ఎన్నో కసరత్తులు...
ఊరు కాని ఊళ్లో... ఎవ్వరూ అండ లేకున్నా నానా కష్టాలు పడుతూ భర్త కోసం వెతుకులాడే ఓ భార్య కథలో హిందీలో రూపొందిన ‘కహానీ’ బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. విద్యాబాలన్‌లోని ఉత్తమ నటిని మరోసారి ఆవిష్కరించిందా సినిమా. ఈ ‘కహానీ’ మన దర్శకుడు శేఖర్ కమ్ములను విపరీతంగా ఇన్‌స్పయిర్ చేసింది.
ఇంతవరకూ తన సొంత కథలతోనే సినిమాలు చేసుకున్న శేఖర్‌ని తొలిసారి రీమేక్ చేయడానికి సిద్ధపడేలా చేసింది. అదే ‘అనామిక’. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రంలో టైటిల్ రోల్‌ని నయనతార పోషించారు. ఇప్పటివరకూ గ్లామర్ పాత్రలకే పరిమితమైన నయనకు తనలోని నటిని ఆవిష్కరించుకోవడానికి దొరికిన సువర్ణావకాశమిది. అందుకే ఈ పాత్ర పోషణ కోసం ఎన్నో కసరత్తులు చేశారు. తనకు ఇష్టమైన కొన్నింటిని వదిలేసి మరీ ఈ పాత్ర చేశానని నయన స్వయంగా చెప్పుకున్నారు.
హర్షవర్థన్ రాణే, వైభవ్ కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని వయాకామ్18-ఐడెంటిటీ మోషన్ పిక్చర్స్ - లాగ్‌లైన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి. త్వరలోనే విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: కీరవాణి, కెమెరా: విజయ్ సి.కుమార్, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్.