ఆర్. నారాయణమూర్తి
‘‘ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. అలాంటి మన దేశం ఈ రోజు ప్రజాస్వామ్యంతో మనగలుగుతుందా? అనే ప్రశ్న మనకు మనం వేసుకుంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు నోటుకు ఓటు అన్నట్లు అయింది. ఈ రకంగా చేయటం వల్ల విత్తు ముందా చెట్టు ముందా అన్నట్టుగా నాయకుల తప్పా, ప్రజల తప్పా? అనే ప్రశ్న తలెత్తుతోంది’’ అన్నారు ఆర్. నారాయణమూర్తి. స్నేహచిత్ర పతాకంపై స్వీయదర్శకత్వంలో ఆర్. నారాయణమూర్తి నటించి, రూపొందించిన చిత్రం ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆర్. నారాయణమూర్తి చెప్పిన విశేషాలు.
► గతంలో ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా మంచి నాయకుడిని తమకు అండదండలుగా ఉండే నాయకుడిని ఎన్నుకొనేవారు. తర్వాతి కాలంలో ఆ వాతావరణాన్ని పూర్తిగా నాశనం చేశారు ఈ రోజు వచ్చిన నాయకులు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఈ రోజు ఎవరైతే నాయకుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడో అతనికి తను పోటీచేసే నియోజకవర్గం ఎల్లలు కూడా తెలియటం లేదు. కారణం వారు ఏదో ఒక వ్యాపారంలో కోట్లు గడించి రాజకీయాల్లోకి వస్తున్నారు.
పోటీ చేస్తున్నవారు లోకల్ వాళ్లు కాకపోతే అక్కడి ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయో వారికెలా తెలుస్తుంది. రాజకీయం అనేది సర్వీస్ మోటో, అది కాస్తా ఇప్పుడు బిజినెస్ మోటోగా మారిపోయింది. కోట్లు ఖర్చు పెట్టి మరీ రాజకీయాల్లోకి వస్తున్నారు. వారు పెట్టిన డబ్బును తిరిగి సంపాదించటానికి తప్పుదోవలో ప్రయాణిస్తున్నారు. అప్పుడు ఇది ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది. ధనస్వామ్యం అవుతుంది కానీ... అలా కాకూడదు అని చెప్పేదే నా ఈ ‘మార్కెట్‌లో ప్రజాస్వామ్యం’.
► ఈ సినిమాని ప్రేక్షకులు ఎందుకు చూడాలి అంటే కారణం ఉంది. ఆ రోజుల్లో మొదటగా రాచరికం ఉండేది, తర్వాత నియంతృత్వం వచ్చింది. ఆ దశ నుండి మిలటరీ రూల్, అక్కడినుండి కమ్యూనిస్ట్ రూల్ (కొంతమంది కలిసి పరిపాలించటం) తర్వాత వచ్చిందే ప్రజాస్వామ్యం. అన్నింటిలోకి గొప్పది గవర్నమెంట్ పరిపాలించే బెస్ట్ రూల్ ప్రజాస్వామ్యం. అది అత్యంత శాంతియుతమైనది. చదువుకున్నవాడు, చదువు లేనివాడు, ఉన్నవాడు, లేనివాడు.. అందరికీ ఒకేరకమైన హక్కు మన ప్రజాస్వామ్యం మనకు కలిగించింది. అందరి ఓటు విలువ ఒక్కటే. 100 కోట్లు పెట్టగలిగే వారు భారతదేశంలో 10 శాతం మాత్రమే. 90 శాతం మందికి అంత స్తోమత లేదు. ఆ కారణంగా ఈ పదిశాతం మందే మనల్ని పాలిస్తామంటే కుదరదు. 10 శాతం ఉన్నవాళ్లు పరిపాలించే దౌర్భాగ్య స్థితి నుంచి 90 శాతం ప్రజలు పరిపాలించే రోజు వస్తేనే ఇది ప్రజాస్వామ్యం అవుతుంది. ఈ విషయాన్నే సినిమాలో చూపించాను.
► ఈ సినిమాలో నా పాత్ర పేరు అంజిబాబు. ఓ రాజకీయ పార్టీకి క్యాడర్లో 40 సంవత్సరాలుగా సపోర్ట్ చేసే నాయకునిగా ఉండే పాత్ర నాది. ఈ సినిమాలో ఇసుక మాఫియాని అరికట్టే ప్రయత్నంలో లీడర్‌నే ఎదిరించే పాత్రను చేశాను. సినిమా కథ ఒక్క మాటలో చెప్పాలంటే లీడర్ వర్సెస్ కేడర్. ఓ రకంగా ఇది రామాంజనేయ యుద్ధం లాంటి కథ ఇది. మంచి డ్రామా ఉంటుంది. సినిమాలో మొత్తం ఆరు పాటలు ఉన్నాయి. 4 పాటలు పెద్ద హిట్ అయ్యాయి. గద్దర్ అన్న రాసిన పాటను విమలక్క పాడారు. సుద్దాల అశోక్ తేజ గారు ఓ పాట రాశారు. ఆ పాటను మనో పాడారు. గశికంటి రాజలింగం ఓ పాట రాశారు. ఆ పాటను ‘వందేమాతరం’ శ్రీనివాస్ పాడారు. గోరేటి వెంకన్న రెండు పాటలు రాశారు, అందులో ఓ పాటను ఆయనే పాడారు.
హ్యాట్సాఫ్ టు వై.ఎస్. జగన్
నేను ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్. జగన్‌మోహన్ రెడ్డి గారిని అభినందిస్తున్నాను. చాలామంది నాయకులు మీ పార్టీలోకి వస్తామంటే ఆయన ‘ముందుగా మీరు మీ పదవులకు రాజీనామాలు చేయండి. అప్పుడు పార్టీలో చేరండి. అంతేగానీ ఫిరాయింపులు మాత్రం వద్దు’ అని తేల్చి చెప్పారు. నా సినిమా కూడా ఫిరాయింపులకు వ్యతిరేకంగా తీసిన సినిమానే. అందుకే హ్యాట్సాఫ్ టు జగన్‌మోహన్‌రెడ్డి గారు. అదేవిధంగా కె.సి.ఆర్ గారు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభించిన రోజున ఎగువన ఉన్న మహారాష్ట్ర సీయంను దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ సీయంను ఆహ్వానించి ఇరు రాష్ట్రాల సీయంలతో పాటు శంకుస్థాపన చేయటం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మహదానందకరమైన విషయం. అలాగే కె.సి.ఆర్‌గారు, జగన్‌గారు కూర్చొని రెండు రాష్ట్రాల్లో నీరు వృథాగా పోకుండా ఎక్కడెక్కడ డ్యామ్‌లు నిర్మించవచ్చో చర్చించినందుకు హ్యాట్సాఫ్ టూ బోత్ చీఫ్ మినిస్టర్స్.
Comments
Please login to add a commentAdd a comment