'మెట్రో' మూవీ రివ్యూ | Metro Movie Review | Sakshi
Sakshi News home page

'మెట్రో' మూవీ రివ్యూ

Published Fri, Mar 17 2017 1:16 PM | Last Updated on Tue, Oct 16 2018 5:14 PM

Metro Movie Review

టైటిల్ : మెట్రో
జానర్ : క్రైం థ్రిల్లర్
తారాగణం : శిరీష్, బాబీ సింహా, సేంద్రయన్, సత్య, తులసి
సంగీతం : జోహన్
దర్శకత్వం : ఆనంద కృష్ణన్
నిర్మాత : సురేష్ కొండేటి, రజనీ తల్లూరి

ప్రేమిస్తే, జర్నీ లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన సురేష్ కొండేటి మరో తమిళ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ప్రస్తుతం మెట్రో నగరాల్లో జరుగుతున్న చైన్ స్నాచింగ్ ఉదంతాల నేపథ్యంలో ఆనంద కృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కిన మెట్రో తమిళ నాట సంచలనం సృష్టించింది. ఏఆర్ మురుగదాస్, గౌతమ్ మీనన్ లాంటి స్టార్ డైరెక్టర్ల ప్రశంసలు అందుకున్న మెట్రో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందా..?



కథ :
ఆది కేశవ్( శిరీష్), సంతోషం పేపర్లో రైటర్గా పనిచేస్తుంటాడు. అమ్మ, నాన్న, తమ్ముడు ఇదే ఆది.. ప్రపంచం. చిన్నప్పటి నుంచి ఉన్నదాంట్లోనే సంతృప్తి పడాలనే మనస్థత్వం ఆదిది. చిన్న ఉద్యోగం చిన్న జీతం.. అయినా అప్పులు లేకుండా ఉంటే హాయిగా నిద్రపడుతుందన్న తండ్రి మాటను ఫాలో అవుతుంటాడు. కానీ ఆది తమ్ముడు, మధు(సత్య) మాత్రం రిచ్గా బతకాలనుకుంటాడు. తన గర్ల్ ఫ్రెండ్ను కాస్ట్లీ బైక్ మీద షికారుకు తీసుకెళ్లాలని, ఐఫోన్ చేతిలో పట్టుకొని తిరగాలని కలలు కంటుంటాడు. మధు కోరికను ఆసరాగా తీసుకున్న ఫ్రెండ్స్ అతన్ని తప్పుదోవ పట్టిస్తారు.

అప్పటి వరకు ఫ్యామిలీ తప్ప మరో ద్యాస లేని మధు, ఫ్రెండ్స్తో కలిసి చైన్ స్నాచర్గా మారతాడు. గుణ(బాబీ సింహా) అనే గ్యాంగ్ స్టర్ గ్యాంగ్లోతో కలిసి ప్లాన్డ్గా చైన్స్ స్నాచింగ్లు చేస్తుంటాడు. అయితే తాము కష్టపడి కొట్టుకొస్తే గుణ ఎక్కువ షేర్ తీసుకోవటం మధుకు నచ్చదు. అందుకే తనతో పాటు చైన్స్ స్నాచింగ్ పాల్పడే వారితో కలిసి సొంతంగా ప్లాన్ చేసుకొని దొంగతనాలు చేయటం ప్రారంభిస్తాడు. అలా తప్పుదారిలోకి అడుగుపెట్టిన మధు జీవితం చివరకు ఏమైంది. మధు కారణంగా ఆది జీవితం ఎలాంటి మలుపు తిరిగింది అన్నదే మిగతా కథ.


నటీనటులు :
ఆది పాత్రలో శిరీష్ మంచి నటన కనబరిచాడు. ఓ మిడిల్ క్లాస్ అబ్బాయిగా కనిపిస్తూనే తన తల్లి చావుకు పగ తీర్చుకునే హీరోయిజం చూపించాడు. ముఖ్యంగా తెలుగు వారికి దగ్గరయ్యే ఫీచర్స్ శిరీష్కు ప్లస్ పాయింట్. సినిమాకు కీలకమైన మధు పాత్రలో నటించిన సత్య నిరాశపరిచాడు. లుక్స్ పరంగా కూడా సత్య ఆ పాత్రకు సరిపోలేదు. హీరోయిన్గా నటించిన రమ్య పాత్ర కేవలం రెండు మూడు సీన్లకే పరిమితమయ్యింది. సినిమా మొత్తం మీద తెలుగు వారికి పరిచయం ఉన్న ఒకే ఒక్క నటి తులసి. ఆమె హీరో తల్లిగా తనకు అలవాటైన పాత్రలో ఆకట్టుకుంది. గ్యాంగ్ స్టర్ పాత్రలో బాబీ సింహా మరోసారి మెప్పించాడు.

సాంకేతిక నిపుణులు :
క్రైం థ్రిల్లర్ కథాంశాన్ని ఎంచుకున్న దర్శకుడు ఆనంద కృష్ణన్, అందుకు కావాల్సిన గ్రౌండ్ వర్క్ చాలా బాగా చేశాడు. ముఖ్యంగా చైన్స్ స్నాంచింగ్ చేసేవాళ్ల ఆలోచనలు.. వాళ్లు బంగారాన్ని ఎలా మారుస్తారు, అన్న అంశాలను చాలా డిటెయిల్డ్గా చూపించాడు. అదే సమయంలో నేటి యువతరం తప్పుడు మార్గాలకు ఎందుకు ఆకర్షింపబడుతుందో కూడా సింపుల్ సీన్స్తో వివరించాడు. దర్శకుడు రాసుకున్న కథను అంతే ఎఫెక్టివ్గా తెర మీద చూపించాడు సినిమాటోగ్రాఫర్ ఉదయ్ కుమార్. ముఖ్యంగా నైట్ ఎఫెక్ట్లో చేసిన సీన్స్ చాలా బాగా వచ్చాయి. జోహన్ తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్తో సినిమా స్థాయిని పెంచాడు. తెలుగు డబ్బింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.



ప్లస్ పాయింట్స్ :
కథా కథనం
బాబీ సింహా క్యారెక్టర్

మైనస్ పాయింట్స్ :
స్లో నారేషన్
మధు పాత్ర చేసిన సత్య

- సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement