పశ్చిమాన రాజుకున్న నిప్పుకణం ‘మీ టూ’ కార్చిచ్చులా మారి ఖండాంతరాలు దాటి మన దేశాన్ని తాకడానికి దాదాపు ఏడాది సమయం తీసుకుంది. పనిచేసేచోట అడుగడుగునా రకరకాల రూపాల్లో తమకెదురైన వేధింపులు, అవమానాలు ఎప్పటికప్పుడు దిగమింగుకుంటూ, తమలో తామే కుమిలిపోతూ మౌనంగా ఉండిపోయిన మహిళాలోకం ఇప్పుడిప్పుడే నోరు తెరుస్తుంటే... ఇన్నాళ్లూ మర్యాదస్తుల్లా, సంస్కారవంతుల్లా తమ తమ రంగాల్లో వెలిగిపోయిన ప్రముఖులంతా దిక్కుతోచక కకావికలవుతున్నారు దేనికైనా ఆద్యంతాలున్నట్టే దీనికి కూడా ముగింపు ఉండక పోతుందా అని ఆశపడుతున్నారు. మన దేశంలో ఈ వెల్లువకు బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా కార ణమైనా నిరుడు హాలీవుడ్ దర్శకుడు హార్వీ వైన్‌స్టీన్ వ్యవహారం బయటికొచ్చాక కొందరు మహి ళలు ఫేస్‌బుక్ వేదికగా తమ పేర్లు వెల్లడించకుండా ఇబ్బందులకు గురిచేసినవారి వివరాలు బయట పెట్టారు. బాధితుల పేర్లు లేకపోవడం, ఎలాంటి వేధింపులకు గురిచేశారో చెప్పకపోవడం వల్ల ఆ జాబితాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. బాధితులు ధైర్యంగా దోషులను చూపాలి తప్ప ఈ పోకడ సరికాదన్న విమర్శలు వచ్చాయి. కారణమేమైనా అది త్వరలోనే చల్లబడిపోయింది. ఆ జాబితాలో అత్యధికులు విశ్వవిద్యాలయాల అధ్యాపకులే ఉన్నారు.
ప్రస్తుత ధోరణి అందుకు విరుద్ధం. ఇది ఏ ఒక్క రంగానికో పరిమితమై లేదు. సినిమారంగం మొదలుకొని పత్రికారంగం వరకూ అన్నిటినీ ఇది తాకింది. నటులు, దర్శకులు, రచయితలు, పాత్రికేయులు, రాజకీయ నాయకులు, క్రీడారంగ ప్రముఖులు–ఇలా ఎందరెందరి నిజస్వరూపాలో బయటపడుతున్నాయి. ఆరోపణలు చేస్తున్నవారిలో వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతులు గడించిన వారున్నారు. పేరు వెల్లడించని మహిళలున్నారు. పేర్లు చెప్పినా కెమెరా ముందుకొచ్చి చెప్పడానికి ఇష్టపడనివారున్నారు. తమకేం జరిగిందో చెబితే అందుకు రుజువులడుగుతారని, తమనే దోషిగా చూస్తారన్న భయం గతంలో ఉండేది. కానీ ఇప్పుడలాంటి సంకోచాలు పోయాయి. తాము ఎలాంటి హింసను ఎదుర్కొన్నామో చెబుతున్నారు. కొందరు తమ వాదనకు సాక్ష్యాధారాలుగా వాట్సాప్, ఎస్సెమ్మెస్ సందేశాలు చూపుతున్నారు. తనుశ్రీ దత్తా బయటపడిన వెనువెంటనే యూ ట్యూబ్ కామెడీ బృందం ఏఐబీలో ఉత్సవ్ చక్రవర్తి అనే రచయిత, హాస్యనటుడు వేధించిన తీరును, దానిపై ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడాన్ని ఒక మహిళా కళాకారిణి వెల్లడించటంతో అదే బృందంలోని మరో ఇద్దరి సంగతి బయటపడింది. వీరిపై ఆ బృందం నిర్వాహకులు చర్యలు తీసు కోక తప్పలేదు. ఇది వెనువెంటనే ఇతర రంగాలకు పాకింది. హింసను సహిస్తూ, భరిస్తూ కాలం గడిపితే దాన్నుంచి ఎప్పటికీ తప్పించుకోవడం సాధ్యం కాదని, కారకుల్ని బజారుకీడిస్తే తమ సమస్యకు పరిష్కారం దొరకడంతోపాటు, తమవంటి ఎందరెందరినో సమస్యల నుంచి తప్పిం చవచ్చునన్న స్పృహ అందరిలో పెరిగింది. ‘మీ టూ’ వెల్లువ తీసుకొచ్చిన గణనీయమైన మార్పు ఇది. వ్యక్తుల్లో, వ్యవస్థల్లో దీర్ఘకాలంగా పాతుకుపోయిన బాధ్యతారాహిత్యాన్ని ప్రశ్నిస్తున్న మహి ళలకు దీటుగా ధైర్యాన్ని ప్రదర్శించవలసింది ఇక సమాజమే, దానికి చోదకశక్తిగా ఉండవలసిన పాలక వ్యవస్థే. అప్పుడే ఇతర రంగాలు కూడా ప్రక్షాళన అవుతాయి.
అలా చూసుకుంటే విదేశాంగ శాఖ సహాయమంత్రి, ఒకనాటి ప్రముఖ పాత్రికేయుడు ఎం.జె. అక్బర్ విషయంలో కేంద్రం స్పందన పేలవంగా ఉందని చెప్పక తప్పదు. కొందరు మహిళలు గతంలో తాము ఆయనతో కలిసి పనిచేసినప్పుడు ఎదురైన చేదు అనుభవాలను వెల్లడించారు. ఇవి అబద్ధాలని, నిరాధారమైనవని ఆయన చెబుతున్నారు. ఈ ఆరోపణలు చేసినవారిపై చట్టపరంగా చర్య తీసుకుంటానన్నారు. వారిలో ఒకరైన ప్రియా రమణిపై ఢిల్లీ పటియాల కోర్టులో పరువునష్టం కేసు కూడా దాఖలు చేశారు. నిజమే... ఆరోపణలొచ్చినంత మాత్రాన ఎవరూ దోషి కాదు. ఆ ఆరో పణలు చేసినవారు అందుకు సాక్ష్యాధారాలు చూపవలసి ఉంటుంది. వాటి సంగతి అంతిమంగా న్యాయస్థానాల్లో తేలవలసిందే. అయితే బాధ్యతాయుతమైన పదవుల్లో ఉంటున్నవారు ఈలోగా నైతిక బాధ్యత వహించి వైదొలగడమే సరైనది. బాలీవుడ్ రంగంలో మహిళలను వేధించారన్న ఆరోపణలొచ్చివారితో తాము పనిచేయబోమని కొందరు హీరోలు, కొన్ని నిర్మాణ సంస్థలు ప్రక టించాయి. కొన్ని మీడియా సంస్థలు ఆరోపణలొచ్చిన పాత్రికేయులను బయటకు వెళ్లగొట్టాయి. కొందరు రచయితలు బాధిత మహిళలకు క్షమాపణలు చెప్పారు. తమను అపార్థం చేసుకున్నారని కొందరు వాపోయారు. వీరెవరికీ లేని వెసులుబాటు అక్బర్‌కి ఉండటంలో అర్ధం లేదు. ప్రజాజీవన రంగంలో ఉంటున్నవారి నుంచి నిజానికి ఇంతకి మించి ఆశిస్తారు. ఎన్నికలొస్తున్నాయి గనుక తమ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం కోసమే ఇదంతా జరుగుతున్నదన్న వాదన నిలబడదు. ఆరోపణలు చేసినవారు పాత్రికేయరంగంలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నవారు. రాజకీయాలకు ఆమడ దూరంలో ఉంటున్నవారు.
ఏదేమైనా గతంతో పోలిస్తే ఇప్పుడెంతో మార్పు కనిపిస్తోంది. సరిగ్గా ముప్ఫై ఏళ్లక్రితం 1988లో చండీగఢ్‌లో అప్పటి పంజాబ్ డీజీపీ కేపీఎస్ గిల్, ఐఏఎస్ అధికారిణి రూపన్ దేవల్ బజాజ్ పట్ల అసభ్యంగా ప్రవర్తించినప్పుడు ఆమెకు ఈ తరహా మద్దతు లభించలేదు. దీనిపై రాద్ధాంతం చేయొద్దని సర్కారీ పెద్దలు సలహా ఇచ్చారు. ఆమె ఒంటరిగా న్యాయస్థానంలో పోరా డితే గిల్ చేసింది నేరమేనన్న తీర్పు 17 ఏళ్ల తర్వాత వెలువడింది. ఈలోగా ఆమె కుటుంబం ఎన్నో బెదిరింపులు ఎదుర్కొనవలసి వచ్చింది. అకారణంగా బదిలీలు తప్పలేదు. మహిళలు సైతం అన్ని విధాలా ఎదగాలని, వారూ సమాజంలో తమ వంతు పాత్ర పోషించాలని కోరుకుంటున్నప్పుడు అందుకు అనువైన, క్షేమదాయకమైన వాతావరణం కల్పించవలసిన బాధ్యత మొత్తం సమాజంపై ఉంది. ఆ విషయంలో పాలకుల చిత్తశుద్ధికి ప్రస్తుత పరిణామాలు ఒక పరీక్ష.
Published Tue, Oct 16 2018 12:45 AM | Last Updated on Tue, Oct 16 2018 12:45 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment