
హీరోలందరూ దాసరిగారి కల నెరవేర్చాలి – నాని
► నాని
దర్శకరత్న దాసరి నారాయణరావుగారు ఈ రోజు మన మధ్య లేరు. సినిమా అన్నది హీరోది కాకుండా దర్శకుడిది కావాలన్నది ఆయన కల. ప్రస్తుత హీరోలందరూ ఆయన కలలో భాగమైతే ఆ కల నిజమైనట్లే’’ అని హీరో నాని అన్నారు. ఆది పినిశెట్టి, నిక్కీ గర్లాని జంటగా ఏఆర్‌కే శరవణన్ దర్శకత్వంలో రిషి మీడియా, శ్రీ చక్ర ఇన్నోవేషన్స్ నిర్మించిన సినిమా ‘మరకతమణి’. దిబు నైనన్ థామస్ స్వర పరచిన ఈ సినిమా పాటలను నాని విడుదల చేశారు. దర్శకుడు, హీరో ఆది తండ్రి రవిరాజా పినిశెట్టి మాట్లాడుతూ – ‘‘ఈతరం హీరోలను చూస్తే అసూయగా ఉంటుంది.
అందరూ భేషజాలు లేకుండా కలిసిపోతున్నారు. త్వరలో ఆదికి పెళ్లి చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో కథే హీరో. ఇప్పటి వరకు నేను సీరియస్ పాత్రలే చేశా. తొలిసారి చేస్తున్న కామెడీ చిత్రమిది’’ అన్నారు ఆది. శరవణన్ మాట్లాడుతూ – ‘‘ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అనుకునేవారికి టాలీవుడ్ ఇంకా పెద్ద ఇండస్ట్రీ అని నిరూపించిన ‘బాహుబలి’కి హ్యాట్సాఫ్. యూనివర్సల్ పాయింట్‌తో తెరకెక్కిన ‘మరకతమణి’ను తెలుగులోనూ చేద్దామని ఆది ముందు నుంచే ఎంకరేజ్ చేశారు’’ అన్నారు. హీరో ‘అల్లరి’ నరేష్, దర్శకులు కిషోర్ తిరుమల, కళ్యాణ్‌కృష్ణ, సంకల్ప్, రవికాంత్ పేరెపు, నటుడు తనికెళ్ళ భరణి, రచయిత కోన వెంకట్ తదితరులు పాల్గొన్నారు.