
అదృష్టవంతుడు..!
మంచు మనోజ్ అంటే... చురుకుదనానికి చిరునామా. ‘దొంగ దొంగది’ టైమ్‌లో అతను బొద్దుగా ఉండేవాడు. కానీ తనలోని వేగానికి ఆ బొద్దుతనం కూడా అడ్డం రాలేదు. ‘మన్మథ రాజా మన్మథ రాజా’ పాటలో కథానాయిక సదాకు సవాల్ విసిరాడు మనోజ్. ఇప్పుడు గతంలోకి వెళ్లాల్సిన అవసరం దేనికంటారా! ‘దొంగా దొంగది’ సినిమా విడుదలై నేటికి పదేళ్లు. అంటే... హీరోగా మనోజ్ కెరీర్ మొదలై పదేళ్లన్నమాట. ఈ పదేళ్లలో 12 సినిమాల్లో మనోజ్ హీరోగా నటించాడు. వాటిలో ‘నేను మీకు తెలుసా?’, ‘వేదం’ చిత్రాలు ప్రయోగాలు.
‘ప్రయాణం’ ఓ ప్రేమకథ. బిందాస్, పోటుగాడు మాస్ కథలు. ఇలా విభిన్న రకాల చిత్రాల్లో నటిస్తూ నటునిగా సినిమా సినిమాకూ ఎదుగుతున్నారు. నేటి యంగ్ హీరోల్లో మహానటుడు ఎన్టీఆర్‌తో నటించిన అదృష్టవంతుడు కూడా మనోజే. ‘మేజర్‌చంద్రకాంత్’లో బాలనటునిగా ఎన్టీఆర్‌తో తెరను పంచుకున్నాడు తను. పుణ్యభూమి నా దేశం, అడవిలో అన్న చిత్రాల్లో బాలనటునిగా మనోజ్ నటన చూస్తే... తండ్రి మోహన్‌బాబు గుర్తుకురాక మానడు. పాత్ర కోసం తన శరీరాన్ని హింసించుకోవడానికి కూడా వెనుకాడని హీరో మనోజ్. ప్రస్తుతం ఆయన ‘కరెంట్ తీగ’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.