యువతకు దగ్గరయ్యేలా... | Meghamsh's Rajdoot to be released in 5 July | Sakshi
Sakshi News home page

యువతకు దగ్గరయ్యేలా...

Published Tue, Jun 18 2019 2:49 AM | Last Updated on Tue, Jun 18 2019 2:49 AM

Meghamsh's Rajdoot to be released in 5 July - Sakshi

నక్షత్ర, మేఘాంశ్‌

దివంగత నటుడు శ్రీహరి తనయుడు మేఘాంశ్‌ కథానాయకుడిగా పరిచయమవుతోన్న చిత్రం ‘రాజ్‌ దూత్‌’. నక్షత్ర, ప్రియాంక వర్మ హీరోయిన్లు. అర్జున్‌ – కార్తీక్‌ దర్శకత్వం వహించారు. లక్ష్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎమ్‌.ఎల్‌.వి సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మించిన ఈ సినిమా జూలై 5న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఎమ్‌.ఎల్‌.వి సత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘శ్రీహరి వారసుడిగా మేఘాంశ్‌ సంచలనాలు సష్టించడం ఖాయం అన్న ఆసక్తికర చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో సాగుతోంది. హీరోయిజానికి సరిపడే ఛామింగ్‌ డ్యాషింగ్‌ లుక్‌ అతడికి ఉంది. యూట్యూబ్, సామాజిక మాధ్యమాల్లో పలువురు మేఘాంశ్‌ లుక్, అప్పియరెన్స్‌పై ప్రశంసలు కురిపించారు.

ఇటీవలే విడుదలై చిత్ర టీజర్‌ మిలియన్‌ వ్యూస్‌ అధిగమించి యూట్యూబ్‌లో అనూహ్యమైన ఆదరణ పొందుతోంది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు ముగింపు దశకు చేరుకున్నాయి’’ అన్నారు. ‘‘టీజర్‌తోనే ప్రశంసలు దక్కించుకున్న మా అబ్బాయికి తండ్రి శ్రీహరి ఆశీస్సులతో పాటు తెలుగు ప్రేక్షకుల ఆశీర్వాదాలు కూడా లభిస్తాయనే నమ్మకం ఉంది’’ అని మేఘాంశ్‌ తల్లి, నటి శాంతి శ్రీహరి అన్నారు. ‘‘మేఘాంశ్‌కు ఇది తొలి చిత్రమైనా తన యాక్షన్‌ సన్నివేశాలు చిత్రానికే హైలైట్‌గా నిలుస్తాయి. యువతకు దగ్గరయ్యేలా అతని నటన ఉంటుంది’’ అని దర్శకులు అర్జున్‌ – కార్తీక్‌ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: విద్యాసాగర్‌ చింతా, సంగీతం: వరుణ్‌ సునీల్, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: ఎం.ఎస్‌. కుమార్‌.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement