ముఖ్యమంత్రిగా మహేశ్‌బాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కుదిరింది. ఏప్రిల్ 27, 2018... తెలుగు ప్రేక్షకుల సాక్షిగా, అభిమానులందరి ముందు మహేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఆ రోజే ఎందుకంటే... కొరటాల శివ దర్శకత్వంలో ఆయన హీరోగా డీవీవీ దానయ్య నిర్మిస్తున్న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఆ రోజే! ముఖ్యమంత్రిగా మహేశ్ ప్రమాణ స్వీకారానికీ, సినిమా విడుదలకీ సంబంధం ఏంటి? అంటే... కొరటాల శివ సినిమాలో మహేశ్ ముఖ్యమంత్రిగా నటిస్తున్నారు కదా! అంటే... సీయెంగా మహేశ్ ఎలా ప్రమాణం చేస్తారో? అందరూ చూసేది ఆ రోజే! వచ్చే ఏడాది ఏప్రిల్ 27న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు నిర్మాత డీవీవీ దానయ్య ప్రకటించారు. ఈ చిత్రానికి ‘భరత్ అనే నేను’ టైటిల్ అనుకుంటున్నారని ఫిల్మ్‌నగర్ టాక్!
ముఖ్యమంత్రి కథేంటి?
ఒకవేళ ‘భరత్ అనే నేను’... టైటిల్‌నే ఫిక్స్ చేస్తే.. సినిమాలో ముఖ్యమంత్రి పేరు భరత్ అనుకోవాలి. అదేనండీ... హీరో పేరు. హీరో తల్లిదండ్రుల్లో దేశభక్తి ఎక్కువ అట! తల్లిదండ్రుల్లోనే కాదు... పేరుకి తగ్గట్టు కొడుకులోనూ దేశభక్తి ఎక్కువే. తండ్రి ఆశయాలు నెరవేర్చడానికి, లక్ష్యాలు సాధించడానికి, తనయుడు రాజకీయాల్లోకి వస్తాడు. ముఖ్యమంత్రి అవుతాడు. ఈ సీయం రాష్ట్రానికి ఏం చేశాడు? అతనికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అనేది చిత్రకథగా వెబ్ మీడియాల్లో చక్కర్లు కొడుతోంది.
అంతా రాజకీయమేనా?
...అనుకోవద్దు. ఇందులో రొమాన్స్‌కి, లవ్ లైఫ్‌కి లోటుండదట! ఇందులో మహేశ్‌కి జోడీగా బీటౌన్ బ్యూటీ కియారా అద్వాని కథానాయికగా నటిస్తున్నారు. మహేశ్, కియారా మధ్య లవ్ ట్రాక్ ప్రేక్షకులందర్నీ ఎట్రాక్ట్ చేస్తుందట! ఆల్రెడీ వీళ్లిద్దరిపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. రాజకీయంలో ఎత్తుకు పైఎత్తులు, ప్రత్యర్థి వర్గాన్ని చిత్తు చేయాలనే వ్యూహాలు కంపల్సరీ. అంటే... సిన్మాలో బోల్డంత సస్పెన్స్, యాక్షన్ ఉంటుందని చెప్పొచ్చు. లవ్ సీన్లూ ఉన్నాయి. మరి, కామెడీ మాటేంటి? దర్శక–రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి నటిస్తున్నారీ సినిమాలో. రాజా... విలనిజంలో కామెడీనీ, కామెడీలో విలనిజాన్నీ ఆయన ఎంత అద్భుతంగా చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పాలా!
శ్రీమంతుడు ఈసారి ఏం చెబుతాడో?
‘శ్రీమంతుడు’ తర్వాత మహేశ్, కొరటాల కలయికలో వస్తున్న చిత్రమిది. ‘శ్రీమంతుడు’లో గ్రామాల దత్తత అంశాన్ని ప్రతి ప్రేక్షకుడికీ అర్థమయ్యేలా కమర్షియల్ పంథాలో చెప్పిన కొరటాల, ఈ సినిమాలో రాజకీయ నేపథ్యంలో ఎలాంటి కథను చెబుతారోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొరటాల సినిమాల్లో ‘స్ట్రాంగ్ కంటెంట్ విత్ కమర్షియాలిటీ’ కంపల్సరీ! సందేశాన్ని చక్కగా చెబితే... తెలుగు ప్రేక్షకులెప్పుడూ ఆదరిస్తారని ‘శ్రీమంతుడు’ నిరూపించింది. ‘శ్రీమంతుడు’ విజయమే ఓ రకంగా ‘భరత్ అనే నేను’ చేయడానికి కారణంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ... ‘‘ప్రస్తుతం జరుగుతున్న హైదరాబాద్ షెడ్యూల్ నవంబర్ 7 వరకు జరుగుతుంది. నవంబర్ 22న అవుట్‌డోర్ షెడ్యూల్ నాన్‌స్టాప్‌గా జరుగుతుంది’’ అన్నారు.
భరత్.. మాంచి స్టైలిష్ సీయెం
మహేశ్ సీయెంగా నటిస్తున్నారనగానే... టాప్ టు బాటమ్ వైట్ అండ్ వైట్‌లో కనిపిస్తారనుకోవద్దు. ఈ సీయం చాలా స్టైలిష్. ఇన్‌షర్టు, ఫార్మల్ ప్యాంటు, బెల్టు, బూటులు, బ్లాక్ గ్లాసెస్... ఇలా ట్రెండీ లుక్కులో మహేశ్ కనిపించనున్నారు! షూటింగులో తీసిన ఫొటోలను కొందరు నెట్టింట్లో పెట్టేశారు. దాంతో మహేశ్ లీక్డ్ లుక్ డిలీట్ చేయమంటూ స్వయంగా కొరటాల రిక్వెస్ట్ చేశారు. వచ్చే వేసవిలోపు ఈ సినిమా గురించి ఇంకెన్ని సంగతులు తెలుస్తాయో... వెయిట్ అండ్ సీ!!
మహేశ్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కుదిరింది!
Published Fri, Oct 27 2017 12:58 AM | Last Updated on Thu, May 10 2018 12:13 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment