టాలీవుడ్‌లో యువ సంగీత దర్శకుల హవా | Music Directors Special Story | Sakshi
Sakshi News home page

టాలీవుడ్‌లో యువ సంగీత దర్శకుల హవా

Published Tue, Jul 31 2018 11:34 AM | Last Updated on Tue, Sep 4 2018 5:53 PM

Music Directors Special Story - Sakshi

శ్రీనగర్‌కాలనీ: ‘పిల్లా.. రా.. అందాల రాక్షసివే’ పాటతో ఇప్పుడు కుర్రకారు ఊగిపోతున్నారు. ఎవరిమొబైల్‌లో చూసినా ఇదే హోరెత్తుతోంది. ‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రంలోని ఈ పాటకు యువత ఫిదాఅయిపోయింది. మొబైల్స్‌ నుంచి సోషల్‌ మీడియాలోనూ వైరల్‌గా మారింది. అంతేకాకుండా‘మళ్ళీరావా’ చిత్రంలోని పాటలు, ఇటీవలే విడుదలైన ‘సమ్మోహనం’.. ‘చి..ల..సౌ’.. ‘సాక్ష్యం’..  చిత్రాల్లోని గీతాలు సంగీత ప్రియుల మనసును దోచుకున్నాయి. కానీ ఈ పాటల వెనుక ఉన్న తెలుగు యువ సంగీత దర్శకుల గురించి చాలా మందికి తెలిసుండదు. ఓ సినిమాలోని పాటలు బాగున్నాంటే ఆ చిత్రం హిట్టే. అలాంటి సంగీతం అందించాలంటే ఆ మ్యూజిక్‌ దర్శకుడికి ప్రేక్షకుల హృదయాలను రంజినచేసే సృజనాత్మకతతో పాటు వారి నాడి తెలుసుండాలి. కానీ అదంత సులువు కాదు. ప్రస్తుతంమన యువ తెలుగు సంగీత దర్శకులు ఉన్నత చదువులు చదివి సంగీతం మీద ప్రేమతో ఇటు వచ్చారు.తమ విశేష ప్రతిభతో ప్రేక్షకుల నాడి పట్టుకున్నారు. అవకాశాలను అందిపుచ్చుకొని కుర్రకారు హృదయాలను కొల్లగొడుతున్నారు. ఇటీవలి కాలంలో మధురమైన పాటలతో యువతకు చేరువైన యువ సంగీత దర్శకులుతమ సినీ ప్రయాణ విశేషాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు వారి మాటల్లోనే..

యడవల్లి ప్రభాకర్‌ చైతన్య   

‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రంలోని పాటలు ఇంతగా యువతను ఆకట్టుకుంటాయని అనుకోలేదు. చాలా మంది నుంచి ప్రశంసలు వస్తున్నాయి. మాది వైజాగ్‌. చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఇష్టం. నాకు కీబోర్డ్‌పై పట్టుంది. కానీ చదువుల వల్ల పూర్తి సమయం కేటాయించలేదు. గీతం యూనివర్సిటీలో బీటెక్‌ సీఎస్‌ఈ చేసి అనంతరం ఐఆర్‌డీఏలో ఉద్యోగంలో చేరాను. అక్కడి నుంచి ‘జావా డెవలపర్‌’గా జాబ్‌ చేశాను. మనసంతా సంగీతం వైపు లాగుతుంటే ఉద్యోగం మానేసి మ్యూజిక్‌పై దృష్టి పెట్టాను. మొదట షార్ట్‌ఫిల్మŠస్‌కు సంగీతం అందించాను. దర్శకుడు రమేష్‌వర్మ ‘7’ అనే చిత్రానికి సంగీతం చేయడానికి అవకాశం ఇచ్చారు. అక్కడే ‘ఆర్‌ఎక్స్‌ 100’ దర్శకుడు అజయ్‌ భూపతి పరిచయమయ్యారు. నా మీద నమ్మకంతో చిత్రానికి సంగీతం చేసే అవకాశం ఇచ్చారు. ‘పిల్లా రా’.. పాటకు ఇంత రెస్పాన్స్‌ వస్తుందని ఊహిచలేదు. ‘కొడవలి నిండా’ పాట కూడా యువతకు బాగా కనెక్ట్‌ అయింది. ఇండస్ట్రీలోని అందరితో పనిచేయాలని ఉంది. హైదరాబాద్‌లో చాలా ప్రీడం ఉంటుంది. బిర్యానీ, ట్యాంక్‌బండ్‌ ఇష్టం. మాల్స్‌కు ఎక్కువగా వెళుతుంటా.  మంచి సంగీత దర్శకుడిగా ప్రేక్షకులకు చేరువకావాలన్నది నా ఆకాంక్ష.

వివేక్‌ సాగర్‌..  
నా పూర్తి పేరు వివేక్‌సాగర్‌ ముడుంబా.. పక్కా హైదరాబాదీని. సెయింట్‌ మేరిస్‌ కాలేజీలో బీటెక్‌ చేశాను. అమ్మకు సంగీతంపై పట్టుంది. ఆమే నా తొలి గురువు. స్కూల్‌లో రామాచారి మాస్టర్‌ దగ్గర మెళకువలు నేర్చుకున్నాను. కాలేజ్‌ డేస్‌లో ఓ మ్యూజిక్‌ బ్యాండ్‌ను స్టార్‌ చేశాం. గిటార్‌తో పాటు పలు వాయిద్యాలు వాయించడం నేర్చుకున్నాను. షార్ట్‌ఫిలింస్, టీవీ యాడ్స్‌కు సంగీతం అందించాను. అనంతరం ‘అర్జున్‌రెడ్డి’ ఫేం రాహుల్‌ ద్వారా దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ పరిచయమయ్యారు. అతని ‘సైన్మా’ ఫార్ట్‌ఫిలింకు మంచి ఆదరణ లభించింది. తరుణ్‌ భాస్కర్‌ ‘పెళ్ళిచూపులు’ సినిమా నా కెరీర్‌ని మలుపు తిప్పింది. చిత్రంలోని పాటలు ప్రతి ఒక్కరికీ నచ్చాయి. ఆ హిట్‌తో మంచి అవకాశాలు వచ్చాయి. ‘యుద్ధం శరణం’, ‘షీష్‌మహల్‌’ చిత్రాలకు కూడా సంగీతం అందించాను. ‘సమ్మోహనం, ఈ నగరానికి ఏమైంది’ చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి. వాటిలోని పాటలు కూడా శ్రోతల మనసు దోచుకున్నాయి. ఇప్పడు విశ్వక్‌సేన్‌ దర్శకత్వంలో ‘ఫలక్‌నామా దాస్‌’ చిత్రంతో పాటు మరో రెండు తెలుగు చిత్రాలకు పనిచేస్తున్నాను. ప్రేక్షకులకు గుర్తుండిపోయే మధురమైన పాటలను అందించాలన్నదే నా ఆకాంక్ష.

శ్రావణ్‌ భరద్వాజ  
మాది గుంటూరు. హైదరాబాద్‌లో డిగ్రీ చేశాను. ఓల్డ్‌ సిటీలో ఉండేవాళ్లం. సంగీతం వినడం, పాడడం ఇష్టం. మా బావ విజ్ఞాన్‌ నాకు సహకారం అందించారు. సన్నిహితులు కృష్ణకాంత్, క్రిష్‌తో కలిసి 2013లో ‘కలయో నిజయో’ అనే వీడియో ఆల్బమ్‌ చేశాం. మధుర శ్రీధర్‌ ఆల్బమ్‌ను విడుదల చేశారు. మంచి రెస్పాన్స్‌ వచ్చింది. హైదరాబాద్‌లోని టాప్‌ కాలేజీల్లో మ్యూజిక్‌ షోలు సైతం ఇచ్చాం. మా అల్బమ్‌లోని పాటను  తరుణ్‌ భాస్కర్‌ తీసిన ‘అనుకోకుండా’ షార్ట్‌ఫిలింలో వాడారు. ఆ షార్ట్‌ఫిలిం హిట్టై పాటకు మంచి ఆదరణ లభించింది. తర్వాత ‘పంజా’ చిత్రం నిర్మాత నీలిమ తిరుమలశెట్టి నిర్మించిన ‘అలియాస్‌ జానకి’ చిత్రంలో అవకాశం వచ్చింది. ఆ సినిమా పాటలు కూడా అందరికీ నచ్చాయి. అనంతరం ‘ప్రేమ ఇష్క్‌ కాదల్‌’.. ‘మీకుమీరే మాకు మేమే’.. నారా రోహిత్‌ ‘సావిత్రి’ సినిమాలకు పనిచేశాను. సుమంత్‌ హీరోగా నటించిన ‘మళ్ళీరావా’ చిత్రం నన్ను మరో మెట్టు ఎక్కించింది. మెలోడీస్‌ అంటే ఇష్టం. అన్ని రకాల సంగీతాలను అందించి సంగీతప్రియుల మనుసు గెలవాలన్న తపనతో పనిచేస్తున్నాను.

ప్రశాంత్‌ ఆర్‌ విహారి

మాది కోదాడ. వరంగల్‌ కిట్స్‌లో ఇంజినీరింగ్‌ చేశాను. సంగీతం మీద అమితాశక్తితో చెన్నైలో ఏఆర్‌ రెహమాన్‌ కేఎం మ్యూజిక్‌ కన్సర్వేటరీలో పియానో నేర్చుకున్నాను. పలు తెలుగు, తమిళ షార్ట్‌ ఫిలింస్‌కి పనిచేశాను. నా మొదటి చిత్రం ‘వెళ్ళిపోమాకే’. ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రంలో లీడ్‌రోల్‌ చేసిన విశ్వక్‌సేన్‌ ఆ చిత్రంలో హీరో. ఈ మూవీని దిల్‌రాజు రిలీజ్‌ చేశారు. పాటలకు మంచి ఆదరణ వచ్చింది. అ తర్వాత రాజ్‌ కుందుకూరి నిర్మించిన ‘మెంటల్‌ మదిలో’ అవకాశం వచ్చింది. పాటలకు శ్రోతల నుంచి పేరొచ్చింది. సుశాంత్‌ నటించిన ‘చి..ల..సౌ’ చిత్రానికి సంగీతం అందించాను. పాత చిత్రాల్లోని మెలోడీస్‌ చాలా ఇష్టం. అన్ని విభిన్నమైన సంగీతాలను ప్రేక్షకులకు అందించాలన్నదే నా లక్ష్యం. ప్రస్తుతం వరుణ్‌తేజ్‌ హీరోగా సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో వస్తున్న చిత్రానికి, మరో తమిళ, తెలుగు చిత్రాన్ని సంగీతాన్ని అందిస్తున్నాను. 

హర్షవర్ధన్‌ రామేశ్వర్‌  

మా సొంతూరు రాజమండ్రి. కానీ పెరిగిందంతా చెన్నైలోనే. బీకాం చేశాను. మా నాన్న లక్ష్మీనారాయణ దక్షిణాది టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్స్‌తో కలిసి పనిచేశారు. ఆయన మార్గదర్శకంతో సంగీతం నేర్చుకున్నాను. రిథమ్, కీబోర్ట్, గిటార్‌ నేర్చుకున్నాను. సంగీత దర్శకుల వద్ద చాలా సినిమాలకు పనిచేశాను. అనంతరం ‘అర్జున్‌రెడ్డి’ దర్శకుడు సందీప్‌రెడ్డి పరిచయంతో ఆ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ అందించాను. ఈ చిత్రంలోని పాటలతో పాటు బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌కు మంచి పేరొచ్చింది. తర్వాత ‘సాక్ష్యం’, ‘విజేత’ చిత్రాలకు సంగీతాన్ని అందించే అవకాశం వచ్చింది. ఇండిపెండెంట్‌గా ఆల్బమ్‌ మ్యూజిక్స్‌ చేయాలన్నది నా తపన. అర్జున్‌రెడ్డి హిందీ చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో పాటు పలు చిత్రాలను సంగీత దర్శకుడిగా అవకాశాలు వచ్చాయి. ఇండస్ట్రీలో విభిన్న సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలి.


కబీర్‌ రఫీ ‘సిమా’ బెస్ట్‌మ్యూజిక్‌ డైరెక్టర్‌
ఒక ముస్లిం యువకుడిగా సంగీత దర్శకుడిగా రాణించడం కష్టమని చాలా మంది అంటుంటారు. కానీ అది నిజం కాదు. ఇండస్ట్రీలో ప్రతిభ ఉంటే తప్పక అవకాశాలు వస్తాయి. నేను పుట్టింది గుంటూరు. కానీ పెరిగిందంతా ముంబై,హైదరాబాద్‌లోనే. సంగీతం మీద ఆసక్తితో ఇటువైపు వచ్చాను. హైదరాబాద్‌లోనే ఎంబీఏ చేశాను. ఆర్థిక ఇబ్బందుల వల్ల ‘జస్ట్‌ డయిల్‌’లో ఉద్యోగం కూడా చేశాను. కానీ సంగీతమే ప్రాణం అవడం వల్ల ఈ రంగంలోనే ఉండాలని నిశ్చయించుకున్నాను. అప్పుడప్పుడే షార్ట్‌ఫిలింకు, ఇండిపెండెంట్‌ సినిమాలకు ఆదరణ లభిస్తుండడం చూసి షార్ట్‌ఫిలింస్‌కు సంగీతం అందించాను. ‘కిక్‌’ (కొంచెం ఇష్టం చాలా కష్టం) షార్ట్‌ఫిలింకు గతేడాది ప్రకటించిన ‘సిమా’ షార్ట్‌ఫిలిం అవార్ట్స్‌లో నాకు ‘బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌’ అవార్డు వచ్చింది. ఇది నాకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. దీంతో పాటు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. ఇప్పటి వరకూ 120కి పైగా ష్టార్ట్‌ఫిలింస్‌కు సంగీతం అందించాను. టాప్‌ వెబ్‌సీరిస్‌లకు సంగీతం అందించాను. పలు చిత్రాలకు సైతం సంగీతం చేసే అవకాశం వచ్చింది. ‘బాబు సాఫ్ట్‌వేర్‌’ సినిమాతో పాటు మరికొన్ని కన్నడ సినిమాలకు సంగీతం అందిస్తున్నాను. తెలుగు చిత్ర పరిశ్రమలో గుర్తుండిపోయే పాటలను అందించి ప్రేక్షకుల మన్నన పొందాలన్నదే నా లక్ష్యం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement