‘జయలలితకే అది సాధ్యమైంది’
హైదరాబాద్: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం యావత్ దేశానికి తీరని లోటని రాజ్యసభ సభ్యుడు, హీరో చిరంజీవి అన్నారు. ఒక సినిమా హీరోయిన్ ‘అమ్మ’గా అందరి అభిమానం పొందడం ఆమెకే సాధ్యమైందని పేర్కొన్నారు. ఎన్నో అటుపోట్లను ఎదుర్కొని ధీరవనితగా మహిళలకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. రిజర్వేషన్ల కోటాను 69శాతానికి పెంచడానికి జయలలిత ఎంతో కృషి చేశారని చెప్పారు.
జయలలిత మరణం పేద, మధ్య తరగతి ప్రజలకు తీరని లోటని సీనియర్ నటుడు, మూవీ ఆర్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. సినీ కథానాయికగా ఎన్నో మైలురాళ్లు అందుకున్నారని తెలిపారు. ఎంజీఆర్, ఏఎన్నార్, ఎన్టీఆర్ వంటి దిగ్గజ నటులతో ఆమె నటించారని గుర్తు చేశారు. ఆరుసార్లు ఓ మహిళ సీఎం కావడం జయలలితకే సాధ్యమైందని అన్నారు.
జయలలిత జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని విలక్షణ నటుడు మోహన్ బాబు అన్నారు. మహిళా శక్తిని జయలలిత జీవితమే నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజల గుండెల్లో జయలలిత సుస్థిర స్థానం ఏర్పచుకున్నారని సూపర్ స్టార్ కృష్ణ అన్నారు.