సాక్షి, హైదరాబాద్: భారతీయ ఫ్యాషన్ డిజైనర్లలో టాప్‌లో ఉన్న బాలీవుడ్ డిజైనర్ మనీష్ మల్హోత్రా నగరానికి వచ్చారు. మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో శనివారం రాత్రి నిర్వహించిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్‌లో తన కలెక్షన్స్‌ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే...
నా అభిమాన డ్రెస్ శారీ. కాటన్ శారీ, టెంపుల్ శారీ, షిఫాన్ శారీ, పోచంపల్లి... ఇలా ఏదైనా సరే చీర కట్టుడు నాకు నచ్చే వస్త్రధారణ. ఇప్పటి ఫ్యాషన్‌లో బాగా ఇండివిడ్యువాలిటీ వ్యక్తమవుతోంది. ఇప్పుడు ఏదీ రెగ్యులర్ ఫార్మాట్‌లో ఉండాల్సిన అవసరం లేదు. తమదైన స్టైల్‌ని కోరుకుంటున్నారు.
సినిమాలు చూడాలని అమ్మ ప్రోత్సహించేది...
చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం. సహజంగా ఆ సమయంలో పిల్లలు సినిమాలు చూస్తుంటే పెద్దలు అడ్డుపడతారు. కాని మా అమ్మ నన్ను చూడమని ప్రోత్సహించేది. అంతేకాదు చిన్న వయసులోనే నా రూమ్‌లో పెట్టుకున్న వస్తువులు చూసి మా అబ్బాయి టైలర్ అంటూ సంతోషంగా చెప్పుకునేది. చాలా చిన్న వయసులోనే మోడలింగ్‌కు రావడానికి ఆమె ప్రోత్సాహం నాకు ఉపకరించింది.
శ్రీదేవిఅభిమాన నటి...
చాలా మంది నటీ నటులతో పనిచేసినా... శ్రీదేవి అభిమాన తార. నేను కొత్తగా వచ్చేటప్పటికి ఆమె బిగ్ స్టార్. మోడలింగ్ బ్యాక్ గ్రౌండ్‌తో సినీరంగంలోకి వచ్చాను. అప్పుడు నాకు 23 ఏళ్లు చాలా నెర్వస్‌గా ఉండేవాడ్ని. అలాంటి పరిస్థితుల్లో శ్రీదేవి నుంచి ఎన్నో నేర్చుకున్నాను. ప్రవర్తనతో పాటు లైనింగ్ లేని స్లీవ్స్, స్కర్ట్ కట్స్... వంటి ఆమె దుస్తులు కూడా నాకు డిజైనింగ్‌లో ఉపకరించాయి. ఖుదాగవా సినిమాలో తన కోసం స్వెట్టర్ రూపొందించి అందించడం, ఆమె అది పెయింటెడ్ కావాలనడం... ఇలా ఆమెతో పనిచేసినప్పుడు ఎన్నో మరచిపోలేని జ్ఞాపకాలు ఉన్నాయి.
రోజుకు 18గంటలు...
ఏదైనా సరే కఠినమైన డిజైనింగ్ వర్క్ అంటే అది నాకే ఇవ్వాలని అనుకుంటారు. అది నాకు ఛాలెంజింగ్‌గా అనిపిస్తుంది. ఈ మధ్యే మొఘలుల చరిత్ర నేపథ్యతో రూపొందుతున్న సినిమాలో భాగమయ్యా. ఎంతో స్టడీ చేయాల్సి వస్తోంది. ఇప్పటికీ రోజుకు 12, 18గంటలు కూడా పనిచేస్తున్నా. ఏదేమైనా.. మరే డిజైనర్‌కీ సాధ్య పడని విధంగా ఇండియన్ ఫ్యాషన్ బిజినెస్‌లో ఒక ముఖ్యమైన భాగంగా మారాను. అది నాకు గర్వంగా అనిపిస్తుంది.
దోశ, చికెన్.. సిటీ గ్రీన్
ఈ సిటీ బాగుంటుంది. ఇటీవలే జూబ్లీహిల్స్ లో నా లేబుల్‌తో ఒక పెద్ద ఫ్యాషన్ స్టోర్ కూడా ఏర్పాటు చేశాను. ముఖ్యంగా హైదరాబాద్ ఫుడ్ నాకు ఇష్టం. చికెన్ విత్ దోశ టేస్ట్ చేయకుండా వెళ్లను. ఇక్కడ గ్రీనరీ కూడా బాగా ఎక్కువే.. సిటీ ఇంత మోడ్రన్‌గా ఉన్నా కల్చర్‌కు ఇచ్చే ఇంపార్టెన్స్ మెచ్చకోవాలి. ముఖ్యంగా పెళ్లి టైమ్‌లో సంప్రదాయ దుస్తులు, సంగీత్ వంటి ఈవెంట్లు ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు. టాలీవుడ్‌లో నాకు సమంత, విజయ్ దేవరకొండ, ప్రభాస్, ఎన్టీయార్, మహేష్, పూజాహెగ్డే... నాకు నచ్చే తారల లిస్ట్ ఎండ్‌లెస్.
నిత్యవిద్యార్థులమే...
నా అసలు వయసు 53 అయినా కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా వయసు 30 ఏళ్లు. నా లేబుల్ వయసైతే కేవలం 15 ఏళ్లు. అలాగే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ కూడా 15ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. సో.. ఈ సందర్భం ఇద్దరికీ చాలా ముఖ్యమైనది. అందుకే ఈ షో చాలా స్పెషల్. తరాలకు అతీతంగా నటీనటులతో పనిచేస్తున్నా.
Comments
Please login to add a commentAdd a comment