ఆ ప్రశంసను మరచిపోలేను | Lakshmi's NTR Movie Team Exclusive Interview | Sakshi
Sakshi News home page

ఆ ప్రశంసను మరచిపోలేను

Published Tue, Apr 2 2019 3:13 AM | Last Updated on Tue, Apr 2 2019 3:13 AM

Lakshmi's NTR Movie Team Exclusive Interview - Sakshi

యజ్ఞాశెట్టి,విజయ్‌ కుమార్‌, శ్రీతేజ్

‘‘నాటకాల్లో నేను అచ్చం ఎన్టీఆర్‌గారిలా చేస్తానని ఎవరో రామ్‌గోపాల్‌ వర్మగారికి చెప్పారు. అప్పుడు వర్మగారు నాకు ఓ డైలాగ్‌ పంపించి ఎన్టీఆర్‌గారిలా చేసి పంపమన్నారు. పంపిన వీడియో చూసి ఎన్టీఆర్‌గారి పాత్రకు తీసుకున్నారు’’ అన్నారు విజయ్‌కుమార్‌. యజ్ఞాశెట్టి, శ్రీతేజ్, విజయ్‌ కుమార్‌ ముఖ్య తారలుగా రామ్‌గోపాల్‌ వర్మ, అగస్త్య మంజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’. రాకేష్‌ రెడ్డి, దీప్తి బాలగిరి నిర్మించిన ఈ సినిమా మార్చి 29న ఏపీ మినహా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రంలో లీడ్‌ రోల్స్‌లో నటించిన విజయ్‌ కుమార్‌ (ఎన్టీఆర్‌), యజ్ఞాశెటి ్ట(లక్ష్మీ పార్వతి), శ్రీతేజ్‌ (బాబు) హైదరాబాద్‌లో సోమవారం విలేకరులతో ముచ్చటించారు.

విజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ– ‘‘నాకు 45ఏళ్ల నాటకానుభవం ఉంది. సినిమా అవకాశాల కోసం హైదరాబాద్‌లో ఉంటున్నాను కానీ సరైనవి రాలేదు. ఎన్టీఆర్‌గారి పాత్ర చేసే అవకాశం ఇచ్చిన వర్మగారికి థ్యాంక్స్‌. సినిమాలకు పునాది నాటకాలు. నాటకాలకు ఇప్పుడు కూడా ప్రజాదరణ ఉంది. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో వందలకొద్దీ కళా పరిషత్‌లు ఉన్నాయి. నాటకానుభవం ఉండటంతో సినిమాలో నటించడం కష్టం అనిపించలేదు. రెండు మూడు రోజులు కొత్తగా అనిపించిందంతే. ఓసారి నా నాటకం చూసిన సి.నారాయణరెడ్డిగారు ‘మా అన్నగారు (ఎన్టీఆర్‌) కనిపించారు’ అన్నారు. ఆ ప్రశంస మరచిపోలేను. ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చేస్తున్నప్పుడు వర్మగారితో మాట్లాడుతుంటే నటరాజుతో మాట్లాడినట్టు అనిపించింది.

‘ఎన్టీఆర్‌గారి పాత్రకు మిమ్మల్ని ఎంపిక చేసుకోవడంతో చాలామంది నన్ను తప్పుబట్టారు. నేను చెప్పినదాంట్లో మీరు కనీసం 50 శాతం నటిస్తే చాలనుకున్నా. కానీ 100 శాతం చేశారు’ అని వర్మగారు చెప్పడం నాకు వచ్చిన బెస్ట్‌ కాంప్లిమెంట్‌. నటులకు రాజకీయాలతో సంబంధం లేదు. ఆర్టిస్ట్‌ని ఆర్టిస్ట్‌గానే చూడాలి’’ అన్నారు. శ్రీతేజ్‌ మాట్లాడుతూ– ‘‘నటుడిగా నేను కెరీర్‌ స్టార్ట్‌ చేసి 13ఏళ్లయినా సరైన బ్రేక్‌ రాలేదు. ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమా నా కెరీర్‌కి టర్నింగ్‌ పాయింట్‌. ఇండస్ట్రీలో ఓ గుర్తింపు తీసుకొచ్చింది. చంద్రబాబునాయుడుగారి పాత్ర చాలా బాగా చేశావంటూ అందరూ అభినందిస్తుంటే సంతోషంగా ఉంది. ‘వంగవీటి’లో దేవినేని నెహ్రూగారి పాత్ర, ‘యన్‌.టి.ఆర్‌ కథానాయకుడు, మహానాయకుడు’ చిత్రాల్లో వైఎస్‌ రాజశేఖరరెడ్డిగారి పాత్ర, ఈ సినిమాలో చంద్రబాబుగారి పాత్ర చేశా.

వరుసగా బయోపిక్‌ చిత్రాల్లో నటిస్తుండటం ఎగై్జటింగ్‌గా ఉంది. నేను రెగ్యులర్‌ యాక్టర్‌గా ఉండకూడదనుకుంటున్నా. కైకాల సత్యనారాయణ, రావుగోపాలరావు, నాగభూషణం, ప్రకాశ్‌రాజ్, రావు రమేశ్‌గార్లలా విలక్షణమైన పాత్రలు చేయాలని ఉంది. ఈ తరంలో మేము వారిలా గొప్ప పాత్రలు చేయడం లేదు. బాలీవుడ్‌ నుంచి ఇర్ఫాన్‌ఖాన్, నవాజుద్దీన్‌ సిద్దిఖీ లాంటి విలక్షణమైన నటులను టాలీవుడ్‌కి తెచ్చుకుంటున్నాం. వారిలా విలక్షణమైన పాత్రలు చేయాలన్నదే నా లక్ష్యం. ఈ ఏడాది మార్చి 29వ తేదీ శుక్రవారం నా భవిష్యత్‌ని మార్చేసింది. ఇందుకు వర్మగారికి, అగస్త్యమంజుగారికి ధన్యవాదాలు. కొన్ని సినిమాలకు చర్చలు జరగుతున్నాయి’’ అన్నారు.

 యజ్ఞాశెట్టి మాట్లాడుతూ– ‘‘వర్మగారితో ‘కిల్లింగ్‌ వీరప్పన్‌’ సినిమా చేశా. ఆ తర్వాత  ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’. ఈ సినిమా కోసం లుక్‌ టెస్ట్‌ చేసి, ఓకే చేశారు. ఇందులో లక్ష్మీ పార్వతిగారి పాత్ర నాకు ఓ చాలెంజ్‌. కథ చాలా సెన్సిటివ్‌. నాకు తెలుగు రాదు. కానీ, తెలుగు లిటరేచర్‌ని పెట్టుకుని డైలాగ్స్‌ నేర్చుకున్నాను. ఈ సినిమా నా కెరీర్‌లో ఓ మైలురాయి. ప్రస్తుతం బాలాజీ దర్శకత్వంలో ‘9 డైరీస్‌’ అనే ద్విభాషా చిత్రం (తెలుగు, కన్నడ) చేస్తున్నా’’ అన్నారు. హరికృష్ణ పాత్రధారి గంగాధర్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement