ఉద్యమ స్ఫూర్తి! | yoga special | Sakshi
Sakshi News home page

ఉద్యమ స్ఫూర్తి!

Published Wed, Oct 5 2016 11:09 PM | Last Updated on Mon, Sep 4 2017 4:17 PM

ఉద్యమ  స్ఫూర్తి!

ఉద్యమ స్ఫూర్తి!

గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ మీద అవగాహన కల్పించేందుకు ‘పింకథాన్’ పేరుతో  ప్రముఖ మోడల్, బాలివుడ్ నటుడు మిళింద్ సోమన్ దేశమంతా లాంగ్‌మార్చ్ చేశారు.. చేస్తున్నారు.  ఈ మధ్యే మిళింద్ సోమన్ వాళ్ల అమ్మ  ఉషా కూడా ఈ పింకథాన్‌లో పాల్గొన్నారు. 76 ఏళ్ల ఉషా.. తన కొడుకు మిళింద్ సోమన్‌తో కలిసి అహ్మదాబాద్ నుంచి ముంబై వరకు ఈ పింకథాన్‌లో పరిగెత్తారు.
 
తొట్టతొలి చైతన్యదీక్ష!  
రొమ్ము క్యాన్సర్ గురించి జనంలో చైతన్యం కలిగించడం కోసం ఇటీవల ప్రపంచవ్యాప్తంగా పెద్దయెత్తున క్యాంపెయిన్లు జరగడం చూస్తున్నాం. అయితే, అందరి కన్నా ముందు ఇలాంటి చైతన్య కార్యక్రమం జరిగింది. 1992లో. ఎవెలిన్ లాడర్ తొలిసారిగా బ్రెస్ట్ క్యాన్సర్ ఎవేర్‌నెస్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఆ తరువాత నుంచి ప్రపంచవ్యాప్తంగా పలువురు వ్యక్తులు, సంస్థలు ఇలాంటి చైతన్య కార్యక్రమాలు చేపడుతూ వచ్చారు.
 
రొమ్ము క్యాన్సర్‌పై పోరాటానికి నిధులు సేకరించడం కోసం రకరకాల కార్యక్రమాలు, పరుగులు జరుగుతున్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్ ఎవేర్‌నెస్ మన్త్ అయిన ప్రతి అక్టోబర్‌లో ఇవి మరింత ఎక్కువ. ఈ చైతన్యానికి ప్రతీకాత్మకంగా మద్దతు తెలపడం కోసం ‘పింక్ రిబ్బన్లు’ వాడుతున్నారు.
 
డిజిటల్ మీడియాలో... మన సందడి!
వివిధ రకాల భారతీయ బ్రాండ్లు సైతం సోషల్ మీడియా ద్వారా డిజిటల్ క్యాంపెయిన్లు, ఫేస్‌బుక్ - ట్వీటర్‌లలో హ్యాగ్ ట్యాగ్‌లు పెట్టడం, పోటీలు నిర్వహించడం లాంటి వాటి ద్వారా పదిమందికీ రొమ్ము క్యాన్సర్‌పై చైతన్యం కలిగిస్తున్నాయి. వాటి ద్వారా క్యాన్సర్ పరిశోధనకు నిధులు సేకరిస్తున్నాయి. అలా చేసిన క్యాంపెయిన్లలో కొన్నిటి గురించి...
 
‘ఫిలిప్స్ ఇండియా’ సంస్థ ‘హజ్‌బెండ్ ఇనీషియేటెడ్ మూవ్‌మెంట్’ (హిమ్) పేరిట డిజిటల్ క్యాంపెయిన్ చేసింది. పురుషులు ప్రతి నెలా కనీసం పది నిమిషాల పాటు రొమ్ముల స్వీయ పరీక్ష చేసుకొనేలా తమ భార్యలకు వీలు కల్పించాలి. భార్య పట్ల ప్రేమను వ్యక్తం చేస్తూ, ఆ కాసేపటిలో వంట చేయడం, పిల్లల ఆలనాపాలనా చూసుకోవడం లాంటి ఏదో ఒక పని చేసి పెట్టాలి. ఆ పనులు చేస్తూ, పురుషులు సెల్ఫీలు తీసుకొని, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్వీటర్‌లలో అప్‌లోడ్ చేయాలి.
 
‘ఎల్లే’ సంస్థ ఫేస్‌బుక్ పేజ్ ద్వారా ఆ మధ్య పింక్ రిబ్బన్ క్యాంపెయిన్ చేసింది. తద్వారా మహిళలకు మద్దతుగా నిలిచింది. పింక్ దుస్తులు వేసుకొని, సెల్ఫీలు తీసుకొని, ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయాలని ప్రోత్సహించింది. ఆ రకంగా జనంలో రొమ్ము క్యాన్సర్‌పై చైతన్యానికి కృషి చేసింది. హిందీ సినీ నటులు సోనమ్ కపూర్, నర్గీస్ ఫక్రీ తదితరులు తమ ‘పింక్ సెల్ఫీ’లను తీసి, నలుగురితో పంచుకోవడం ద్వారా ఈ క్యాంపెయిన్‌లో పాల్గొన్నారు.
 
‘ఎస్టీ లాడర్ ఇండియా’ సంస్థ తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో క్యాంపెయిన్ చేసింది. రొమ్ము క్యాన్సర్ బాధితులు ఇతరులకు స్ఫూర్తి నిచ్చేలా తమ ఫొటో, లేదంటే సందేశాన్ని షేర్ చేసుకోవాలి. షేర్ చేసిన ప్రతి మెసేజ్‌కీ వంద రూపాయల చొప్పున పది లక్షల దాకా మొత్తాన్ని రొమ్ము క్యాన్సర్ గురించి అవగాహన, వైద్య చికిత్సల నిమిత్తం ఇచ్చేందుకు సిద్ధమైంది. జనంలో ఉత్సాహం కోసం ముంబయ్‌లోని ప్రసిద్ధ బాంద్రా - వర్లీ సముద్రపు లింక్‌ను వారం రోజుల పాటు పింక్ లైట్లతో అలంకరించారు.
 
వినోదం పంచే వీడియోలు పోస్ట్ చేసే ‘ప్రాన్క్ బాజ్’ తన యూ ట్యూబ్ చానల్‌లో, ఫేస్‌బుక్‌లో రొమ్ము క్యాన్సర్ గురించి షాకింగ్‌కి గురి చేసే వీడియో ఒకటి పోస్ట్ చేసింది. ఒక అమ్మాయి తాను వేసుకొన్న పై దుస్తుల్ని తీసి, లోపలి టీ షర్ట్‌ని చటుక్కున చూపించే ఈ వీడియో ఒక్కసారిగా వైరల్ అయింది. కొన్ని లక్షల మంది చూశారు. జనం ఈ వీడియో చూసి, దాని గురించి మాట్లాడుకోవడం ద్వారా రొమ్ము క్యాన్సర్‌పై జనంలో చైతన్యం తీసుకురావాలన్నది ప్రయత్నం.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement