కమీనా సినిమా రివ్యూ!
కమీనా సినిమా రివ్యూ!
Published Fri, Sep 13 2013 4:56 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో సీక్వెల్స్ లతోపాటు రీమేక్ ల పర్వం ఎక్కువగానే కొనసాగుతోంది. తెలుగులో ఇతర భాషల్లో విజయం సాధించిన చిత్రాలను తెలుగులో రీమేక్ చేసి హిట్ సాధించిన చిత్రాలు తక్కువగానే కనిపిస్తుంటాయి. తాజాగా హిందీలో విజయవంతమైన జానీ గద్దర్ చిత్రం ఆధారంగా కమీనా చిత్రాన్ని దర్శకుడు లక్ష్మికాంత్ చెన్నా రూపొందించారు. కమీనా చిత్రం సెప్టెంబర్ 13 తేది శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా టాలీవుడ్ లో విడుదలైన కమీనా చిత్రం ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుందో తెలుసుకోవాలంటే ఓ కథేంటో తెలుసుకుందాం!
అక్రమదందాలు, చట్టవ్యతిరేకమైన వ్యాపారాలు చేసే ధర్మ, తేజ, కైలాశ్, శివ, సిద్దార్థ్ లు ఐదుగురు పార్ట్ నర్స్. ఓ అక్రమ వ్యాపారంలో ఐదుకోట్లు పెట్టుబడి పెట్టి పదికోట్లు సులభంగా సంపాదించాలనుకునేందు ఐదుగురు ప్లాన్ చేస్తారు. ఆ క్రమంలోనే ఐదుకోట్లు సమకూర్చి...ఒడిశాలోని భువనేశ్వర్ కు శివ ద్వారా తరలించాలని సిద్ధమవుతారు. అయితే ఓ కారణంతో డీల్ పూర్తికాకుండానే ఐదుకోట్ల రూపాయలు కొట్టేసేందుకు సిద్ధార్థ్ పథకం రచిస్తాడు. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం శివను చంపేసి ఐదుకోట్ల రూపాయలను సిద్దు చేజిక్కించుకుంటాడు. అయితే ఎందుకు ఐదు కోట్ల రూపాయలను కొట్టేయాలనుకుంటాడు. ఏ కారణం కోసం సిద్ధార్థ్ డబ్బు కాజేయాలనుకుంటాడో ఆ లక్ష్యం నెరవేరిందా? సిద్ధార్థ్ మోసానికి గురైన మిగితా ముగ్గురు ఏం చేశారు అనే ప్రశ్నలకు సమాధానమే కమీనా చిత్రం.
తెలుగు సినిమారంగంలో క్రైమ్, యాక్షన్, థ్రిల్లర్ నేపథ్యంలో ఇలాంటి కథలు చాలానే వచ్చాయి. అయితే బాలీవుడ్ లో జానీ గద్దర్ సాధించిన విజయం చిత్ర యూనిట్ ను రీమేక్ ఆలోచనకు ప్రాణం పోసి ఉండవచ్చు. అయితే శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో నీల్ నితిన్ ముఖేశ్ బాలీవుడ్ కు పరిచయం అవుతూ.. 2007 లో విడుదలైన జానీ గద్దర్ ప్రేక్షకుల్లో సంతృప్తిని మిగిల్చింది. అదే కథను తీసుకుని తెలుగులో కమీనాగా లక్ష్మికాంత్ తెరపై ఆవిష్కరింప చేయడంలో లక్ష్యాన్ని చేరుకున్నాడనిపిస్తుంది. తనదైన పక్కా స్క్రీన్ ప్లేతో చిత్రాన్ని ఆసక్తికరంగా మలిచారు. టేకింగ్, పాత్రల నుంచి నటనను రాబట్టుకున్న విధానం దర్శకుడి ప్రతిభకు అద్దం పట్టాయి. సాయి కుమార్, ఆశీష్ విద్యార్థి, సుబ్బరాజు, బ్రహ్మాజీల పాత్రల ఎంపిక కమీనా చిత్రానికి కొంత బలాన్ని చేకూర్చింది. సాయి కుమార్ ఫుల్ లెంగ్త కాకపోయినప్పటికి.. అతిధి పాత్రకు పరిమితం కాకుండా.. ఆ పాత్ర ప్రభావం చివరి వరకు కనిపించింది. బ్రహ్మజీ, సుబ్బరాజు, ఆశీష్ విద్యార్థిలు తమకు అందివచ్చిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకున్నాడు. ఈ చిత్రంలోని కైలాశ్ పాత్ర పోషించిన బ్రహ్మజీ మంచి మార్కులే పడటం ఖాయం. బ్రహ్మజీ భార్యగా నటించిన రోజా పాత్ర కూడా ఈ చిత్రంలో ప్రధానమైందే. పోలీస్ అఫీసర్ గా రవిబాబు నటన పాత్ర పరిధి మేరకు కాకుండా కొంత శృతిమించిందనిపిస్తుంది.
ఇక సిద్దార్థ్ పాత్రలో హీరోగా కనిపించిన క్రిష్ కు తొలి అవకాశంగా మంచి పాత్రనే లభించింది. తన శక్తి సామర్ధ్యాల మేరకు పూర్తిగా న్యాయం చేకూర్చేందుకే ప్రయత్నించాడు. అయితే హిందీలో ఇదే పాత్రలో కనిపించిన నీల్ నితిన్ ముకేశ్ నిర్ధేశించిన లక్ష్యాన్ని క్రిష్ చేరుకోలేకపోయాడన్నది స్పష్టంగా కనిపించింది. హీరోయిన్ లేఖా వాషింగ్టన్, మరో ప్రధాన పాత్రలో కనిపించిన ప్రస్థానం కథానాయిక రూబీ పరిహార్ లు పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు. ఈచిత్రానికి సంగీతం అందించిన అగస్త్య, సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ విభాగాల పనితీరు పర్వాలేదనిపించే స్థాయిలో ఉంది. ఇక ఎటువంటి ప్రచార ఆర్భాటం లేకుండా టాలీవుడ్ లో విడుదలైన కమీనా.. ప్రేక్షకులకు దగ్గరయ్యే అవకాశాలను బట్టే చిత్ర విజయం ఆధారపడి ఉంటుంది.
Advertisement