ఐదుగురికి గాయాలు
మురుగుకాలువలో పడేసి కొట్టిన వైనం
మహిళ వేలు కొరికిన టీడీపీ వర్గీయుడు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: టీడీపీలో చేరతారా లేక కుల, గ్రామ బహిష్కరణ చేయమంటారా అని బెదిరించినా, భయపెట్టినా లొంగలేదని ఒక కుటుంబంపై టీడీపీ వర్గీయులు దాడిచేసి ఐదుగురిని గాయపరిచారు. ప్రకాశం జిల్లా కొండపి మండలం మిట్టపాలెం ఎస్సీ కాలనీలో గురువారం రాత్రి టీడీపీ వర్గీయులు ఈ దారుణానికి దిగారు. బాధితుల కథనం ప్రకారం వైజాగ్‌లో ఉద్యోగం చేసుకునే ఈ కాలనీ వాసి గడ్డం కిషోర్ ఇటీవల ఇంటికి వచ్చాడు. వీరి కుటుంబాన్ని టీడీపీలో చేరాలని అదే కాలనీకి చెందిన టీడీపీ నాయకుడు ఐనంపూడి రమేష్ 2019 నుంచి డిమాండ్ చేస్తున్నాడు.
ఆయన భయపెట్టినా, బెదిరించినా కిషోర్ కుటుంబం వైఎస్సార్‌సీపీలోనే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో కిషోర్ తన ఇంటి గేటు వద్ద ఉండగా ఆ కాలనీకి చెందిన గడ్డం మధు అనే యువకుడు సిమెంటు రాయి తెచ్చి కిషోర్ ఇంటి తడికపైకి విసిరాడు. రాయి ఎందుకు విసిరావంటూ కిషోర్ కేకలు వేశాడు. తరువాత 11.40 గంటలకు టీడీపీ నాయకుడు ఐనంపూడి రమేష్ సుమారు 15 మందిని తీసుకొచ్చి కేకలు వేశాడు. బయటకు వచ్చిన కిషోర్ కుటుంబసభ్యులపై దాడిచేశారు.
కిషోర్ భార్య హెమీమాను జుట్టు పట్టుకుని లాగటంతోపాటు ఆమె చేతివేలిని గడ్డం వెంకటేశ్వర్లు అనే వ్యక్తి కొరికి గాయపరిచాడు. కిషోర్ అక్క దాసరి ఎస్తేరమ్మ, తల్లి గడ్డం కొండమ్మ, బావ నాగరాజుపైన దాడిచేసి గాయపరిచారు. కిషోర్‌ను మురుగు కాలువలో పడేసి పొడవాటి వస్తువుతో కొట్టి గాయపరిచారు. ఆ ప్రాంతంలో వీధిలైట్లను కూడా ఆపేసి ఈ దాడికి దిగారు. ఈ దాడిని చిత్రీకరించేందుకు ప్రయత్నించిన కిషోర్ మేనకోడలు దాసరి ప్రవల్లిక సెల్‌ఫోన్ లాక్కుని ధ్వంసం చేశారు. బాధితులకు కొండపి ఏరియా ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం ఒంగోలు జీజీహెచ్‌కి తరలించారు.
ఐనంపూడి రమేష్, గడ్డం వెంకటేశ్వర్లు, లక్కిపోగు సుధాకర్, ఐనంపూడి భాస్కర్, గడ్డం మధు, గడ్డం మరియమ్మ, గడ్డం నిర్మల, గడ్డం ఆకాష్, మరికొందరు తమపై దాడిచేసినట్లు కిషోర్ చెప్పారు. ఇరువర్గాలకు గాయాలయ్యాయని, రెండువర్గాలపై కేసులు నమోదు చేస్తామని ఎస్.ఐ. కృష్ణబాజిబాబు చెప్పారు. దాడికి గురైనవారి మీద కూడా కేసు పెడతామని ఎస్.ఐ. పోలీసులు చెప్పడంతో వైఎస్సార్‌సీపీ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు పక్షపాత«ంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment