
సాక్షి, చెన్నై: సినీ నటి విజయశాంతికి మోసం కేసు నుంచి మద్రాసు హైకోర్టు ఊరట ఇచ్చింది. విజయశాంతి తనను మోసం చేశారంటూ గతంలో ఇందర్‌చంద్ జైన్ అనే వ్యక్తి చెన్నై జార్జ్ టౌన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓ స్థలం యజమాని, దాని విక్రయం నిమిత్తం విజయశాంతికి పవరాఫ్ పట్టాను ఇచ్చారని, ఆ స్థలాన్ని తనకు విక్రయించేందుకు తొలుత ఒప్పందాలు జరిగాయని జైన్ పేర్కొన్నారు. అయితే తనకు కాకుండా మరో వ్యక్తికి విక్రయించి తనను మోసం చేశారని ఆరోపించారు. దీనిపై బుధవారం న్యాయమూర్తి జస్టిస్ మురళీధరన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.
ఇది పవరాఫ్ పట్టా వ్యవహారం అని, హక్కుల విషయంగా సంబంధిత కోర్టులో ఎప్పుడో తేల్చుకుని ఉండాల్సిందని ధర్మాసనం స్పష్టం చేసింది. అలాగే మోసం కేసు విచారణ నిమిత్తం విజయశాంతికి వ్యతిరేకంగా గతంలో ఎగ్మూర్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. జార్జ్‌టౌన్ కోర్టుకు వ్యతిరేకంగా జైన్ దాఖలు చేసిన పిటిషన్లను తోసిపుచ్చింది.