పైరసీ సీడీ ద్వారా ఆర్టీసీ బస్సులో ప్రదర్శితమవుతున్న అయ్యారే చిత్రం
సాక్షి, ముంబయి : భారీ అంచనాలతో విడుదలై కనీస మొత్తాలను కూడా రాబట్టలేక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న బాలీవుడ్ చిత్రం 'అయ్యారే'కు అప్పుడే పైరసీ భూతం పట్టేసింది. ఈ సినిమా అలా విడుదలైందో లేదో ఏకంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న బస్సు(మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ)లో పైరసీ సీడీ ద్వారా ప్రదర్శించారు. పైరసీ అడ్డుకునేందుకు సహకరించాల్సిన ప్రభుత్వమే ఇలా స్వయంగా ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న బస్సులో పైరసీ చిత్రం ప్రదర్శిస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఇప్పుడు బాలీవుడ్ వర్గాల నుంచి ఆగ్రహం పెల్లుబుకుతోంది.
సిద్ధార్థ్ మల్హోత్రా, మనోజ్‌బాజ్‌పాయ్, రకుల్ ప్రీత్ సింగ్, నసీరుద్దీన్‌షా, కుముద్ మిశ్రావంటి ప్రముఖ నటులతో తెరకెక్కిన చిత్రం అయ్యారే. పలు సమస్యలను అధిగమించిన ఈ చిత్రం ఈ నెల (ఫిబ్రవరి) 16న విడుదలైంది. అయితే, చిత్ర నిర్మాత జయంతిలాల్ గడ తెలిపిన ప్రకారం మహారాష్ట్ర ప్రభుత్వం నడిపే అశ్వమేధ బస్సులో ఉదయం 7.30గంటల ప్రాంతంలో పైరసీ సీడి ద్వారా ఈ సినిమాను ప్రదర్శించారు. ఆ సమయంలో బస్సు ముంబయి గోవా మధ్య ప్రయాణిస్తోంది. సోషల్ మీడియా ద్వారా ఈ విషయం వెలుగులోకి రావడంతో చిత్ర నిర్మాత చట్ట ప్రకారం సదరు బస్సు సంస్థపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment