విచిత్రమైన జోన్‌లో ఉన్నాం | Mahesh Babu Interview About Sarileru Neekevvaru Movie | Sakshi
Sakshi News home page

పెద్ద హీరోలందరం విచిత్రమైన జోన్‌లో ఉన్నాం

Published Fri, Jan 10 2020 12:13 AM | Last Updated on Fri, Jan 10 2020 8:59 AM

Mahesh Babu Interview About Sarileru Neekevvaru Movie - Sakshi

‘‘అనిల్‌ రావిపూడి ‘ఎఫ్‌ 2’ సినిమా చేస్తున్నప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’ కథని నాకు 40 నిమిషాలు చెప్పాడు.. ఎగ్జైటింగ్‌గా అనిపించింది. అయితే ‘మహర్షి’ తర్వాత వేరే సినిమా కమిట్‌మెంట్‌ ఉంది.. దాని తర్వాత చేద్దామన్నాను.. తను కూడా ‘ఎఫ్‌ 2’ తర్వాత వేరే సినిమా చేస్తాను.. ఆ తర్వాత ఇద్దరం చేద్దాం సార్‌ అన్నాడు. కానీ, ‘ఎఫ్‌ 2’ సినిమా చూశాక ‘సరిలేరు నీకెవ్వరు’ ఈ సమయంలో నేను చేయడం కరెక్ట్‌ అనిపించింది. అనిల్‌కి చెప్పగానే చాలా సంతోషంగా ఒప్పుకున్నాడు’’ అని మహేశ్‌బాబు అన్నారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో మహేశ్‌బాబు, రష్మిక మందన్నా జంటగా విజయశాంతి కీలక పాత్రలో నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ‘దిల్‌’ రాజు సమర్పణలో రామబ్రహ్మం సుంకర, మహేశ్‌బాబు నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా మహేశ్‌బాబు విలేకరులతో చెప్పిన విశేషాలు.

► ‘శ్రీమంతుడు’ సినిమా నుంచి నేను అన్నీ సందేశాత్మక చిత్రాలే చేస్తున్నా. వాణిజ్య అంశాలతో కూడిన ‘దూకుడు’ లాంటి వినోదాత్మక చిత్రం రావాలని నా అభిమానులు కోరుకున్నారు.. నాక్కూడా చేయాలనిపించింది. జూలైలో ఈ సినిమా స్టార్ట్‌ చేసి, డిసెంబరులో పూర్తి చేశాం. ఐదు నెలల్లో సినిమా పూర్తి చేశాం. ఈ సినిమా ఈ టైమ్‌లో చేయడం నా కెరీర్‌లో తీసుకున్న మంచి నిర్ణయమని అనుకుంటున్నాను.
     
► సినిమా చాలా బాగా వచ్చింది.. బొమ్మ (సినిమాని ఉద్దేశించి) దద్దరిల్లిపోతుంది. నేను, నిర్మాతలు, డైరెక్టర్‌తో పాటు యూనిట్‌ అంతా హిట్‌ సాధించబోతున్నామనే పూర్తి నమ్మకంతో ఉన్నాం. సినిమాని మా టీమ్‌తో పాటు కొంతమంది చూశారు. మేము ఏదైతే ఫీల్‌ అయ్యామో సినిమా చూసినవాళ్లు కూడా అలాగే ఫీల్‌ అవడం చాలా సంతోషంగా అనిపించింది. తొలి రోజు షూటింగ్‌ నుంచి ఈ రోజు వరకూ అదే వైబ్స్‌ ఫీలయ్యాం. దీన్ని బట్టి చూస్తే ఈ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ అవుతుందనే వైబ్స్‌ కనిపిస్తున్నాయి.
     
► ‘బిజినెస్‌ మేన్‌’ సినిమా తర్వాత నేను త్వరగా చేసిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. కథ అనుకున్నప్పడు జూన్‌లో స్టార్ట్‌ చేసి సంక్రాంతికి విడుదల చేద్దామనుకున్నాం.. ఎందుకంటే ఇది పర్ఫెక్ట్‌ సంక్రాంతి సినిమా.. అందుకే జూలైలో సినిమా స్టార్ట్‌ చేసి,   పూర్తయ్యేవరకూ నాన్‌స్టాప్‌గా పనిచేశాం. ఇందులో నేను ఆర్మీ మేజర్‌ పాత్ర చేస్తుండటంతో మేకోవర్‌ కోసం ఓ నెల టైమ్‌ పట్టింది. ఈ పాత్ర కోసం 6 కిలోలు బరువు తగ్గాను.  
   
 ► టీమ్‌ చక్కగా కుదిరితే సినిమాలు త్వరగా పూర్తవుతాయి.. కొన్ని సినిమాలు అలా కుదురుతాయి.. మరికొన్ని మన చేతుల్లో ఉండవు. అన్నీ ఐదు నెలల్లోనే పూర్తి కావాలంటే  ఎలా? మంచి క్వాలిటీ కావాలి కదా? అయితే ‘సరిలేరు నీకెవ్వరు’కు అన్నీ కుదిరాయి.. పైగా సంక్రాంతి లక్ష్యంగా పెట్టుకున్నాం కాబట్టి వచ్చాం.  
     
► ఈ చిత్రంలో నాది బాధ్యతగల ఆర్మీ మేజర్‌ పాత్ర. ఇష్టం వచ్చినట్లు చేయలేం.. దాన్ని అనిల్‌ చక్కగా తెరకెక్కించాడు. ఇప్పటివరకూ అనిల్‌ తీసిన సినిమాలు ఒక ఎత్తు.. ఈ సినిమా వేరే ఎత్తు. ఈ సినిమాతో దర్శకుడిగా పది రెట్లు పెరుగుతాడు. అంత బాగా తీశాడు ఈ సినిమాని.  
     
► నేను ఒక్కసారి డైరెక్టర్‌కి సరెండర్‌ అయిపోతే వాళ్లు చెప్పినట్లు చేస్తా. ‘దూకుడు’ తర్వాత మళ్లీ అంత వాణిజ్య అంశాలున్న చిత్రమిది. అలాగని ‘దూకుడు’లా ఉండదు.. ఫ్రెష్‌గా ఉంటుంది. ఈ క్రెడిట్‌ అంతా అనిల్‌దే. నా గత సినిమాలను చూసి ఈ పాత్రని అనిల్‌ తీర్చిదిద్దారు. ఈ సినిమాలో ఓ మాస్‌ సాంగ్‌ ఉండాలనేది అనిల్‌ కోరిక.. పైగా ఈ చిత్రంలో ఆ పాటకి అవకాశం ఉండటంతో పెట్టాం. ఇప్పటి వరకూ నేను చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే ఈ సినిమా మరో ఎత్తు. నా అభిమానులు, ప్రేక్షకులు కొత్త మహేశ్‌ను చూస్తారు.
     
► విజయశాంతిగారితో ‘కొడుకు దిద్దిన కాపురం’ సినిమా తర్వాత, దాదాపు 30 ఏళ్లకు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేశాను. సెట్‌లో తొలిరోజు ఆమెను కలవగానే ‘కొడుకు దిద్దిన కాపురం’ షూటింగ్‌ నిన్ననే జరిగినట్టు అనిపించింది. ఈ సినిమా ఒప్పుకున్నందుకు ఆమెకు థ్యాంక్స్‌.. ఎందుకంటే ఈ సినిమాలోని భారతి పాత్ర ఆమె తప్ప ఇంకెవ్వరూ చేయలేరు. పదేళ్ల తర్వాత సంగీతగారు ఇందులో నటించారు. ఆమెను అనిల్‌ ఒప్పించి తీసుకొచ్చారు.  
     
► కృష్ణగారి సర్‌ప్రైజ్‌ ఏంటో సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. ప్రేక్షకులు తప్పకుండా థ్రిల్‌ ఫీల్‌ అవుతారు. ఈ సినిమాలో సైనికులపై వచ్చే థీమ్‌ సాంగ్‌ అంటే నాకు ఇష్టం. ఈ చిత్రంలో చాలా సర్‌ప్రైజ్‌ అంశాలున్నాయి.. ప్రేక్షకుల స్పందన కోసం వేచి చూస్తున్నా. ఈ పాత్ర చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్‌ చేశాను.. ఈ మధ్య కాలంలో అంత సరదాగా ఎప్పుడూ ఉండలేదు. సినిమా స్టార్‌ అయిన నాలుగో రోజు నుంచే సరదాగా ఉన్నా.
     
► ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకి అడ్వాన్స్‌ తీసుకోకుండా చేశానని కాదు కానీ, ఈ సినిమా ఐదు నెలల్లో చేయాలనుకున్నాం.. ఎలా ఉంటుంది? బడ్జెట్‌ ఎంత? అనుకోలేదు. నేను కూడా ఈ సినిమాకి ఓ నిర్మాత కావడంతో అడ్వాన్స్‌ తీసుకోలేదు. ఒక నిర్మాతగా నేను తీసుకున్న నిర్ణయమది. నేను తీసుకున్న గొప్ప నిర్ణయాల్లో ఇది కూడా ఒకటి. భవిష్యత్తులో అందరూ ఇలాగే చేస్తే ఓ సినిమాకి ఆర్థికంగా చాలా మిగులుతుంది.  

► ఒకే రోజు రెండు సినిమాలు విడుదలవడం మంచిది కాదు.. రెవెన్యూ షేర్‌ అయిపోతుంది. ‘అల.. వైకుంఠపురములో...’ మరుసటి రోజు విడుదలకు ఒప్పుకున్నందుకు నిర్మాతలకు థ్యాంక్స్‌. హీరోలెప్పుడూ థియేటర్ల గురించి పట్టించుకోరు.. సోలో రిలీజ్‌ కావాలని అంటారంతే. డబ్బులు నా ఒక్కడికే వస్తే ఎలా? సినిమా కొన్నవారికి కూడా రావాలి కదా? సంక్రాంతి కాబట్టి మూడు నాలుగు పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయంతే. ఈసారి ఒకేరోజు కాకుండా ఇండస్ట్రీ వారు మాట్లాడుకుని గ్యాప్‌తో విడుదల చేస్తున్నారు.  
     
► నాన్నగారికి (కృష్ణ) ‘దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు’ ఇవ్వాలని చిరంజీవిగారు కోరడం సంతోషాన్నిచ్చింది. ఆ మరుసటి రోజు నాన్నగారిని కలిసినప్పుడు.. ‘చిరంజీవి బాగా మాట్లాడారు.. నా తరఫున థ్యాంక్స్‌ చెప్పు’ అన్నారు. చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించేందుకు రెండు ఫౌండేషన్లు పని చేస్తున్నాయి. వాటికి నా వంతు సహాయం అందిస్తున్నా. భవిష్యత్‌లో పెద్దగా చేస్తా.
     
► ప్రయోగాలు, వైవిధ్యమైన సినిమాలు అనుకోవడానికి బాగుంటాయి. కానీ, 125 నుంచి 130 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నప్పుడు అన్ని యాంగిల్స్‌ చూడాలి.. ఫ్రెష్‌గా ఉండాలి.. పైగా పెద్ద హీరోలందరం ఒక విచిత్రమైన జోన్‌లో ఉన్నాం.. అన్నీ ఉండాలి.. లేకుంటే మార్కెట్‌కి ఇబ్బంది. అన్నీ కుదిరితే చిన్న సినిమా చేయొచ్చు.  
   
►  దేవిశ్రీ ప్రసాద్‌ పాటలు ఎలాగూ బాగా ఇస్తాడు.. నేపథ్య సంగీతం చాలా బాధ్యతగా చేస్తాడని నా భావన. నేపథ్య సంగీతంలో మంచి అనుభవం గతంలో మణిశర్మగారికి ఉండేది.. ఇప్పుడు దేవిశ్రీకి ఉంది. ఇప్పటికి 25 సినిమాలు చేశాను.. ఇంకా కొత్తగా ఏం చేయాలి? ఏం చేయొచ్చు? అని ఆలోచిస్తుంటా.  
     
► మా సినిమా నుంచి ముందు అనుకున్న కెమెరామేన్‌ తప్పుకున్నప్పుడు రత్నవేలుగారికి ఫోన్‌ చేయగానే గంట సమయం తీసుకుని ఓకే అన్నారు. తను లేకుంటే ఇంత స్పీడ్‌గా సినిమా పూర్తవ్వదు.. రామ్‌–లక్ష్మణ్‌ మాస్టర్స్‌ ఫైట్స్‌ ఇరగ్గొట్టేశారు.  
     
► ‘కేజీఎఫ్‌’ సినిమా డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ని కలిశాను.. కొన్ని స్టోరీ లైన్స్‌ విన్నా.. ఆ మాత్రానికే సినిమా ఫిక్స్‌ అయిపోదుగా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement