జూనియర్ ఎన్టీఆర్ నా అభిమాన నటుడు | My favorite actor Junior NTR says Director Hari | Sakshi
Sakshi News home page

జూనియర్ ఎన్టీఆర్ నా అభిమాన నటుడు

Published Thu, Dec 1 2016 1:31 AM | Last Updated on Mon, Sep 4 2017 9:32 PM

జూనియర్ ఎన్టీఆర్ నా అభిమాన నటుడు

జూనియర్ ఎన్టీఆర్ నా అభిమాన నటుడు

కోలీవుడ్‌లో కమర్షియల్ చిత్రాలకు చిరునామా దర్శకుడు హరి అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. సామి, తామిరభరణి, ఆరు, సింగం, పూజై, సింగం-2 ఇలా ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలన్నీ పూర్తిగా మాస్ మసాలా చిత్రాలే. వాటిలోనూ రమ్యమైన ప్రేమ, వినోదభరిత సన్నివేశాలంటూ కుటుంబ సమేతంగా చూసి ఆనందించేలా జాగ్రత్త పడడం హరి స్పెషాలిటి. ఈయన దర్శకత్వం వహించిన చిత్రాలన్నీ తెలుగులోకి అనువాదం అయి అక్కడి ప్రేక్షకులను అలరించడం మరో విశేషం. తెలుగులో బాలకృష్ణ నటించిన సూపర్‌హిట్ చిత్రం లక్ష్మినరసంహా తమిళంలో హరి దర్శకత్వం వహించిన సామి చిత్రానికి రీమేక్‌అన్నది గమనార్హం. కాగా తాజాగా సూర్య హీరోగా ఎస్-3 పేరుతో సింగంకు మూడో భాగాన్ని తెరకెక్కించారు. అనుష్క, శ్రుతీహసన్ లాంటి ముద్దుగుమ్మలు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం సింగం, సింగం-2ల కంటే మరింత అదుర్స్‌గా ఉంటుందని అంటున్న దర్శకుడు హరితో సాక్షి చిట్‌చాట్
 
 ప్ర. ఎస్-3 చిత్రం ఎలా ఉండబోతుంది?
 జ. నా చిత్రాలు కమర్షియల్ ఫార్ములాలోనే ఉంటాయన్నది తెలిసిందే. సింగం, సింగం-2 చిత్రాల కంటే ఎస్-3 మరింత భారీ హంగులతో ఉంటుంది. కాక్కక్కాక, సింగం, సింగం-2 చిత్రాల తరువాత సూర్యను నాలుగో సారి పోలీస్ అధికారిగా చూపించడం అంటే అంత ఈజీ కాదు. అయినా ఆయన్ని చాలా కొత్తగా చూపించాను.
 
 ప్ర. ఎస్-3 చిత్రం ద్వారా ప్రేక్షకులకు ఏమి చెప్పనున్నారు?
 జ. ఇందులో అంతర్జాతీయ సమస్యను చూపబోతున్నాం. దేశ సమైక్యతను, గొప్పతనాన్ని చెప్పనున్నాం. నా చిత్రాలు కమర్షియల్‌గా ఉంటాయంటారు. అందువల్ల ఈ సారి కమర్షియల్ అంశాలతో పాటూ కుటుంబ సమేతంగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలన్న లక్ష్యంగా ఎస్-3ని తరకెక్కించాను.
 
 ప్ర. చిత్ర భారీతనం గురించి?
 జ. ఇప్పటి వరకూ నేను చేసిన చిత్రాల కంటే అత్యధిక రోజులు చిత్రీకరించిన చిత్రం ఎస్-3. ఈ చిత్రాన్ని 125 రోజులు చిత్రీకరించాం. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలతో పాటు రొమేనియా, ఆస్ట్రేలియా, మలేషియా, వంటి విదేశాల్లోనూ షూటింగ్ నిర్వహించాం.
 
 ప్ర. సూర్యను గత చిత్రాలకు భిన్నంగా చూపించడానికి తీసుకున్న జాగ్రత్తల గురించి?
 జ. సూర్య ఇందులో పోలీస్ యూనిఫాం లేకుండా కొంత భాగం, యూనిఫాంతో కొంత భాగం కనిపిస్తారు. ఆయన డ్రస్సింగ్ స్టయిల్, యాక్టింగ్ అన్నీ సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉంటాయి.
 
 ప్ర. హీరోయిన్లు, అనుష్క, శ్రుతీహాసన్‌ల గురించి?
 జ. అనుష్క చాలా ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపిస్తారు. ఆ పాత్ర చిత్రానికి చాలా కీలకంగా ఉంటుంది. ఇక శుత్రీహాసన్‌ది చాలా డేరింగ్ పాత్ర. అదే సమయంలో గ్లామర్‌కు కొరత ఉండదు. ఇద్దరి పాత్రలకు ప్రాధాన్యత ఉంటుంది. ఇక్కడో విషయం చెప్పాలి. ఎస్-3 చిత్ర ప్రారంభానికి ముందే అనుష్కను కలిసి ఈ చిత్రంలో మీ పాత్ర ఎంత  ఉంటుందో చెప్పలేను. మీరు నటిస్తారా? అని అడగ్గా సింగం చిత్ర కుటుంబంలో నేను ప్రధాన వ్యక్తినని, అందువల్ల ఒక గంట అయినా నేనీ చిత్రంలో నటించడానికి రెడీ అని అనుష్క అన్నారు.
 
 ప్ర. చిత్రంలో హైలైట్స్ గురించి?
 జ. హైలైట్స్ గురించి చెప్పాలంటే 8 ఎయిర్‌పోర్టులలో చిత్రాన్ని చిత్రీకరించాం. ఇక పోరాట సన్నివేశాలు, చేజింగ్‌‌స అంటూ చిత్రం వేగంగా సాగుతుంది. ఐటమ్ సాంగ్‌లో నటి నీతుచంద్రా నటించారు. చిత్రాన్ని తమిళం, తెలుగు భాషల్లో డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం.
 
 ప్ర. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఎవరో తెలియదని అన్నారట?
 జ; అవునా? అలా ప్రచారం జరుగుతోందా? నిజం చెప్పాలంటే నేను ఎన్టీఆర్ అభిమానిని. ఆయన నటించిన టెంపర్ చిత్రాన్ని రెండు సార్లు చూశాను. నాలుగైదు సార్లు ఎన్టీఆర్‌ను కలిశాను కూడా. ఇంకా చెప్పాలంటే ఆయనతో చిత్రం చేయాలన్నది నా కోరిక. ఆయనకు కథ కూడా చెప్పాను. అయితే అది సెట్ కాలేదు.
 
 ప్ర. తెలుగులో చిత్రం చేస్తారా?
 జ. చేయాలని ఆశగా ఉంది. అందుకే తెలుగు భాషను కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను.
 
 ప్ర. టాలీవుడ్‌లో మీకు ఇష్టమైన దర్శకుడు?
 జ : అలా చెప్పడం చాలా కష్టం. చాలా దర్శకులంటే ఇష్టం. లెజెండ్  చిత్రాన్ని బోయపాటి శ్రీను, టెంపర్ దర్శకుడు పూరి జగన్నాధ్, శ్రీమంతుడు చిత్ర దర్శకుడు కొరటాల శివ ఇలా చాలా మంది దర్శకులు అద్భుతంగా చేస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement