
సల్మాన్ కు తక్కువ శిక్ష పడితే బాగుండు..
ముంబై: హిట్ రన్ అండ్ కేసులో దోషిగా తేలిన బాలీవుడ్ హీరో సల్మాన్ఖాన్ ఉదంతంపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన లభిస్తోంది. సెలబ్రిటీల దగ్గరనుంచి, అభిమానులు, సామాన్యులు తమ కమెంట్స్ పోస్ట్ చేశారు.
ఇప్పటికే చాలా ఆలస్యమైందని.. సల్మాన్ నిర్లక్ష్యానికి బలైన కార్మికుల ఆత్మకు శాంతి కలుగుతుందని కొంతమంది వ్యాఖ్యానిస్తే... సల్మాన్ లాంటి దయార్ద్ర హృదయుడికి శిక్ష పడటం అన్యాయమని, తన ఛారిటీ కార్యక్రమాల ద్వారా చాలామంది పేదవిద్యార్థులకు సహాయం చేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు.
సల్మాన్ కు తక్కువ శిక్ష పడాలని ప్రార్థిస్తున్నానంటూ ప్రముఖ బాలీవుడ్ నటి హేమమాలిని తన సానుభూతిని ప్రకటించారు. మరో బాలీవుడ్ నటి బిపాసా బసు తీర్పుపై విచారం వ్యక్తం చేశారు. సల్మాన్ చాలా మంచి మనిషి. ఈ కష్ట సమయంలో అతనికి అందరం తోడుగా ఉండాలన్నారు.
ఇది ఇలా ఉంటే యువ క్రికెటర్ రవీంద్ర జడేజా భారత న్యాయ వ్యవస్థను పొగుడుతూ ట్వీట్ చేశారు. కాగా 13 సంవత్సరాలుగా నడుస్తున్న హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ను దోషిగా నిర్ధారిస్తూ ముంబై సెషన్స్ కోర్టు బుధవారం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.