న్యాయం జరిగే వరకూ దీక్ష
‘‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం కృష్ణా జిల్లా పంపిణీ హక్కులు కొని సుమారు రెండు కోట్ల రూపాయలు నష్టపోయా. అప్పుడు నాకు ‘కాటమరాయుడు’ డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఇస్తామని నిర్మాత శరత్ మరార్, పవన్ కల్యాణ్ మేనేజర్ శ్రీనివాస్ హామీ ఇచ్చి, ఇప్పుడు ఇవ్వడం లేదు’’ అని ఆ సినిమా డిస్టిబ్య్రూటర్ సంపత్ కుమార్ అన్నారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్ చాంబర్ వద్ద శుక్రవారం ఆయన నిరాహార దీక్షకు దిగారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘సర్దార్ గబ్బర్ సింగ్’ హిట్ అవుతుంది, నీకేం భయం లేదంటూ మాయ మాటలు చెప్పి అధిక ధరకు కృష్ణాజిల్లా పంపిణీ హక్కులు కొనిపించి, నన్ను రోడ్డున పడేశారు. ఆ చిత్రం ఫ్లాప్ కావడంతో ‘కాటమరాయుడు’ సినిమా పంపిణీ హక్కులు ఇస్తామని చెప్పి, ఇప్పుడు వేరే డిస్టిబ్య్రూటర్‌కు ఇచ్చారు. ఈ విషయాన్ని పవన్‌కల్యాణ్‌గారి దృష్టికి తీసుకెళదామనుకుంటే, అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు. ఆయన జోక్యం చేసుకుని నాకు పంపిణీ హక్కులు ఇవ్వాలి. లేకుంటే, దీక్ష విరమించేది లేదు’’ అన్నారు.