
క్రైమ్ కామెడీ నేపథ్యంలో...
నటిగా పేరు తెచ్చుకున్న మంచు లక్ష్మి నిర్మాతగా కూడా తన విలక్షణతను చాటుకుంటున్నారు. ‘ఊ కొడతారా ఉలిక్కిపడతారా’, ‘గుండెల్లో గోదారి’ తర్వాత నిర్మాతగా మూడో చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఇందులో ఆమే కీలక పాత్రధారి. గురువారం హైదరాబాద్‌లో మొదలైన ఈ చిత్రానికి గౌతమ్‌మీనన్ శిష్యుడు ఎన్.వంశీకృష్ణ దర్శకుడు. ముహూర్తపు దృశ్యానికి మంచు లక్ష్మి భర్త ఆండి, కుమార్తె విద్యా నిర్వాణ కలిసి కెమెరా స్విచాన్ చేయగా, శ్రీనివాసనాయుడు క్లాప్ ఇచ్చారు. మంచు మనోజ్ గౌరవ దర్శకత్వం వహించారు.
క్రైమ్ కామెడీ నేపథ్యంతో ఈ చిత్రం రూపొందుతోందనీ, ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చేలా దర్శకుడు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతాడని తన నమ్మకమనీ మంచు లక్ష్మి చెప్పారు. అడివి శేష్, బ్రహ్మానందం, శాంతిప్రియ (భానుప్రియ సోదరి) తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: సాయిమాధవ్ బుర్రా, కథనం: ఎన్.వంశీకృష్ణ, మోహన్ భరద్వాజ్, ఛాయాగ్రహణం: బి.శ్రీనికేత్, సంగీతం: సత్య, కూర్పు: మధు, కళ: హరివర్మ, నిర్మాణం: మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫైవ్ ఎలిమెంట్స్.