ఆ కోరిక నెరవేరింది : లక్ష్మీకాంత్ చెన్నా
ఆ కోరిక నెరవేరింది : లక్ష్మీకాంత్ చెన్నా
Published Tue, Sep 17 2013 1:18 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM
‘‘ఇండస్ట్రీలో టాలెంట్ కంటే సక్సెస్సే ముఖ్యం’’ అంటున్నారు దర్శకుడు లక్ష్మీకాంత్ చెన్నా. ‘హైదరాబాద్ నవాబ్స్’, ‘నిన్న-నేడు-రేపు’ చిత్రాలతో అభిరుచి గల దర్శకునిగా పేరు తెచ్చుకున్న లక్ష్మీకాంత్ ‘కమీనా’ చిత్రంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇటీవల విడుదలైన ‘కమీనా’ విమర్శకుల ప్రశంసలందుకుంటున్న సందర్భంగా లక్ష్మీకాంత్ సోమవారం విలేకరులతో ముచ్చటించారు.
‘‘కమీనా విషయంలో నేను కోరుకున్నది ఒక్కటే. సినిమా చూసి బయటకొచ్చే ప్రేక్షకులు ‘చెత్త సినిమా చూశాం’ అనుకోకుండా... ‘సినిమా బాగుంది’ అనుకుంటే చాలు. ఆ కోరిక నెరవేరింది’’ అని చెప్పారు. మరికొన్ని విషయాలు చెబుతూ -‘‘‘జానీగద్దర్’ నా ఫేవరెట్ మూవీ. ఆ సినిమాను ఫ్రీమేక్ చేయాలని అప్పట్లో అనుకున్నాను. నాతో పాటు చాలామంది కూడా ప్రయత్నాలు చేశారు. అయితే... చివరకు ఆ కథను రీమేక్ చేసే అవకాశం నాకు దక్కింది. ఎక్కడా ఆ కథలోని ఆత్మ చెడకుండా చాలా జాగ్రత్తగా ఈ సినిమా తీశాను. కేరక్టరైజేషన్ల విషయంలో మాత్రం చిన్న చిన్న మార్పులు చేశాను.
టేకింగ్ విషయంలో ‘జానీగద్దర్’ స్లోగా ఉంటుంది. కానీ ఈ సినిమా మాత్రం వేగవంతమైన కథనంతో తెరకెక్కించాను. చూసిన ప్రతి ఒక్కరూ సినిమా బాగుంది అంటుంటే చాలా సంతోషం అనిపిస్తోంది’’ అని చెప్పారు. ప్రయోగాలతో ప్రయాణం చేస్తే కమర్షియల్ హిట్ దక్కడం కష్టమేమో? అనంటే- ‘‘నా ఎదురుచూపులు కమర్షియల్ హిట్ కోసమే. అయితే... అలాంటి విజయం దక్కాలంటే, మంచి హీరో కుదరాలి. తగ్గ నిర్మాత దొరకాలి. అలాంటి అవకాశం వస్తే నేనేంటో రుజువు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను’’ అన్నారు. ఇద్దరు నిర్మాతలతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, వాటి వివరాలు త్వరలో తెలియజేస్తానని లక్ష్మీకాంత్ చెప్పారు.
Advertisement