ఎన్టీఆర్ కి మరోసారి!
ఓ స్టార్ హీరో సినిమాకు, మరో స్టార్ హీరో వాయిస్ ఓవర్ ఇస్తే ఆ సినిమాకు ప్రత్యేకమైన క్రేజ్ వస్తుంది. అలా పవన్‌కల్యాణ్ ‘జల్సా’, ఎన్టీఆర్ ‘బాద్‌షా’ చిత్రాలకు మహేశ్‌బాబు వాయిస్ ఓవర్ ఓ స్పెషల్ ఎట్రాక్షన్ అయింది. దర్శక-నిర్మాతలు, హీరోలతో ఉన్న అనుబంధం దృష్ట్యా మహేశ్ ఆ సినిమాలకు తన గొంతు వినిపించారు. ఇటీవలే తన తండ్రి కృష్ణ కథానాయకునిగా నటించిన ‘శ్రీశ్రీ’ చిత్రానికి కూడా మహేశ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. తాజాగా ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘జనతా గ్యారేజ్’ చిత్రానికి మహేశ్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారనే వార్త ఫిలింనగర్‌లో జోరుగా షికార్లు చేస్తోంది.
మహేశ్ హీరోగా ‘శ్రీమంతుడు’ వంటి సూపర్ డూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న కొరటాల శివ దర్శకత్వంలో ‘జనతా గ్యారేజ్’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. మహేశ్‌తో కొరటాలకు మంచి అనుబంధం ఏర్పడింది. సో.. ‘జనతా గ్యారేజ్’కి నిజంగానే వాయిస్ ఓవర్ అవసరమైతే మహేశ్ కాదనరేమో!