సహజీవనం సాగించడంలో తప్పేముంది?
నటి గౌతమికి ప్రేమను, సంతోషాన్ని పంచుతున్నట్లు ప్రఖ్యాత నటుడు పద్మశ్రీ కమల్‌హాసన్ వ్యాఖ్యానించారు. కమల్ హాసన్, సారికలు మనస్పర్థల కారణంగా విడిపోయిన విషయం తెలిసిందే. నటి సారిక ముంబైలో ఒంటరిగా జీవిస్తున్నారు. కమల్ మాత్రం గౌతమితో సహజీవనం చేస్తున్నారు. అయితే కమల్ తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటానికి ఆసక్తి చూపరు. అలాంటిది ఇటీవల మలయాళ పత్రిక కిచ్చిన ఇంటర్వ్యూలో నటి గౌతమితో సహజీవనం గురించి వివరించడం విశేషం.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- గౌతమి తనతోనే ఉంటున్నారని తెలిపారు. ఆమె భయాందోళనలు తాను అర్థం చేసుకున్నానని, ఆమెకు కావలసిన ప్రేమను, సంతోషాన్ని పంచుతున్నానని చెప్పారు. కష్టాల్లో పాలు పంచుకున్నప్పుడే బంధం బలపడుతుందన్నారు. మనసుకు నచ్చిన ఆడ, మగ కలిసి జీవించడంలో తప్పేముందంటూ ప్రశ్నించారు. విమర్శకులు ఎలాగో విమర్శిస్తూనే ఉంటారన్నారు. ‘మనసులు కలిసిన వాళ్ళు సహజీవనం సాగించడాన్ని ఇతరులెందుకు వ్యతిరేకించాలి?’ అంటూ తనదైన శైలిలో కమల్ స్పందించారు.