![Vishal34: Hero Vishal Director Hari Combination Repeated - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/16/vishal.jpg.webp?itok=embmCcN3)
హీరో విశాల్ ఇటీవల వరుసగా చిత్రాలు చేసుకుంటూ పోతున్నారు. ఈయన తాజాగా నటించిన చిత్రం మార్క్ ఆంటోని. నటి రీతూ వర్మ నాయకిగా, ఎస్‌జే సూర్య ప్రతినాయకుడిగా నటించిన ఈ చిత్రానికి ఆధిక్ రవిచంద్రన్ దర్శకుడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇందులో విశాల్ ఒక పాటను పాడటం విశేషం. ఈ చిత్రం సెప్టెంబర్‌లో విడుదలకు సిద్ధం అవుతోంది. దీంతో పాటు తుప్పరివాలన్–2 చిత్రాన్ని చేస్తున్నారు.
కాగా విశాల్ తన తదుపరి చిత్రానికి సిద్ధమయ్యారు. ఇది ఆయన నటించే 34వ చిత్రం. ఈ చిత్రానికి కమర్షియల్ దర్శకుడు హరి దర్శకత్వం వహిస్తున్నారు. దీన్ని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ స్టోన్ బెంచ్ స్టూడియో, జి స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇంతకుముందు ఈయన హరి సింగం 1, 2, వేంగై చిత్రాలకు దర్శకత్వం వహించారు. కాగా విశాల్, దర్శకుడు హరి కాంబోలో ఇంతకుముందు తామరభరణి, పూజై వంటి హిట్ చిత్రాలు రూపొందాయి.
తాజాగా ఈ కాంబోలో రూపొందుతున్న మూడవ చిత్రం శనివారం పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ విషయాన్ని నటుడు విశాల్ తన ట్విటర్ ద్వారా వెల్లడించారు ఇందులో నటి ప్రియా భవానీ శంకర్ నాయకిగా నటించనున్నట్లు, నటుడు యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషించనున్నట్లు సమాచారం. చిత్ర షూటింగ్‌ను తమిళనాడు, కేరళ, ఆంధ్ర ప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు సమాచారం. ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కథాచిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.
చదవండి: నిత్యామీనన్ ఇంట్లో విషాదం
Comments
Please login to add a commentAdd a comment