'మరాఠీ సినిమాకూ ప్రాధాన్యత ఇవ్వండి'
ముంబై: మరాఠీ సినిమాకు అధిక ప్రాధాన్యత కల్పించాలని బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఒకవేళ మరాఠీ చిత్ర సీమకు ఎక్కువ అధికారాలు వస్తే.. అక్కడ్నుంచి మంచి చిత్రాలు రావడానికి ఆస్కారం ఉంటుందని ఆమె అభిప్రాయపడింది.'మరాఠీ సినీ పరిశ్రమకు అధిక ప్రాధాన్యత ఇవ్వండి. ఆ రకంగా చేస్తే మరిన్ని మంచి చిత్రాలను ఆశించవచ్చు. ఈ మధ్య మరాఠీలో వచ్చిన లాయ్ భారీ చిత్రమే ఇందుకు ఉదాహరణ. నేను ఇప్పటి వరకూ మరాఠీ చిత్రాల్లో అవకాశాలు మాత్రం పొందలేదు' అని శ్రద్ధా కపూర్ తెలిపింది. అయితే మరాఠీ చిత్రాల్లో నటించడానికి ఆత్రుతగా ఉన్నట్లు పేర్కొంది. త్వరలోనే రితీష్ దేశ్ ముఖ్ తీసిన 'లాయ్ భారీ' చిత్రాన్ని వీక్షిస్తానని స్పష్టం చేసింది.
సగం పంజాబీ, సగం మరాఠీ అయిన శ్రద్ధా.. మరాఠీ భాషను బాగా మాట్లాడినా.. పంజాబీ భాష మాత్రం ఒంట బట్టించుకోలేదు.. ఆమె తండ్రి శక్తి కపూర్ పంజాబ్ రాష్ట్రానికి చెందిన వాడైతే.. తల్లి శివంగీ కొల్హాపూరీ మహారాష్ట్రా వాసి.