లవ్ యు బంగారం పాటలు
‘‘30 ఏళ్ల తర్వాత ఓ యూత్‌ఫుల్ మూవీ తీసినందుకు చాలా ఆనందంగా ఉంది’’ అని కేఎస్ రామారావు అన్నారు. ఆయన సమర్పణలో రూపొందిన చిత్రం ‘లవ్ యు బంగారం’. రాహుల్, రాజీవ్, శ్రావ్య ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి గోవి దర్శకుడు. కె.వల్లభ, ‘ఈ రోజుల్లో’ఫేం మారుతి నిర్మాతలు. సంగీత దర్శకుడు చక్రి సోదరుడు మహిత్ నారాయణ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. అతిథిగా విచ్చేసిన రెజీనా ఆడియో సీడీని ఆవిష్కరించి కేఎస్ రామారావుకు అందించారు.
కేఎస్ రామారావు మాట్లాడుతూ -‘‘‘దమ్ము’ ఇచ్చిన అనుభవంతో ఈ సినిమా చేశాను. చిన్న సినిమాలకు భారీ వసూళ్లు రాబడుతున్నాడు మారుతి. అందుకే అతనితో సినిమా చేశా. కోదండరామిరెడ్డిలోని డెడికెషన్‌ని గోవిలో చూశాను. సరదాగా ఉంటూనే ఉద్వేగంతో ముగుస్తుందీ సినిమా’’అని చెప్పారు. బయ్యర్లందరికీ లాభాలు తెచ్చిపెట్టే సినిమా అవుతుందని మారుతి నమ్మకం వ్యక్తం చేశారు. తనపై ఉన్న నమ్మకంతో ఏనాడూ మారుతీ సెట్‌కి రాలేదని, తొలి సినిమానే కేఎస్ రామారావు లాంటి నిర్మాతతో పనిచేయడం గర్వంగా ఉందని దర్శకుడు చెప్పారు. అశోక్‌కుమార్, చక్రి, సందీప్‌కిషన్, ఆది, మధురిమ తదితరులు పాల్గొన్నారు.