తెలుగు సినీ ప్రేక్షకులకు మహానటి సావిత్రి గుర్తున్నంతకాలం తానూ గుర్తుంటానని ‘మహానటి’లో సావిత్రి పాత్రధారి కీర్తి సురేష్ అన్నారు. ‘మహానటి’ సినిమా విజయవంతమైన సందర్భంగా చేపట్టిన కృతజ్ఞతా పర్యటనలో భాగంగా చిత్రం యూనిట్ ఆదివారం రాజమహేంద్రవరంలో సందడి చేసింది. నటకిరీటి రాజేంద్రప్రసాద్, చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ తదితరులు థియేటర్‌లోప్రేక్షకుల్ని కలుసుకున్నారు.
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): తెలుగు సినీ ప్రేక్షకులకు మహానటి సావిత్రి గుర్తున్నంతకాలం తానూ గుర్తుంటానని ‘మహానటి’లో సావిత్రి పాత్రధారి కీర్తి సురేష్ అన్నారు. ‘మహానటి’ విజయవంతమైన సందర్భంగా చిత్రం యూనిట్ కృతజ్ఞతా పర్యటన చేపట్టింది. ఆదివారం స్థానిక జేఎన్‌రోడ్‌లోని ఎంఆర్‌ఆర్ ఫంక్షన్‌హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కీర్తి సురేష్ మాట్లాడుతూ దర్శకుడు నాగ్‌అశ్విన్ ఆలోచనల నుంచే ఈ సినిమా వచ్చిందన్నారు. చిత్రనిర్మాణంలో ప్రియాంకదత్, స్వప్నదత్ ఎంతో సహకరించారన్నారు. టెక్నీషియన్లు అద్భుతంగా పనిచేశారని, సమంత, దుల్కర్, విజయ్ దేవరకొండతో పాటు సహనటులు ఎంతో ప్రతిభ కనబరిచారని అన్నారు. ముఖ్యం గా డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ డానియేల్ అ ద్భుతమైన ప్రతిభను కనబరిచారన్నారు. మహానటిలో నటకిరీటి రాజేంద్రప్రసాద్ స్వంత తండ్రిలా ప్రోత్సహించారని, ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని చెప్పారు. సావిత్రి పాత్ర ను ఇచ్చిన నాగ్ అశ్విన్, నిర్మాతలతో పాటు చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
‘మహానటి’పై తెలుగువారి ప్రేమేవిజయానికి మూలం
దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ తెలుగువారికి సావిత్రిపై ఉన్న ప్రేమే మహానటిని పెద్ద విజయవంతం చేసిందన్నారు. ఈసినిమా రూపకల్పనలో ఏదో శక్తి ముందుండి నడిపించిందని నమ్ముతున్నానన్నారు. సావిత్రి స్టార్ పవర్ ఎంతో 40 ఏళ్ళ తర్వాత కూడా మహానటి సినిమా రుజువు చేస్తోందన్నారు. మహానటి సావిత్రి జీవితం ఒక విజయవంతమైన సినిమాతో ముగిసి ఉంటే బాగుంటుందన్న కోరికతోనే ఈ సినిమా రూపొందించానన్నారు. 40 సంవత్సరాల జీవితకథను మూడు గంటల్లో చూపించేందుకు స్క్రీన్‌ప్లే రాయడమే చాలా కష్టంగా అనిపించిందని, అయితే కష్టానికి తగ్గ ఫలితాన్ని ప్రేక్షకులు అందించారని అన్నారు.
కేవీ చౌదరి పాత్ర గుర్తుండి పోతుంది..
నటకిరీటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ‘ఆ నలుగురు’ సినిమాలో రఘురామ్ పాత్రను ప్రేక్షకులు ఎంతగా గుర్తుంచుకున్నారో, మహానటిలో కేవీ చౌదరి పాత్రకూడా అంతగా గుర్తుండి పోతుందన్నారు. సావిత్రితో విభేదించి దూరమైన తరువాత ఆమెకు ఆరోగ్యం బాగోలేని సమయంలో కలుసుకున్న సీన్ అద్భుతంగా పండిందన్నారు. మహానటి సావిత్రి మళ్ళీపుట్టిందా అన్నంతగా కీర్తి సురేష్ ఆమె పాత్రలో ఆకట్టుకుందన్నారు. సావిత్రి పాత్రలో జీవించేందుకు ఆమె ఎంతగానో కష్టపడిందని ప్రశంసించారు. దర్శకుడు, నిర్మాతలు, నటీనటులు నిజాయితీతో కష్టపడి పనిచేసిన మహానటి తెలుగుసినిమా చరిత్రలోనే ఒక అద్భుతమైన చిత్రంగా నిలిచిపోతుందన్నారు. ‘బయోపిక్ ఎవరు చూస్తారులే’ అని అంతా పెదవి విరిచినా నాగ్‌అశ్విన్ ప్రతిభాపాటవాలతో మహానటిని ఒక క్లాసిక్‌గా నిలబెట్టారన్నారు. డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ డేనియల్ అద్భుతమైన ప్రతిభ కనబరిచారని, సంగీతదర్శకుడు మిక్కీ జే మేయర్ అద్భుతమైన సంగీతాన్ని అందించారని అన్నారు.
స్వామి థియేటర్‌లో మహానటి యూనిట్
కృతజ్ఞతాపర్యటనలో భాగంగా ‘మహానటి’ యూనిట్ రాజమహేంద్రవరం స్వామి థియేటర్‌లో మ్యాట్నీషోలో ప్రేక్షకులను కలుసుకుంది. కీర్తి సురేష్, రాజేంద్రప్రసాద్, దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాతలు ప్రియాదత్, స్వప్నదత్, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ డానియేల్ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ‘అమ్మాడీ’ కీర్తిసురేష్ మహానటిలోని సినిమాడైలాగులతో సందడి చేసింది. థియేటర్ యజమాని లక్ష్మణస్వామి తదితరులు పాల్గొన్నారు.
చిన్నప్పటి ‘సావిత్రి’ నా మనుమరాలే..
‘మహానటి’లో చిన్నప్పటి సావిత్రిగా నటించింది తన మనుమరాలేనని రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఆ పాప తన కూతురి కుమార్తె అన్నారు. నిర్మాత స్వప్నదత్, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ డేనియల్, సినీ డిస్ట్రిబ్యూటర్ నెక్కంటి రామ్మోహరావు, థియేటర్ల యజ మానులు, మేనేజర్లు, డిస్ట్రిబ్యూటర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment