
'దేవదాసు బ్రేకప్..' అమ్మాయిలకు అంకితం
హీరో మంచు మనోజ్ గాయకుడి అవతారం ఎత్తి తాను పాడిన 'దేవదాసు బ్రేకప్..' పాటను తనకు స్ఫూర్తినిచ్చిన అమ్మాయిలకు అంకితం చేశాడు. ఈ పాట పాడుతున్నప్పుడు తీసిన వీడియో ఇంటర్నెట్లో విపరీతంగా ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. కరెంటు తీగ సినిమా కోసం మనోజ్ ఈ పాట పాడాడు. ఈ పాట ట్యూన్స్, లిరిక్స్ అన్నీ కూడా ఆకట్టుకునేలా ఉంటాయని, అందుకే ఈ పాట అందరినీ ఆకట్టుకుంటోందని, ఇంటర్నెట్లో విస్తృతంగా వెళ్లిపోయిందని మనోజ్ అన్నాడు.
పాటను విడుదల చేసిన ఒక్కరోజులోనే బాగా చూశారని చెప్పాడు. ఇక్కడే పాటను ఇంతలా ఆదరిస్తున్నారని, ఇక స్క్రీన్ మీద మరింతగా ఆకట్టుకుంటుందని తెలిపాడు. విష్ణు నిర్మాతగా వ్యవహరించి తీసిన ఈ సినిమాకు జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించారు. మనోజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించగా, సన్నీ లియోన్ కూడా ఓ ఐటెం సాంగ్లో తళుక్కుమంది. అక్టోబర్ రెండో తేదీన ఈ సినిమా విడుదల కానుంది.