అమ్మ వెంటపడింది : సోహా అలీఖాన్
అమ్మ వెంటపడింది : సోహా అలీఖాన్
Published Wed, Sep 25 2013 2:22 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
ముంబై: పెళ్లి చేసుకుని స్థిరపడాలంటూ తన తల్లి కొంతకాలంగా చెబుతోందని సహనటుడు కునాల్ ఖేముతో కొన్నాళ్లు ఆటాపాటా సాగించిన నటి సోహా అలీఖాన్ అంటోంది. అయితే సోదరుడు సైఫ్ మాత్రం 40 ఏళ్లు వచ్చాకే వివాహం చేసుకోవాలంటూ సలహా ఇస్తున్నాడంది. సోహా, కునాల్‌లు ఓ కొత్త ఇంట్లో కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. అయితే పెళ్లెప్పుడనేది మాత్రం ఇంకా తేలలేదు. ‘కచ్చితంగా పెళ్లి చేసుకోవాలంటూ ప్రతి రోజూ మా అమ్మ వెంటపడింది.
ఆమె మాట వినిఉంటే కనుక ఇప్పటికి నాకు 20 మంది పిల్లలు పుట్టేవాళ్లు. అయితే చెప్పి చెప్పి విసిగిపోయిందేమో. ఇప్పుడు ఆ మాట అనడం లేదు. నీకు తోచినప్పుడు చేసుకో అంటోంది’ అని సోహా చెప్పింది. సోదరుడు సైఫ్ ఎవరైనా సరే 40 ఏళ్ల వయసులోనే చేసుకోవాలని చెబుతున్నాడంది. ‘పెళ్లి అనేది ఓ గట్టి కట్టుబాటు వంటిదని సైఫ్ అంటున్నాడు. అందుకే 40 ఏళ్లు వచ్చేదాకా నువ్వు మనస్ఫూర్తిగా సన్నద్ధం కాలేవు అని సలహా ఇచ్చాడు’ అని తెలిపింది. కునాల్ తనకు అన్నివిధాలుగా సహకరిస్తున్నాడంది. ఎంతో ఆనందంగా కాలం గడుపుతాడంది.
ఎప్పుడైనా తాను నిరాశానిస్పృహకు లోనైతే దాని నుంచి బయటపడేవిధంగా చేస్తాడంది. అటువంటి ధోరణి ఎంతో అవసరమని తెలిపింది. వృత్తిపరంగా చక్కని సలహాలు ఇస్తాడంది. ఎంతో ప్రేమపూర్వకంగా, ఆప్యాయంగా ఉంటాడంది. అటువంటి ప్రేమనందించే వ్యక్తిని కలిగి ఉండడం ఆనందం కలిగిస్తోందంది. భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మన్సూర్ అలీఖాన్ కుమారుడైన సైఫ్ అలీఖాన్ ఐదేళ్లపాటు ప్రేమాయణం సాగించి 42 ఏళ్ల వయసులో నటి కరీనాకపూర్‌ను గత ఏడాది వివాహమాడిన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement