
అహ్మదాబాద్ టు ముంబై: మిలింద్ సోమన్ పరుగు
భారత మాజీ సూపర్ మోడల్, బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్ మళ్లీ పరుగందుకున్నారు. గతేడాది జూరిచ్‌లో జరిగిన ‘ఐరన్‌మేన్ రేస్’లో ఏకబిగిన 3.8 కిలోమీటర్లు స్విమ్మింగ్ చేసి, రోడ్డులేని ప్రాంతంలో 180 కిలోమీటర్లు బైక్ నడిపి, 42.2 కిలోమీటర్లు పరుగెత్తి నిజమైన ఐరన్‌మేన్‌గా ప్రపంచ గుర్తింపు పొందారు. ఆ విజయం ద్వారా ఆయన భారత కీర్తి పతాకాన్ని విశ్వవీధుల్లో ఎగరేయడమే కాకుండా తన 50వ పుట్టినరోజును విజయంతో జరుపుకొన్నారు.
ఇప్పుడు ఆయన మరో రికార్డును నెలకొల్పేందుకు, తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకునేందుకు అహ్మదాబాద్ నుంచి ముంబైకి పరుగు ప్రారంభించారు. అది కూడా.. కాళ్లకు జాగింగ్ బూట్లు గానీ, పాదరక్షలు గానీ లేకుండా. అహ్మదాబాద్‌లో జూలై 26వ తేదీన ప్రారంభమైన ఆయన పరుగు సిల్వస్సా మీదుగా 570 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముంబైకి చేరనుంది. పరుగు ప్రారంభించిన ఆయన తొలిరోజున 67 కిలోమీటర్లు బేర్‌ఫుట్‌తో పరుగెత్తారు. రెండోరోజు 62 కిలోమీటర్లు పరుగెత్తారు. ఆగస్టు ఏడో తేదీలోగా ముంబైకి చేరుకోవాలన్నది ఆయన లక్ష్యం.
ఆయన తన రెండురోజుల పరుగును వీడియోలో రికార్డుచేసి ఫేస్‌బుక్‌లో పెట్టారు. మిలింద్ ఎండలో పరుగెడుతున్నా.. ఉదయం పూట జాగింగ్ చేస్తున్నంత సునాయాసంగా పరుగు తీయడం కనిపించింది. ఆయన పరుగు ఉల్లాసంగా కొనసాగాలని, లక్ష్యాన్ని సాధించాలని ఫేస్‌బుక్‌లో ఆయన ఫాలోవర్లు ఆకాంక్ష వ్యక్తం చేశారు. బెస్ట్ ఆఫ్ లక్ చెబుతున్నారు.