
సాక్షి, హైదరాబాద్: అనారోగ్యంతో మరణించిన హాస్యనటుడు గుండు హనుమంతరావుకు పలువురు తెలుగు సినిమా ప్రముఖులు నివాళి అర్పించారు. ఆయన మరణం తెలుగు చిత్రసీమకు తీరని లోటని పేర్కొన్నారు. రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, మురళీమోహన్, శిరాజీరాజా, కాదంబరి కిరణ్ తదితరులు గుండు హనుమంతరావు భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ శివాజీరాజా కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు సన్నిహితుడైన గుండు హనుమంతరావు మరణం కలిచివేసిందన్నారు. ‘అమృతం ధారావాహిక మా ఇద్దరికి చాలా ప్రత్యేకం. చెన్నై నుంచి మా ఇద్దరి ప్రయాణం మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో హనుమంతరావు ఇవ్వని ప్రదర్శన లేదు. మూవీ ఆర్ట్ అసోసియేషన్ ఆయన కుటుంబానికి ఎల్లప్పుడు అండగా ఉంటుంద’ని శివాజీరాజా అన్నారు.
మంచి వ్యక్తి: మోహన్‌బాబు
గుండు హనుమంతరావు మంచి నటుడు మాత్రమే కాదు మంచి వ్యక్తి అని సీనియర్ నటుడు మోహన్‌బాబు పేర్కొన్నారు.. ‘గుండు హనుమంతరావు ఆత్మకి శాంతి కలగాలి. మా నిర్మాణ సంస్థ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ నిర్మించిన చాలా సినిమాల్లో నటించాడు. ఏ పాత్రనైనా అవలీలగా పోషించగల సమర్ధుడు. అలాంటి వ్యక్తి నేడు మనల్ని భౌతికంగా విడిచి వెళ్లడం బాధాకరం. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు మనోనిబ్బరం ప్రసాదించాలని ఆ షిరిడి సాయినాథుడిని వేడుకొంటున్నాన’ని మోహన్‌బాబు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment