
'ఎటువంటి సంకోచం లేకుండా నటించా'
తాను ఇండియాకు రావడం సాహసంతో కూడుకున్న నిర్ణయమని శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలెస్ ఫెర్నాండెజ్ పేర్కొంది.
ముంబై: తాను ఇండియాకు రావడం సాహసంతో కూడుకున్న నిర్ణయమని శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలెస్ ఫెర్నాండెజ్ పేర్కొంది. తనకు బాలీవుడ్ బాసటగా నిలిచిందని చెప్పింది. 30 ఏళ్ల జాక్వెలెస్ 'అల్లావుద్దీన్' సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది.
' విదేశీ వనితనైన నేను ఇండియాకు రావడంతో సాహసోపేత నిర్ణయం. నాకు ఇక్కడ ఫ్యామిలీ లేదు. నన్ను గైడ్ చేసేందుకు ఎవరూ లేరు. హిందీ చిత్రపరిశ్రమ నన్ను ఎంతగానో ఆదరించింది. నేనిక్కడకు రావడం విధి నిర్ణయంగా భావిస్తా' అని జాక్వెలెస్ పేర్కొంది.
మోడలింగ్ కోసం ఇండియాకు వచ్చిన ఆమెను 2009లో సుజయ్ ఘోష్ 'అల్లావుద్దీన్'తో బాలీవుడ్ కు పరిచయం చేశాడు. మర్డర్ 2, హౌస్ ఫుల్ 2, రేస్ 2, కిక్, బంగిస్థాన్ తదితర సినిమాల్లో ఆమె నటించింది.
బాలీవుడ్ అర్థం చేసుకోవడానికి మోడలింగ్ బాగా ఉపయోగపడిందని జాక్వెలెస్ వెల్లడించింది. త్వరలో విడుదలకానున్న 'బ్రదర్స్' సినిమాలో డిఫెరెంట్ రోల్ చేసినట్టు చెప్పింది. ఈ చిత్రంలో తల్లిగా నటించానని వెల్లడించింది. ఎటువంటి సంకోచం లేకుండా ఈ పాత్ర చేశానని తెలిపింది.