ఏమోషనల్ డ్రామాగా కలత్తూర్‌గ్రామం
తమిళసినిమా: యాక్షన్‌తో కూడిన ఎమోషనల్ డ్రామాగా కలత్తూర్ గ్రామం ఉంటుందని ఆ చిత్ర దర్శకుడు చరణ్ కే.అద్వైతన్ తెలిపారు. దర్శకుడు గణేశ్‌రామ్ శిష్యుడైన ఈయన తొలిసారిగా మెగాఫోన్ పట్టిన చిత్రం కలత్తూర్ గ్రామం. ఏఆర్.మూవీ ప్యారడైజ్ పతాకంపై అవుదైతై రామమూర్తి నిర్మిస్తున్న ఇందులో కిషోర్ కథానాయకుడిగా, బెంగళూర్‌కు చెందిన యజ్ఞశెట్టి కథానాయకిగా నటించిన ఈ చిత్రంలో సునీల్‌కుమార్, అజయ్‌రత్నం తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. సంగీతజ్ఞాని ఇళయరాజా సంగీతం అందించడంతో పాటు ఇందులోని ఒక పాటను ఆలపించడం విశేషం.
కాగా నిర్మాణం పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అయిన కలత్తూర్ గ్రామం చిత్రం విశేషాలను దర్శకుడు తెలుపుతూ ఇది తూత్తుకుడి జిల్లాలోని పుదుపట్టి గ్రామంలో జరిగే కథాంశంగా ఉంటుందన్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చితాన్ని ఆంధ్ర, తమిళనాడు సరిహద్దులో చిత్రీకరించినట్లు చెప్పారు. చిత్ర కథను ఇళయరాజాకు వినిపించగా చాలా బాగుంది. షూటింగ్ పూర్తి చేసి రండి తాను సంగీతాన్ని అందిస్తానని అన్నారన్నారు. చిత్రంలో కిషోర్ రెండు విభిన్న గెటప్‌లలో కనిపిస్తారని, ఇందులో రెండు పాటలు, నాలుగు ఫైట్స్ ఉంటాయని తెలిపారు. చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయని, సెప్టెంబర్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రాన్ని తెలుగులోనూ అనువదించే ఆలోచన ఉందని దర్శకుడు పేర్కొన్నారు.