హర్ట్ అయ్యాడు! అందుకే రియాక్ట్ అయ్యాడు!
చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా వీవీ వినాయక్ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌చరణ్ నిర్మించిన సినిమా ‘ఖైదీ నెంబర్ 150’. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత చిరంజీవి నటించిన ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిరంజీవి పాత్రికేయులతో ముచ్చటించారు.
► ప్రీ–రిలీజ్ ఫంక్షన్‌లో నాగబాబు వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. మీ స్పందన ఏంటి?
నాగబాబు హర్ట్ అయ్యాడు. అందుకే, రియాక్ట్ అయ్యాడు. అలాంటి కామెంట్స్ చూసినప్పుడు నేనూ హర్ట్ అవుతా. కానీ, పెద్దగా పట్టించుకోను. అందరూ ఒకలా ఉండరు కదా! ఇక, తను మాట్లాడిన వేదిక సరైనదా? కాదా? అనే విషయం గురించి నేను పెద్దగా ఆలోచించలేదు.
► 150 సినిమాలు చేశారు. నటుడిగా సాధించాల్సిన లక్ష్యాలు, డ్రీమ్ రోల్స్ ఏవైనా ఉన్నాయా?
‘తుదిశ్వాస వరకూ నటించాలనుంది’ అని అక్కినేని నాగేశ్వరరావుగారు అనేవారు. మహానుభావుడు అలాగే చేశారు. ఏ నటుడైనా ప్రేక్షకాదరణ ఉన్నంత వరకూ నటిస్తూనే ఉండాలని కోరుకుంటారు. ప్రేక్షకాదరణ లేదంటే మాత్రం ఆలోచించుకోవాలి.
► అసలు రీమేక్ ఎందుకు చేయాల్సి వచ్చిందని చాలామంది ప్రశ్నిస్తున్నారు కదా!
‘ఠాగూర్’ రీమేక్ చేస్తే ప్రేక్షకులు అభినందించారు. ‘ఠాగూర్’, ‘స్టాలిన్’ తరహా సందేశాత్మక సినిమా ‘కత్తి’. బ్యాంకుల్లో వేలకోట్లు రుణం ఎగ్గొట్టినోళ్లు విదేశాల్లో స్కాచ్ తాగుతున్నారు. దేశానికి వెన్నెముక అయిన రైతు పురుగుల మందు తాగుతున్నాడు. మన దేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు ఎందరు? అందులో తెలుగువాళ్లు ఎంత మంది? వంటి సమస్యలను చిత్రంలో ప్రస్తావిస్తున్నాం. మంచి కథాంశం కాబట్టి, రీమేక్ చేశాం.
► 24 గంటల్లో సినిమా విడుదల.. టెన్షన్ ఏమైనా?
కథ, సినిమాపై కాన్ఫిడెంట్‌గా ఉన్నా. తమిళ ‘కత్తి’లో మొనాటనీ ఫీలైన సీన్స్, సాంగ్స్ సిట్యువేషన్స్ ఛేంజ్ చేశాం. కొత్తగా కామెడీ ఎపిసోడ్ క్రియేట్ చేశాం. సినిమా ట్రీట్‌మెంట్ ఫాస్ట్‌గా ఉంటుంది. తమిళ డైలాగులకూ, మన డైలాగులకూ సంబంధం లేదు. ఇక, కాంపిటీషన్‌లో చిన్న స్ట్రెస్ ఉంటుంది. దాన్ని ఎవరూ ఎవాయిడ్ చేయలేరు.
► ఇప్పుడు సినిమాలు వందరోజులు ఆడే పరిస్థితి లేదు. అంతా ఫస్ట్‌డే కలెక్షన్స్, రికార్డుల గురించి మాట్లాడుతున్నారు. మీరు ఆ లెక్కల గురించి ఆరా తీస్తారా?
లేదు. కలెక్షన్స్ పరంగా నాది జీరో నాలెడ్జ్. ఫస్ ్టకాపీ చూశాక, మిగతా విషయాలు ఆలోచించను. నా సినిమాతో పాటు వస్తున్న బాలకృష్ణ సినిమా, ఆర్. నారాయణమూర్తి సినిమా, శర్వానంద్ సినిమా ఇలా అన్ని సినిమాలూ బాగా ఆడాలి.
► ఇటీవల సోషల్ మీడియాలో స్టార్స్‌పై కామెంట్స్ ఎక్కువయ్యాయి. దీనిపై మీ స్పందన?
అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎవరినైనా నియంత్రించడం కష్టం అవుతోంది. హద్దు మీరి ఎవరు ప్రవర్తించినా తప్పే. యూ ట్యూబ్ హిట్స్ కోసం దారుణమైన హెడ్డింగ్స్ పెడుతున్నారు. లోపల ఏం ఉండదు. స్వీయ నియంత్రణ ఉండాలి.
► హిందీ హీరోలు తమ వయసుకు తగ్గ పాత్రలు చేస్తున్నారు. తెలుగులో మాత్రం అలా లేకపోవడం...
ఇప్పుడు వెంకటేశ్ ‘గురు’ చేస్తున్నారు కదా! ‘రోబో’, ‘లింగా’ సినిమాల్లో యువకుడిగా నటించిన రజనీకాంత్, ‘కబాలి’లో వయసుకు తగ్గ పాత్ర చేశారు. అలాంటి ఛాన్స్ వస్తే నేనూ రెడీ. ఛాలెంజింగ్ పాత్రలు, సినిమాలు చేయడానికి నేను వెనకాడను.
► మీ నుంచి ‘పీకే’ వంటి సినిమా ఆశించవచ్చా!
ఫస్ట్ సీన్ (కేవలం రేడియో అడ్డుపెట్టుకుని ఆమిర్‌ఖాన్ నగ్నంగా నటించిన సన్నివేశం) తప్ప! (నవ్వు) నటుడిగా నాకంటూ పరిమితులున్నాయి. నాకు ఆమిర్ అంత టాలెంట్ ఉందనుకోవడం లేదు.
► ఈ సినిమా కోసం విన్న కథల్లో దేన్నయినా నెక్ట్స్ సినిమాగా చేసే ఛాన్సుందా?
పరుచూరి బ్రదర్స్ చెప్పిన ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ చేసే ఛాన్సుంది. సురేందర్‌రెడ్డి వైవిధ్యమైన కథ చెప్పారు. 151కి అది పరిశీలనలో ఉంది. బోయపాటి శ్రీనుతో గీతా ఆర్ట్స్‌లో 152వది అనుకుంటున్నాం. సెప్టెంబర్‌లో అది మొదలు కావొచ్చు.