నా దృష్టిలో అది నంబర్ మాత్రమే!
కొంతమందిని చూస్తుంటే వయసు పెరుగుతోందా? తరుగుతోందా అర్థం కాదు. మహేశ్‌బాబుని చూస్తే అలానే అనిపిస్తుంది. రోజుకీ రోజుకీ ఇంకా హ్యాండ్‌సమ్‌గా తయారవుతున్నారాయన. ఇంతకీ మహేశ్ వయసెంత? అని అడిగితే.. కన్‌ఫ్యూజన్‌లో చాలామంది తక్కువ చెప్పేస్తారు. నిజంగానే మహేశ్ వయసు గెస్ చేయలేం. అసలు ఆయన వయసు ఎంతంటే.. 40 ఏళ్ళు. ఆయన్ని చూసినవాళ్ళెవరైనా అంత వయస్సు ఉంటుందా అనుకోవడం సహజమే. ‘‘వయస్సు అనేది నా దృష్టిలో ఒక నంబర్ మాత్రమే. లోపల మనం ఎలా ఉన్నాం? అన్నదే ముఖ్యం.
మీరు బయటకు ఎలా కనిపిస్తున్నారు? అనేది మీ మనస్సును బట్టే ఉంటుంది. ప్రస్తుతం నేను ‘హ్యాపీ స్పేస్’లో ఉన్నా. అదే బయటికి కనిపిస్తోంది’’ అని మహేశ్ అన్నారు. మామూలుగా హ్యాండ్‌సమ్‌గా ఉండే అబ్బా యిల్ని చూసినప్పుడు అలా ఉండడానికి వాళ్లేం చేస్తారో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంటుంది. ఇదే విషయం గురించి మహేశ్ దగ్గర ప్రస్తావిస్తూ... ‘మీ హ్యాండ్‌సమ్ లుక్స్ వెనక సీక్రెట్ చెబుతారా?’ అంటే... ‘‘ప్రతిరోజూ వర్కవుట్ చేస్తాను. ఆరోగ్యం మీద నాకు శ్రద్ధ ఎక్కువ. ఆహారం విషయంలో పద్ధతులు పాటిస్తా. కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్, ఫ్యాట్స్.. ఇవి ఎంతవరకూ కావాలో అంతే తీసుకుంటాను.
ఎగ్ వైట్స్, చికెన్, ఫిష్, ఆకుకూరలు బాగా తింటా’’ అన్నారు. ఇంతేనా... ఇంకా ఏమైనా సీక్రెట్స్ చెబితే బాగుండు కదా అంటే... ‘‘బాగా తినండి.. హాయిగా నిద్రపోండి.. ఫిట్‌గా ఉండండి’’ అంటూ షార్ట్ అండ్ స్వీట్‌గా ఉండే తన పంచ్ డైలాగ్స్‌లా మహేశ్ చెప్పారు. అంతా బాగానే ఉంది.. సినిమాల్లో రంగు రంగుల చొక్కాల్లో కనిపించే మహేశ్ విడిగా మాత్రం పద్ధతిగా ఫార్మల్ షర్ట్స్‌లోనే కనిపిస్తారు. ఎందుకలా? ‘‘నాకు ఇలానే ఇష్టం. సింపుల్‌గా ఉంటే నాకు సౌకర్యవంతంగా ఉంటుంది.
నా స్టైల్ మంత్ర ఏంటంటే... క్యాజువల్’’ అని సింపుల్‌గా అన్నారు. సింపుల్‌గా ఉన్నా భలే ఉంటారు బాసూ అంటే మహేశ్ ఎలా నవ్వుతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అది సరే.. సినిమాల్లో ఎప్పుడు చొక్కా విప్పుతారు? అనంటే.. ‘‘కథ డిమాండ్ చేస్తే.. అప్పుడలా కనిపిస్తానేమో’’ అన్నారు. ఫైనల్లీ... ‘మీలాంటి అందగాడికి ఎలాంటి అమ్మాయిలు నచ్చుతారు?’ అనే ప్రశ్న మహేశ్ ముందుంచితే - ‘‘ఆకర్షణ... చమత్కారం... తెలివితటేలు... ఈ మూడూ ఉండాలి’’ అన్నారు.