మరో మైఖేల్ వస్తారా?
గొర్రెను పోలిన గొర్రెను కృత్రిమంగా సృష్టించిన ‘క్లోనింగ్’ విధానం గురించి తెలిసిందే. ప్రపంచ ప్రఖ్యాత పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్ అప్పట్లో ఈ క్లోనింగ్ విషయంలో ఆసక్తి కనబర్చారట. తనను పోలిన రూపం ఉండాలని ఆయన కోరుకున్నారట. ఈ సంగీత సంచలనం కనుమరుగై దాదాపు ఐదేళ్లవుతోంది. అయితే, తనలాంటి రూపాన్ని సృష్టించాలని మైఖేల్ అనుకున్న విషయం ఇప్పుడు బయటికొచ్చింది. 2009లో మైఖేల్ తుదిశ్వాస విడిచారు. అంతకుముందు తన వీర్యకణాలను ఆయన ఓ పరిశోధక కేంద్రంలో భద్రపరిచారని సమాచారం.
ఒక యూరోపియన్ శాస్త్రవేత్తను తన సమరూప జీవిని సృష్టించాల్సిందిగా ఆయన కోరారట. ఈ క్లోనింగ్ విధానం కోసం మైఖేల్ మిలియన్ డాలర్లు ఇచ్చారన్న వార్త ఇప్పుడు హాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. ఆయన తన వీర్యకణాలను మూడు పరిశోధక కేంద్రాల్లో భద్రపరిచారని, మూడు వేర్వేరు కారణాలకు వాటిని ఉపయోగించాల్సిందిగా కూడా కోరారని బోగట్టా. క్లోనింగ్ గొర్రె డాలీ గురించి తెలుసుకుని మైఖేల్ తనలాంటి రూపం ఉంటే బాగుంటుందని భావించారని న్యూయార్క్‌కు చెందిన ‘ఎక్స్‌ట్రాటెర్రెస్ట్రియల్ రిసెర్చ్’ డెరైక్టర్ మైఖేల్ సి. లక్‌మేన్ పేర్కొన్నారు.
మైఖేల్‌కూ, ఆయన సోదరి జానెట్ జాక్సన్‌కూ కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిన స్వర్గీయ ఆండ్రూ వాన్ పీర్ బతికున్న రోజుల్లో తనతో ఈ విషయం చెప్పారని లుక్‌మేన్ తెలిపారు. ఇదిలా ఉంటే మైఖేల్ జాక్సన్ క్లోనింగ్ విషయంలో ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యుల అభిప్రాయం ఏంటనేది ఇంకా బయటికి రాలేదు. మైఖేల్ సి. లుక్‌మేన్ మాత్రం కనుమరుగైన ఈ పాప్‌స్టార్ కోరిక నెరవేర్చాలనుకుంటున్నారట. అయితే త్వరలోనే మరో.. మైఖేల్ జాక్సన్ మన ముందుకొస్తారా? ఏమో! కాలమే సమాధానం చెప్పాలి
మరి.