్ కంట్రీలో ఏదీ కష్టం కాదు. -
లక్ష్మీస్ ఎన్టీఆర్ : సోషల్ మీడియాలో వైస్రాయ్ సీన్
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశం ఆ తరువాతి పరిణామాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్‌పై స్టే ఇవ్వాలంటూ టీడీపీ ఈసీని ఆశ్రయించింది. అయితే ఈ నేపథ్యంలో సినిమాలోని కీలకమైన వైస్రాయ్ హోటల్ సీన్లో సోషల్ మీడియాలో లీకైంది. చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలను దాచిన వైస్రాయ్ హోటల్ ముందు చైతన్య రథంపై ఎన్టీఆర్ ప్రసంగించటంలో ఆయనపై ప్రత్యర్థులు చెప్పులతో దాడి చేయటం, దీంతో ఎన్టీఆర్.. అంతా కలిసి నన్ను చంపేశారు అంటూ బాధపడటం లాంటి అంశాలు ఈ లీకైన వీడియోలో ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మ స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు అగస్త్య మంజు మరో దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. రంగస్థల నటుడు విజయ్ కుమార్ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తుండగా యగ్నా శెట్టి లక్ష్మీ పార్వతిగా కనిపించనున్నారు. శ్రీతేజ్ చంద్రబాబు నాయుడు పాత్రలో నటిస్తున్నాడు. కల్యాణీ మాలిక్ సంగీతమందిస్తున్న ఈ సినిమా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఎన్టీఆర్ సందేశం.. ‘వాడు గాడ్సే కన్నా అధముడు’
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. వర్మ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రమోషన్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ట్రైలర్లు, వీడియో సాంగ్స్‌తో సినిమా మీద అంచనాలు తారాస్థాయికి చేరాయి. తాజాగా ఎన్టీఆర్ సందేశం పేరుతో మరో వీడియోను రిలీజ్ చేశారు వర్మ. ‘ఎన్టీఆర్ స్వయంగా చంద్రబాబు నాయుడు తనను ఎలా వెన్నుపోటు పొడిచారో చెప్పాడు’ అంటూ దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన పుస్తకం ఆధారంగా అప్పటి ఎన్టీఆర్ వ్యాఖ్యలను వీడియో రూపంలో రిలీజ్ చేశారు వర్మ. ‘చంద్రబాబు వెన్నుపోటు పొడిచింది నాకు కాదు.. నాకు అధికారం ఇచ్చిన మీకు’ అంటూ ప్రజలతో ఎన్టీఆర్ తన ఆవేదనను ఎలా పంచుకున్నారు. ప్రజాస్వామ్యం బాగుండాలంటే ఎవరికి ఓటేయాలని ఎన్టీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు అన్న అంశాలను రామ్ గోపాల్ వర్మ ఆ వీడియోలో ఎన్టీఆర్ సందేశంగా వినిపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చంద్రబాబును ఉద్దేశింంచి ’నువ్వే మామకు వెన్నుపోటు పొడవటంలో సీనియర్వీ’ అంటూ చేసిన వ్యాఖ్యలతో రూపొందించిన ప్రొమోను సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు వర్మ. Prime minister @narendramodi talking about how Andhra Pradesh Chief Minister @ncbn Back Stabbed NTR #LakshmisNTR promo pic.twitter.com/aQk7Dcem6B — Ram Gopal Varma (@RGVzoomin) 12 March 2019 రంగస్థల నటుడు పీ విజయ్ కుమార్ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో యగ్నా శెట్టి లక్ష్మీ పార్వతి పాత్రలో నటిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజు సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు కల్యాణీ మాలిక్ సంగీతమందిస్తున్నాడు. -
ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా వర్మ..!
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ జీవితం ఆధారంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసింది. ప్రకటన దగ్గర నుంచి ఎన్నో వివాదాలకు కారణమైన ఈ సినిమా ఒక్క అప్డేట్తో మరిన్ని వివాదాలకు తెరతీస్తూ వస్తోంది. ఇప్పటికే రెండు పాటలను విడుదల చేసిన వర్మ తాజాగా ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా మరో బాంబు పేల్చేందుకు సిద్ధమయ్యారు. ఈ రోజు (శుక్రవారం) సాయంత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు సంబంధించి మరో అప్డేట్ను ఇవ్వనున్నట్టుగా ప్రకటించారు. రామ్ గోపాల్ వర్మ స్వయంగా దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న ఈ సినిమాలో లక్ష్మీ పార్వతి పాత్రలో యాగ్న శెట్టి నటిస్తున్నారు. కీలకమైన చంద్రబాబు నాయుడు పాత్రలో వంగవీటి ఫేం శ్రీతేజ్ కనిపించనున్నాడు. ఎన్టీఆర్ పాత్రలో కనిపించబోయే నటుడినే వర్మ ఈ రోజు ప్రకటిస్తారన్న టాక్ వినిపిస్తోంది. వర్మ ఈరోజు ఎలాంటి వివాదాలకు తెరలేపుతాడో తెలియాలంటే ఐదు గంటల వరకు వెయిట్ చేయాల్సిందే. Watch NTR become alive on his death anniversary at 5 pm today #LakshmisNTR The True Story pic.twitter.com/Bg1l4ZcLrg — Ram Gopal Varma (@RGVzoomin) 18 January 2019 -
లక్ష్మీపార్వతి పాత్ర రివీల్ చేసిన ఆర్జీవీ
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రెండు పాటలు విడుదల చేసి సంచలనం సృష్టించాయి. ఆర్జీవీ లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రకటన చేసినప్పటి నుంచే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో ఏ పాత్రల్లో ఎవరు కనిపిస్తున్నారో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రజల్లో నెలకొంది. అయితే తాజాగా లక్ష్మీపార్వతి పాత్ర ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. లక్ష్మీపార్వతి పాత్రలో యజ్ఞ శెట్టి నటిస్తుందని చెప్పిన వర్మ.. ఆ పాత్రకు సంబంధించి పలు ఫొటోలను ట్విటర్లో పోస్ట్ చేశారు. యజ్ఞ శెట్టి గతంలో వర్మ దర్శకత్వం వహించిన ‘కిల్లింగ్ వీరప్పన్’ చిత్రంలో వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి పాత్రలో నటించారు. ఈ చిత్రాని సంబంధించిన రెండో పాటలో ‘అబద్దాలుగా చెలామణి అవుతున్న నిజాలను.. నిజాలుగా మసిపూసుకున్న అబద్దాలను బండకేసి కొట్టి ఉతికి ఆరేయడమే లక్ష్మీస్ ఎన్టీఆర్ ధ్యేయమ’ని చెప్పిన వర్మ.. సినిమాను త్వరలోనే సినిమాను విడుదల చేయనన్నట్టు తెలిపారు. నందమూరి బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతుండగా ఆ సినిమాలో చూపించని ఎన్నో నిజాలు తన సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో ఉంటాయని రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే ప్రకటించాడు. జీవీ ఫిలిమ్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు కల్యాణీ మాలిక్ సంగీతమందిస్తున్నారు. -
మూడు దశాబ్దాల కథ
కిశోర్‌కుమార్, యగ్నా శెట్టి జంటగా తమిళంలో రూపొందిన ఓ చిత్రం ‘రణరంగం’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. ఏఆర్ మూవీ ప్యారడైజ్ పతాకంపై ఎ. రామమూర్తి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఎ.రామమూర్తి మాట్లాడుతూ– ‘‘మూడు దశాబ్దాల కథతో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందింది. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. తమిళంలో ఘనవిజయం సాధించింది. మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా ఇచ్చిన పాటలు ఓ హైలైట్. తమిళంలోలానే తెలుగులోనూ ఈ చిత్రం ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. శరణ్. కె. అద్వైతన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సులీలే కుమార్, మిధున్ కుమార్, రజినీ మహదేవయ్య, అజయ్ రత్నం, ధీరజ్ రత్నం తదితరులు ఇతర పాత్రలు పోషించారు. -
మరో బోల్డ్ ఆపరేషన్
రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ ఫీవర్ స్టార్టయ్యింది. ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధమయింది. ఇలాంటి టైమ్‌లో రాజకీయ, సామాజిక అంశాలతో తయారయ్యే కథలపై చాలామందికి ఆసక్తి ఉంటుంది. ఆ కోవకు చెందిన సినిమానే ‘ఆపరేషన్ 2019’. ‘బివేర్ ఆఫ్ పబ్లిక్’ అనేది ఉప శీర్షిక. అలివేలు ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి అలివేలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి కరణం బాబ్జి దర్శకుడు. ‘‘మాది సెన్సేషనల్ పొలిటికల్ ఎడ్వంచర్ మూవీ. ఈ నెల 28న విడుదల చేయనున్నాం’’ అని దర్శకుడు అన్నారు. ‘ఆపరేషన్ ధుర్యోధన’ లాంటి బోల్డ్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు శ్రీకాంత్. ఆయన హీరోగా నటిస్తూ, సమర్పిస్తున్న ‘ఆపరేషన్ 2019’ కూడా అంతే బోల్డ్‌గా ఉంటుందట. శ్రీకాంత్ సరసన యజ్ఞా శెట్టి , ధీక్షా పంత్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. ఆయనతో పాటు మరో ఇద్దరు హీరోలు కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఇంకా సుమన్, కోట శ్రీనివాసరావు, పోసాని కృష్ణ మురళీ, నాగినీడు, హరితేజలతో పాటు దాదాపు 40 మంది నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ర్యాప్ రాక్ షకీల్, కెమెరా: వెంకట ప్రసాద్. -
ఆయనంటే అందరికీ ఇష్టమే
‘‘ఆపరేషన్ 2019’ ట్రైలర్ చాలా బాగుంది. డైరెక్టర్ షాట్ మేకింగ్ అద్భుతంగా ఉంది. శ్రీకాంత్ భయ్యా అంటే ఇండస్ట్రీలో అందరికీ ఇష్టమే. నాకైతే మరీ ఇష్టం. ఆయన ఎంత మంచి నటుడో అంత మంచి మనిషి. ఎందరికో సహాయం చేశాడు’’ అని దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. శ్రీకాంత్, యజ్ఞా శెట్టి జంటగా కరణం బాబ్జీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆపరేషన్ 2019’. ‘బి వేర్ ఆఫ్ పబ్లిక్’ అన్నది ట్యాగ్ లైన్. అలివేలు నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. కరణం బాబ్జీ మాట్లాడుతూ –‘‘సినిమా ఆడాలంటే స్టార్లు అవసరం లేదని ‘మహానటి’ నిరూపించింది. ఒక సినిమా ఆడాలంటే మంచి నటీనటులు కుదరాలి. మా సినిమాకి కుదిరారు. ఈ చిత్రంలో ముగ్గురు యంగ్ హీరోలున్నారు. వాళ్లెవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. జూన్ 15లోపు సెన్సార్ పూర్తి చేసి, అదే నెలలోనే సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘శ్రీకాంత్ కష్టమంతా ట్రైలర్లో చూసాం. ఈ చిత్రం యూనిట్‌కి మంచి పేరు తీసుకొస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాత అలివేలు. ‘‘మెంటల్ పోలీస్’ తర్వాత కరణం బాబ్జితో చేసిన చిత్రమిది. బాబ్జీని ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ అనాలి. సినిమా బడ్జెట్ తగ్గించడం కోసం డైరెక్టర్ పడ్డ తపన మెచ్చుకోకుండా ఉండలేం. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ చిత్రమిది’’అన్నారు శ్రీకాంత్. సీనియర్ నటుడు శివకృష్ణ, దీక్షాపంత్, మ్యూజిక్ డైరెక్టర్ రాప్రాక్ షకీల్ తదితరులు పాల్గొన్నారు. -
ఈ ‘ఆపరేషన్’ కూడా సక్సెస్ అవ్వాలి – కృష్ణంరాజు
శ్రీకాంత్, యజ్ఞశెట్టి జంటగా కరణం బాబ్జీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆపరేషన్ 2019’. ‘బివేర్ ఆఫ్ పబ్లిక్’ అనేది ఉపశీర్షిక. అలివేలు ప్రొడక్షన్ బ్యానర్ పై అలివేలు నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ను సీనియర్ నటుడు కృష్ణంరాజు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – ‘‘శ్రీకాంత్ ‘సింహ గర్జన’ సినిమాలో నాకు తమ్ముడిగా, ‘మా నాన్నకు పెళ్లి’ సినిమాలో కొడుకుగా యాక్ట్ చేశారు. శ్రీకాంత్ మంచి నటుడే కాదు మంచి మనసున్న వ్యక్తి కూడా. ‘ఆపరేషన్ దుర్యోధన’లాగా ఈ సినిమా కూడా మంచి హిట్ కావాలని ఆశిస్తున్నాను. ‘బివేర్ ఆఫ్ పబ్లిక్’ అనే క్యాప్షన్ చూస్తుంటే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు చూస్తే వ్యాపారవేత్తలు ఓట్లను కొంటున్నారు. పబ్లిక్ కూడా డబ్బుకు ఆశపడుతున్నారు. ఈ సినిమా పబ్లిక్‌ను ఎడ్యుకేట్ చేస్తుంది అనుకుంటున్నాను. టీమ్‌కు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘కృష్ణంరాజుగారు మా సినిమా టీజర్‌ను విడుదల చేయటం చాలా ఆనందంగా ఉంది. కరణం బాబ్జీగారితో ఇంతకు ముందు ‘మెంటల్ పోలీస్’ అనే సినిమా చేశా. అది వివాదాల కారణంగా సరిగ్గా ఆడలేదు. ఈసారి కాంట్రవర్శీ లేకుండా సినిమా చేద్దాం అనుకున్నాం. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు’’ అన్నారు శ్రీకాంత్. ‘‘శ్రీకాంత్‌గారు అన్ని విధాలా సహకరించారు. ఆయనతో పాటు ఈ సినిమాలో ఇద్దరు యంగ్‌స్టర్స్ నటిస్తున్నారు. వారెవరో త్వరలో ప్రకటిస్తాం’’ అన్నారు దర్శకుడు బాబ్జీ. ‘‘శ్రీకాంత్‌గారి సహకారం మరువలేనిది. కృష్ణంరాజుగారి దంపతులు టీజర్ రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది’’ అన్నారు నిర్మాత అలివేలు. -
ఏమోషనల్ డ్రామాగా కలత్తూర్‌గ్రామం
తమిళసినిమా: యాక్షన్‌తో కూడిన ఎమోషనల్ డ్రామాగా కలత్తూర్ గ్రామం ఉంటుందని ఆ చిత్ర దర్శకుడు చరణ్ కే.అద్వైతన్ తెలిపారు. దర్శకుడు గణేశ్‌రామ్ శిష్యుడైన ఈయన తొలిసారిగా మెగాఫోన్ పట్టిన చిత్రం కలత్తూర్ గ్రామం. ఏఆర్.మూవీ ప్యారడైజ్ పతాకంపై అవుదైతై రామమూర్తి నిర్మిస్తున్న ఇందులో కిషోర్ కథానాయకుడిగా, బెంగళూర్‌కు చెందిన యజ్ఞశెట్టి కథానాయకిగా నటించిన ఈ చిత్రంలో సునీల్‌కుమార్, అజయ్రత్నం తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. సంగీతజ్ఞాని ఇళయరాజా సంగీతం అందించడంతో పాటు ఇందులోని ఒక పాటను ఆలపించడం విశేషం. కాగా నిర్మాణం పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అయిన కలత్తూర్ గ్రామం చిత్రం విశేషాలను దర్శకుడు తెలుపుతూ ఇది తూత్తుకుడి జిల్లాలోని పుదుపట్టి గ్రామంలో జరిగే కథాంశంగా ఉంటుందన్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చితాన్ని ఆంధ్ర, తమిళనాడు సరిహద్దులో చిత్రీకరించినట్లు చెప్పారు. చిత్ర కథను ఇళయరాజాకు వినిపించగా చాలా బాగుంది. షూటింగ్ పూర్తి చేసి రండి తాను సంగీతాన్ని అందిస్తానని అన్నారన్నారు. చిత్రంలో కిషోర్ రెండు విభిన్న గెటప్‌లలో కనిపిస్తారని, ఇందులో రెండు పాటలు, నాలుగు ఫైట్స్ ఉంటాయని తెలిపారు. చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయని, సెప్టెంబర్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రాన్ని తెలుగులోనూ అనువదించే ఆలోచన ఉందని దర్శకుడు పేర్కొన్నారు.