మే 9 వెరీ స్పెషల్‌ డే ఎందుకంటే? | MAY 9: Very Special And Unforgettable day In South Film History | Sakshi
Sakshi News home page

మే 9.. సినీ అభిమానులకు పండగ రోజు

Published Sat, May 9 2020 10:55 AM | Last Updated on Sat, May 9 2020 2:46 PM

MAY 9: Very Special And Unforgettable day In South Film History - Sakshi

ఒక్కొక్కరికి ఒక్కో చరిత్ర ఉంటుంది. అదేవిధంగా కొన్ని ప్రత్యేకమైన తేదీలు జనాల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోతాయి. అలా సినీ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని తేదీ మే9. ఈ తేదీకి ఘనమైన సినీ చరిత్రే ఉంది. ఈ తేదీ కోసం అభిమానులే కాదు దర్శకనిర్మాతలు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తారు. అసలు ఎందుకు మే 9 వెరీ స్పెషల్‌? అనేది చూద్దాం. సినీ పంచాంగం ప్రకారం ఈ తేదీన విడుదలైన దాదాపు అన్ని సినిమాలు సూపర్‌డూపర్‌ హిట్‌ అవుతాయి. అయ్యాయి కూడా. అవేంటో ఓ లుక్కేద్దాం..

జగదేకవీరుడు అతిలోకసుందరి, మరో చరిత్ర, భారతీయుడు, ప్రేమించుకుందాం రా, మహానటి, మహర్షి వంటి చిత్రాలు మే9న విడుదలయ్యాయి. ఈ చిత్రాలు ఏ రేంజ్‌లో విజయాలు అందుకున్నాయో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా మెగాస్టార్‌ చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్‌లో వచ్చిన జగదేకవీరుడు అతిలోకసుందరి టాలీవుడ్‌ చరిత్రలోనే ఓ అద్భుతం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రం వచ్చి నేటికి 30 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ టీవీల్లో ఈ సినిమా వస్తే చూడకుండా ఎవరూ ఉండలేరు. ‘ప్రేమించుకుందాం రా’తో వెంకటేష్‌ తన నటనతో ప్రతీ ఒక్క ప్రేమికుడి మనసు గెలుచుకున్నాడు. విజయం అందుకున్నాడు.

మహానటి సావిత్రి జీవితమే ఓ చరిత్ర. అలాంటి ఆమె జీవితకథను బయోపిక్‌గా రూపొందించి ‘మహానటి’గా చూపించాడు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. కీర్తి సురేష్‌ సావిత్రి పాత్రలో పరకాయప్రవేశం చేశారు. క్లాసిక్‌ వండర్‌గా వచ్చిన ఈ చిత్రం ఎన్నో సెన్సేషన్‌ రికార్డులను నమోదు చేసింది. ఈ తరం సినీ అభిమానులకు సావిత్రి గురించి తెలిపిన మహా చిత్రం ‘మహానటి’. టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు, వంశీపైడిపల్లి కాంబినేషన్‌లో వచ్చిన కమర్షియల్‌ చిత్రం ‘మహర్షి’. పాటలు ఓ వండర్‌ను క్రియేట్‌ చేస్తే.. సినిమా రికార్డులను క్రియేట్‌ చేసింది. మహేశ్‌ కెరీర్‌లో మర్చిపోలేని మైలురాయిగా ‘మహర్షి’ నిలిచింది. ఈ చిత్రాలన్నీ మే 9న విడుదల కావడం విశేషం. ఇక ప్రేమించుకుందాం రా మినహా మిగతా మూడు చిత్రాలు వైజయంతీ మూవీస్‌ పతాకంపైనే విడుదల కావడం మరో విశేషం. 

అంతేకాకుండా ఈ రోజు సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు బర్త్‌డే వేడుకలు జరుపుకుంటున్నారు. టాలీవుడ్‌ సెన్సేషన్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ, మోస్ట్‌ ట్యాలెంటెడ్‌ హీరోయిన్‌ సాయి పల్లవి, బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేష్‌ బాబు,  హీరో రానా తమ్ముడు అభిరామ్‌లది ఈరోజు బర్త్‌డే. దీంతో వారి అభిమానులు, సహచర నటీనటులు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీంతో బర్త్‌డే శుభాకాంక్షలతో సోషల్‌ మీడియా దద్దరిల్లిపోతుంది. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ తేదీన మరిన్ని చిత్రాలు, విశేషాలు వచ్చి చేరాలని అభిమానులు కోరుకుంటున్నారు. 

చదవండి:
104 డిగ్రీల జ్వరంతో ధినక్‌ తా ధినక్‌ రో...
‘సితారా.. సింగర్‌గా ట్రై చేయ్‌’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement