కంపెనీల్లోనూ మీటూ ప్రకంపనలు | Metoo Movement Vibration In Companies | Sakshi
Sakshi News home page

కంపెనీల్లోనూ మీటూ ప్రకంపనలు

Published Sun, Oct 14 2018 9:38 AM | Last Updated on Sun, Oct 14 2018 2:07 PM

Metoo Movement Vibration In Companies - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

మీటూ ప్రకంపనలు అన్ని రంగాలను పట్టి కుదిపేస్తున్నాయి. బాలీవుడ్‌ నటి తనూశ్రీ దత్తా కొన్నేళ్ల క్రితం నానాపటేకర్‌ తనని లైంగికంగా వేధించారంటూ ఆరోపించడం ఎందరో  బాధిత మహిళల్లో ధైర్యాన్ని నింపింది. వారంతా తమకి ఎదురైన అనుభవాలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. సినిమా, సాహిత్యం, మీడియా, క్రీడలు, రాజకీయాలు చివరికి ప్రభుత్వంలోనూ ఈ ప్రకంపనలు రేగడంతో పని ప్రాంతాల్లో మహిళల భద్రతపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. సంఘటన ఎన్నేళ్ల క్రితం జరిగినదైనా మహిళలు ఫిర్యాదు చేస్తే దానిని విచారణకు స్వీకరిస్తామని, ఈ కేసుల విచారణకు కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ ప్రకటించడంతో పలు బహుళ జాతి సంస్థలు వణికిపోతున్నాయి.

గతంలో మహిళల ఫిర్యాదుల్ని నిర్లక్ష్యం చేసినవి, క్షుణ్ణంగా విచారించని కేసుల్ని ఇప్పుడు తిరగతోడే పనిలో ఉన్నాయి.  ఏ కేసులు తమ మెడకు చుట్టుకుంటాయోమోనన్న ఆందోళనలో కంపెనీలు ఉన్నాయి. పని చేసే ప్రదేశాల్లో లైంగిక వేధింపుల్ని నిరోధించాలంటూ వివిధ రంగాలకు చెందిన మహిళలు బహిరంగ లేఖ రాయడంతో పాత కేసుల్ని విచారించి బాధితులకి న్యాయం చేయడానికి కంపెనీలు ముందుకొచ్చాయి. అంతేకాదు ఒకసారి పరస్పరం రాజీపడిన కేసుల్లోనైనా బాధిత మహిళలు తమకు అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేస్తే, చట్ట ప్రకారం దానిని తప్పనిసరిగా విచారించాల్సి ఉంటుంది. ‘‘లైంగిక వేధింపుల కేసుల్లో రాజీ ఒప్పందాలతో మహిళలు ఇక మౌనంగా ఉంటారనుకుంటే పొరపాటే. చట్టప్రకారం వాళ్లు ఎప్పుడైనా మళ్లీ నోరు విప్పవచ్చు. అప్పుడు కేసులు తిరగతోడాల్సి ఉంటుంది’’ అని పలు కంపెనీలకు లీగల్‌ అడ్వయిజ్‌గా ఉన్న జుల్ఫికర్‌ మెమన్‌ వెల్లడించారు. 

పాత కేసుల్లోనూ లోతైన విచారణ 
ఆర్థిక, మౌలికసదుపాయాలు, ప్రకటనలు, ఆతిథ్య రంగాలకు చెందిన పలు కంపెనీలు మహిళా ఉద్యోగులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ? గతంలో కేసులేమిటి ? ఆ కేసుల్లో బాధిత మహిళలు తమకు అన్యాయం జరిగిందని భావించి మళ్లీ ట్వీట్‌ చేస్తే తమ పరిస్థితి ఏమిటన్న దిశగా ఆలోచన చేస్తున్నాయి. మీటూ అంశంలో తమ కంపెనీలపై ఎలాంటి మచ్చ రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాయి. ముంబైకి చెందిన ఒక మల్టీ నేషనల్‌ బ్యాంక్‌లో  చీఫ్‌ ఫైనాన్సియల్‌ అధికారిపై 2013లో నమోదైన లైంగిక వేధింపుల కేసులో అంతర్గత విచారణ కమిటీ క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. అయినప్పటికీ మరోసారి ఆ కేసుని లోతుగా పరిశీలించడానికి ఆ బ్యాంకు లాయర్లని, ఫోరెన్సిక్‌ ఇన్వెస్టిగేటర్లను నియమించింది.

అప్పట్లో ఫిర్యాదు చేసిన మహిళలందరితోనూ లాయర్లు కలిసి వివరాలు తీసుకోనున్నారు. కేవలం ఆ బ్యాంకు మాత్రమే కాదు డజనుకు పైగా బహుళ జాతి సంస్థలు పాత కేసుల్ని మరోసారి క్షుణ్ణంగా పరిశీలించడానికి చర్యలు చేపట్టాయి. దక్షిణాదికి చెందిన ఒక మౌలిక సదుపాయాల కంపెనీలో ఉపాధ్యక్షుడిగా ఉన్న వ్యక్తిపై మహిళా ఉద్యోగి 2015లో లైంగిక ఆరోపణలు చేశారు. కానీ ఆ కంపెనీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఆ కంపెనీ ఉపాధ్యక్షుడికి అధ్యక్షుడి అండదండలున్నాయంటూ ఆమె  రాజీనామా చేశారు. మీటూ ఉద్యమ నేపథ్యంలో ఆ మహిళ మళ్లీ ఎలాంటి కేసులు వేస్తుందోనన్న ఆందోళనతో ఆ కంపెనీ ఉంది. అలాంటి పాత  కేసుల్ని మరోసారి విచారణ జరిపించాలని నిర్ణయించుకుంది. గతంలో ఫిర్యాదులకు సంబంధించి ఈమెయిల్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌ వంటి వాటిల్లో సాగిన సంభాషణలన్నింటినీ మరోసారి పరిశీలిస్తున్నారు. 

మహిళా నేతల బహిరంగ లేఖ 
అడ్వర్టయిజింగ్, డిజైన్, మీడియా రంగాలకు చెందిన మహిళా ఉద్యోగ సంఘాల నేతలందరూ కలసికట్టుగా తమ కంపెనీల్లో లైంగిక వేధింపులపై బహిరంగ లేఖ రాశారు. అత్యున్నత పదవుల్లో ఉన్న ఈ మహిళలకు లైంగిక వేధింపులు తప్పలేదు. ‘‘మగవాళ్లు తమ అధికారాన్ని ఉపయోగించుకొని వివక్ష చూపించడం, దూషించడం,  వేధించడం వంటివి చేయకూడదు. ఈ మూడు రంగాలకు చెందిన కంపెనీల్లో మహిళలకు స్వేచ్ఛగా పనిచేసుకునే వాతావరణం కల్పించేంతవరకూ మేము ముందుకు సాగలేం’’ అని మహిళలు ఆ బహిరంగ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు లైంగికంగా వేధించారంటూ చాలా మంది పేర్లు బయటపెట్టారు. 
లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నవారిలో  ప్రముఖ కన్సల్టెంట్‌ సుహేల్‌ సేథ్‌తో సహా చాలా మంది ఉన్నారు. వివిధ రంగాలకు చెందిన నలుగురు మహిళలు సుహేల్‌ సేథ్‌పై ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి వాట్సాప్‌ చాటింగ్‌ స్క్రీన్‌ షాట్స్‌ని కూడా బయటపెట్టారు. 

పని చేసే ప్రదేశాల్లో  వేధింపులపై చట్టం ఏం చెబుతోందంటే
1992లో రాజస్థాన్‌ ప్రభుత్వం భన్వరిదేవి అనే మహిళను గ్రామీణ ప్రాంతాల్లో బాల్యవివాహాల నిరోధానికి ఏజెంట్‌గా నియమించింది. ఆ పనిలో ఉండగా భన్వరిదేవి సహచర ఉద్యోగులు కొందరు లైంగికంగా వేధించారు. దీంతో విశాఖ అనే మహిళా సంస్థ రాజస్థాన్‌ ప్రభుత్వంపై కోర్టుకెక్కింది. ఈ కేసుని విచారించిన సుప్రీంకోర్టు 1997లో పనిప్రదేశాల్లో మహిళల సమాన హక్కులు, వారి గౌరవ మర్యాదల్ని కాపాడేలా కొన్ని సిఫార్సులు చేసింది. విశాఖ కేసు సిఫారసులకు అనుగుణంగానే 2013లో కేంద్ర ప్రభుత్వం పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టాన్ని తీసుకువచ్చింది. మహిళలు పని చేయడానికి వీలుగా సురక్షిత వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత కంపెనీ యాజమాన్యాలదేనని స్పష్టం చేసింది.
 
లైంగిక వేధింపులు అంటే 

సుప్రీం కోర్టు ప్రకారం శారీరక సంబంధం, దురుద్దేశపూర్వకంగా తాకడం ,  కోరిక తీర్చమని బలవంతం చేయడం, సైగలు చేయడం, అసభ్యకరమైన మాటలు, అశ్లీల సంభాషణలు, పోర్నోగ్రఫీ వీడియోలు చూపించడం వంటివన్నీ లైంగిక వేధింపుల కిందకే వస్తాయి. ఈ వేధింపులు రుజువైతే గరిష్టంగా అయిదేళ్లు శిక్ష పడుతుంది. 

విచారణ ఎలా
పని ప్రదేశాల్లో 10 మందికంటే ఎక్కువ మంది మహిళలు ఉంటే అంతర్గత విచారణ కమిటీని నియమించాల్సి ఉంటుంది. బాధిత మహిళలెవరైనా ఆరోపణలు చేస్తే ఆ కమిటీ విచారణ జరుపుతుంది. ఆ కమిటీలో కనీసం నలుగురు సభ్యులుండాలి. అందులో ఇద్దరు మహిళలై ఉండాలి. పది మంది కంటే తక్కువ మంది మహిళలుంటే అంతర్గత విచారణ కమిటీని నియమించాల్సిన పనిలేదు. ఏవైనా ఫిర్యాదులుంటే జిల్లా అధికారుల ఆధ్వర్యంలో స్థానిక ఫిర్యాదుల కమిటీకి విన్నవించవచ్చు. ఆ కమిటీలో మహిళా హక్కుల కోసం పోరాడే ఎన్జీవోలకు స్థానం ఉంటుంది. ఒకవేళ అంతర్గత విచారణ కమిటీకి ఫిర్యాదు చేయడం ఇష్టం లేకపోయినా, ఆ కమిటీ అన్యాయమైన తీర్పు ఇచ్చిందని భావించినా, ఆ సంస్థను వీడి వచ్చిన తర్వాత ఫిర్యాదు చేయాలని అనుకున్నా కోర్టును ఆశ్రయించవచ్చు. పోలీసు స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు కూడా చేయొచ్చు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement