పరుచూరి చేసిన పెళ్లి
ఎమ్మెస్ నారాయణది కులాంతర వివాహం. భాషా ప్రవీణ చదువుతున్నప్పుడు తన క్లాస్‌మేట్ కళాప్రపూర్ణను ఆయన ప్రేమించారు. ఆమె కూడా ఇష్టపడింది కానీ, వీరి ప్రేమను కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దాంతో భాషా ప్రవీణ ఫైనల్ ఇయర్‌లో తమకు లెక్చరరైన పరుచూరి గోపాలకృష్ణ సహాయం తీసుకున్నారు. స్వతహాగా కమ్యూనిస్టు భావాలున్న వ్యక్తి కావడంతో దగ్గరుండి ఎమ్మెస్ పెళ్లి జరిపించారు పరుచూరి. చిత్రపరిశ్రమకు వచ్చేటప్పుడు కూడా గోపాలకృష్ణను ఎమ్మెస్ సంప్రతించారు.
సినిమాల్లోకొచ్చాక చానాళ్లు ఎమ్మెస్‌కి అవకాశాలు రాలేదు. దాంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక ఊరెళ్లిపోతానని చెబితే, ‘మంచి టైమ్ వస్తుంది. ఓపిక పట్టు’ అని ఆయన గురువు పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. ఆ మాటలకు విలువ ఇచ్చి, ఆయన ఉండిపోయారు. పైకొచ్చాక పలు సందర్భాల్లో ‘ఆ రోజు ఓపిక పట్టమని మాస్టారు నాకు మంచి సలహా ఇచ్చారు’ అనేవాడని గోపాలకృష్ణ గుర్తు చేసుకున్నారు.