మాస్ సాంగ్స్‌కే ప్రాధాన్యం ఇస్తా..
సినిమాకు సంగీతం ప్రాణం. సంగీత బాణీలతో కూడిన పాటలు ఆహ్లాదకరం. వీటికి సృష్టికర్త సంగీత దర్శకుడు. మనకు ఇళయరాజా వంటి ఎందరో ప్రముఖ సంగీత దర్శకులు ఉన్నారు. వారి స్ఫూర్తితో మరెందరో సంగీతదర్శకులుగా ఎదుగుతున్నారు. అలాంటి వారి లో సి.సత్య ఒకరు. తక్కువ కాలంలోనే ఎక్కువ గుర్తింపు పొందిన సంగీత దర్శకుల్లో ఈయన ఒకరు. కర్ణాటక సంగీత కుటుంబం నుంచి వచ్చిన సత్య సంగీత దర్శకుడు మాత్రమే కా దు, హార్మోనిస్ట్, కీ బోర్డు ప్లేయర్, మంచి గాయకుడు కూడా.
భరద్వాజా లాంటి పలువురు సంగీత దర్శకుల వద్ద శిష్యరికం చేసిన అనుభవంతో ఎంగేయుం ఎప్పోదుం చిత్రంతో సం గీత దర్శకుడిగా పరిచయమయ్యారు. తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకుని తన సంగీత ప్రస్థానానికి శ్రీకారం చుట్టిన సత్య తీయవేలై సేయనుమ్ కుమారు, నెడుంశాలై,ఇవన్ వేరమాదిరి, కథై తిరైకథై వచనం ఇయక్కయ్ తదితర చిత్రాలతో తనదైన ముద్ర వేసుకున్నారు.
అంతే కాదు సంథింగ్ సంథింగ్ అనే చిత్రంతో తెలుగులోనూ పరిచయం అయ్యారు. తాజాగా ఈయన సంగీతాన్ని అందించిన వేలైన్ను వందుట్టా వెళ్లైక్కారన్ చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. చిత్రంలోని పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లంభించడంతో ఆనందంలో మునిగి తేలుతున్న సత్యతో చిన్న భేటీ..
ప్ర: వేలైన్ను వందుట్టా వెళ్లైక్కారన్ చిత్ర విజయానికి సంగీతం పక్కా బలంగా నిలిచిందని భావిస్తున్నారా?
జ: కచ్చితంగా. చిత్రం కంటే ముందే ఇందులోని పాటలు ప్రేక్షకాదరణ పొందాలి. అంటే చిత్ర విజయంలో ఆడియో భాగం అయినట్లేగా.
ప్ర: చిత్ర దర్శకుడు ఎళిల్‌తో తొలిసారిగా కలిసి పనిచేసిన అనుభవం?
జ: చాలా మంచి అనుభవం. అయితే ఆయన కంపోజింగ్ సమయంలో ఒకటి రెండు సార్లు మాత్రమే పాల్గొన్నారు. నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. అందుకే మరింత బాధ్యతగా పని చేశాను. రిజల్ట్ కూడా అలాగే వచ్చింది. చిత్ర కథానాయకుడు, నిర్మాత విష్టువిశాల్ కూడా పాటలు బాగా వచ్చాయని ఆనందంగా ఫీల్ అయ్యారు. చాలా సంతోషంగా ఉంది.
ప్ర: వేలైన్ను వందుట్టా వెళ్లైక్కారన్ చిత్రంలో ఎక్కువగా ఫాస్ట్ బీట్‌తో కూడిన మాస్ పాటలకే ప్రాముఖ్యత నిచ్చినట్లున్నారు?
జ: నిజం చెప్పాలంటే నాకు మెలోడీ అంటే చాలా ఇష్టం. అయితే ఈ చిత్ర కథకు మాస్ పాటలు అవసరం అయ్యాయి. అవి విశేష ఆదరణను పొందడంతో ఇకపై కూడా మాస్ సాంగ్స్‌కే ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నాను.
ప్ర: ఏ ప్రముఖ సంగీతదర్శకుడి ప్రభావం అయినా మీపై ఉంటుందా?
జ: ప్రభావం అంటూ ఏమీ ఉండదుగానీ ఇసైజ్ఞాని ఇళయరాజా స్ఫూర్తి మాత్రం ఉంటుంది. ఆయన సంగీతం వింటూ ఎదిగిన వాడిని ఆయనలా కొత్తగా బాణీలు కట్టాలని ప్రయత్నిస్తుంటాను.
ప్ర: ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు?
జ: రెండు చిత్రాలు చేస్తున్నాను. త్వరలో పార్తీబన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి సంగీతాన్ని అందించనున్నాను.