కండక్టర్‌ నుంచి యాక్టర్‌గా... | Madhira Bus Conductor Became Actor In Khammam | Sakshi
Sakshi News home page

కండక్టర్‌ నుంచి యాక్టర్‌గా ఎదిగాడు

Published Tue, Feb 11 2020 8:11 AM | Last Updated on Tue, Feb 11 2020 8:13 AM

Madhira Bus Conductor Became Actor In Khammam - Sakshi

సాక్షి, మధిర(ఖమ్మం): నటించాలనే తపనతో విశ్రాంత జీవితంలోనూ బుల్లితెర, వెండితెరపై తనదైన శైలిలో రాణిస్తున్నారు మధిర పట్టణానికి చెందిన దూదిపాళ్ల వీరభద్రం. ఈయన దశాబ్దాల కిందట నాటక రంగ కళాకారుడిగా ప్రదర్శనలు ఇచ్చేవారు. ఉద్యోగ విరమణ తర్వాత తనలోని కళాకారుడిని ఖాళీగా ఉంచలేక..వెతుక్కుంటూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ కళామతల్లి సేవలో తరిస్తున్నారు. కమెడియన్‌గా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, తండ్రి పాత్రల్లో రాణించారు. ముఖ్యంగా రైతు పాత్ర ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది. మధిరలో 1952లో జన్మించిన డి.వీరభద్రం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించారు. 1969లో హెచ్‌ఎస్సీ పూర్తిచేశారు. ఆయన సోదరి భర్త రణధీర్‌ మద్రాస్‌లో నృత్య కళాకారుడిగా పనిచేస్తుండడం..అప్పటికే రంగస్థల కళాకారుడిగా నటనపై ఉన్న ఆసక్తితో చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టి..విజయవంతంగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్న ఈయన వీలు దొరికినప్పుడల్లా స్వస్థలం వసూత్‌..విుత్రులతో ఆత్మీయంగా గడుపుతూ ఉండటం విశేషం. 

అనేక సీరియళ్లు
అమ్మ, అభిషేకం, మాటే మంత్రం, రాజారాణి, శుభసంకల్పం, నాపేరు మీనాక్షి వంటి సీరియళ్లు ఈయనకు మంచి గుర్తింపును తెచ్చాయి. ఇప్పటి వరకు వివిధ చానెళ్లలో ప్రసారమయ్యే 40వరకు సీరియళ్లలో నటించారు. 

పలు సినిమాలు..
ఇప్పటి వరకు 60వరకు సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించారు. మొట్టమొదటి సినిమా బ్రహ్మానందంతో కలిసి అయ్యప్ప పూజా మహిమలో నటించారు. గుర్తింపునిచ్చినవి..
శ్రీరామ రాజ్యం, నేనింతే, బాహుబలి, ఆగడు, పవర్, పటాస్, వెంకీమామ తాజాగా డిగ్రీ కాలేజ్‌ 

నాడు కండక్టర్‌ నేడు యాక్టర్‌
డి.వీరభద్రం గతంలో ఆర్టీసీ కండక్టర్‌ ఉద్యోగం చేశారు. 1985నుంచి 2010వరకు మధిర, ఖమ్మం, నర్సంపేట, జనగాం, కామారెడ్డి, కరీంనగర్‌ తదితర డిపోల్లో విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందారు. మధిరలో ఉన్నప్పుడు తోటి కళాకారులను ప్రోత్సహించేందుకు స్పందన ఆర్ట్‌ క్రియేషన్స్‌ను స్థాపించారు. ఆ రోజుల్లో మధిరకు రాజనాల, కాంతారావు, శోభన్‌బాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బాబుమోహన్, బ్రహ్మానందం వంటి కళాకారులను తీసుకొచ్చానని..ఆనందంగా చెబుతుంటారు. 

సంతృప్తిగా అనిపిస్తుంది..
నటించడం, ఆ పాత్రకు న్యాయం చేయడం ద్వారా ఎంతో సంతృప్తిగా అనిపిస్తుంది. సినీనటి శ్రీకుమారితో కలిసి ఎక్కువగా రైతుపాత్రలో కనిపించాను. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ రూపొందించిన కౌలురైతు సంక్షేమ చట్టం యాడ్‌లో రైతుపాత్ర పోషించా. తెలంగాణ ప్రభుత్వ ఓ ప్రకటనలోనూ అవకాశవిుచ్చారు. పూర్వ విద్యార్థి సంఘ సమ్మేళనానికి, స్నేహితులను కలుసుకునేందుకు నా ఊరు వస్తుంటా. ఒక లక్ష్యం, ప్రణాళికతో యువత యాక్టింగ్‌లో లక్ష్యం సాధించాలి. కాలాన్ని వృథా చేసుకోవద్దు. 
– డి.వీరభద్రం, నటుడు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement