ఆయనతో సినిమా నా లక్ష్యం
‘కృష్ణాష్టమి’ చిత్రం వినోద ప్రధానంగా, హృదయానికి హత్తుకునే విధంగా ఉంటుంది’’ అని ‘దిల్’ రాజు అన్నారు. సునీల్ హీరోగా వాసూ వర్మ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు చెప్పిన విశేషాలు...
‘కృష్ణాష్టమి’ సినిమా షూటింగ్ ఆగస్టులోనే పూర్తయింది. సెప్టెంబరులో ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ రిలీజ్ ఉండటంతో అక్టోబరులో రిలీజ్ చేద్దామనుకున్నా. కానీ, ‘రుద్రమదేవి, అఖిల్, బ్రూస్‌లీ’ లాంటి పెద్ద సినిమాల రిలీజ్‌లను ప్రకటించడంతో డిసెంబరులోనో, సంక్రాంతి టైమ్‌లోనో రిలీజ్ ప్లాన్ చేశాం. అప్పుడు కూడా చాలా సినిమాలు ఉండటంతో అనువైన తేదీ కోసం చూశాను. ఫిబ్రవరి 19 సరైన డేట్ అనిపించింది..
ముందు బన్నీతో ఈ సినిమా తీద్దామనుకున్నాం. దర్శకుడు గోపీచంద్ మలినేని ‘పండగ చేస్కో’ కన్నా ముందే నాకీ కథ చెప్పాడు. ఈ కథ విన్న బన్నీ, ‘‘ ‘ఆర్య, ‘పరుగు’ తర్వాత మనం చేసే సినిమా సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉండాలి. మామూలు కమర్షియల్ ఎంటర్‌టైనర్స్ చేయకూడదు’’ అని సలహా ఇచ్చాడు. అందుకే ఆపేశాం. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ని కూడా బన్నీతోనే తీయాలనుకున్నాం. అప్పటికే త్రివిక్రమ్‌తో ‘సన్నాఫ్ సత్యమూర్తి’కి బన్నీ కమిట్ కావడంతో, తనకు చెప్పి సాయిధరమ్‌తో ఈ సినిమా తీశాం.
గోపీచంద్ మలినేని నాకు చెప్పిన ‘కృష్ణాష్టమి’ కథను వాసూవర్మకు చెప్పాను. ఆ తర్వాత తను కథ మీద వర్కవుట్ చేశాడు. సునీల్ ఈ కథ విని, ‘అన్నా... ఇంత పెద్ద బడ్జెట్ సినిమానా?’ అని ఆశ్చర్యపోయాడు. సునీల్‌కి ఈ సినిమా ఎంతగా నచ్చిందంటే ఈ సినిమా 80 శాతం పూర్తయ్యేవరకూ వేరే చిత్రాలను సునీల్ అంగీకరించలేదు. ‘జోష్’ సినిమా ఫ్లాప్ అయినా వాసుతో సినిమా చేయడానికి అతనికీ, మా బ్యానర్‌కీ ఉన్న అనుబంధమే. అయినా ‘జోష్’ కథను ఎంపిక చేసుకోవడంలో నిర్మాతగా నేను ఫెయిల్ అయ్యాను. దానికి నాదే బాధ్యత.
అనిల్ రావిపూడి-సాయిధరమ్‌తేజ్ కాంబినేషన్‌లో ‘సుప్రీమ్’ రెడీ అవుతోంది. కృష్ణవంశీతో ఓ సినిమా ఉంటుంది. దాని పేరు ‘రుద్రాక్ష’ అని వార్త ప్రచారంలో ఉంది. ఆ టైటిల్ ఉండచ్చు... ఉండకపోవచ్చు. వరుణ్‌తేజ్ హీరోగా వెంకీ అనే కొత్త దర్శకునితో, అలాగే రాజ్‌తరుణ్ హీరోగా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో ‘శతమానం భవతి’... ఇలా వరుసగా సినిమాలు ఉన్నాయి. రవితేజ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చేయాలనుకున్న ‘ఎవడో ఒకడు’ని నాగార్జునగారితో చేద్దామను కుంటున్నాం. అయితే, ఇంకా చర్చల దశలోనే ఉంది. పవన్‌కల్యాణ్ తో సినిమా చేయాలన్నది నా లక్ష్యం. మంచి స్క్రిప్ట్‌తో వస్తే చేస్తానని ఆయన మాటిచ్చారు.