
నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమా (Hi Nanna Movie) బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. రూ.75 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం 2023 డిసెంబర్‌లో విడుదలైంది. శౌర్యువ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. తాజాగా ఈ సినిమాపై కన్నడ నిర్మాత పుష్కర మల్లికార్జునయ్య (Pushkara Mallikarjunaiah) సంచలన ఆరోపణలు చేశాడు. తన సినిమా కథను దొంగిలించారని ఆరోపించాడు.
తాను తెరకెక్కించిన భీమసేన నలమహారాజ మూవీ ఒరిజినల్ స్టోరీ అని.. తమ అనుమతి లేకుండా హాయ్ నాన్న పేరిట తెలుగులో రీమేక్ చేశారని మండిపడ్డాడు. ఇంత చీప్‌గా ప్రవర్తిస్తావనుకోలేదంటూ హీరో నానిని ట్యాగ్ చేశాడు. దీంతో హాయ్ నాన్న సినిమా టీమ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్నాళ్లూ ఒరిజినల్ కథ అని నమ్మించారు, తెలుగు ఇండస్ట్రీ తలదించుకునేట్లు చేస్తున్నారు కదా.. తిట్టిపోస్తున్నారు.

భీమసేన మూవీ ఎప్పుడొచ్చింది?
భీమసేన నలమహారాజ సినిమా (Bheemasena Nalamaharaja Movie) విషయానికి వస్తే ఇది కన్నడ చిత్రం. కార్తీక్ సరగుర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అరవింద్ అయ్యర్, ఆరోహి నారాయణ్, ప్రియాంక, ఆద్య, అచ్యుత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. చరణ్ రాజ్ సంగీతం అందించిన ఈ చిత్రం 2020 అక్టోబర్‌లో డైరెక్ట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. ఈ మూవీని హీరో రక్షిత్ శెట్టితో పాటు పుష్కర మల్లికార్జునయ్య, హేమంత్ ఎమ్ రావు నిర్మించారు. మల్లికార్జునయ్య.. కిరిక్ పార్టీ, గోధీ బన్నా సాధారణ మైకట్టు, హంబుల్ పొలిటీషియన్ నోగరాజ్, జీరిజింబె, అవతార పురుష, 10 వంటి పలు చిత్రాలను నిర్మించాడు.
చదవండి: మొన్న హీరోయిన్ సన్యాసం.. ఇంతలోనే మరో కథానాయిక సోదరి కూడా