Kameena
-
ఆ కోరిక నెరవేరింది : లక్ష్మీకాంత్ చెన్నా
‘‘ఇండస్ట్రీలో టాలెంట్ కంటే సక్సెస్సే ముఖ్యం’’ అంటున్నారు దర్శకుడు లక్ష్మీకాంత్ చెన్నా. ‘హైదరాబాద్ నవాబ్స్’, ‘నిన్న-నేడు-రేపు’ చిత్రాలతో అభిరుచి గల దర్శకునిగా పేరు తెచ్చుకున్న లక్ష్మీకాంత్ ‘కమీనా’ చిత్రంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇటీవల విడుదలైన ‘కమీనా’ విమర్శకుల ప్రశంసలందుకుంటున్న సందర్భంగా లక్ష్మీకాంత్ సోమవారం విలేకరులతో ముచ్చటించారు. ‘‘కమీనా విషయంలో నేను కోరుకున్నది ఒక్కటే. సినిమా చూసి బయటకొచ్చే ప్రేక్షకులు ‘చెత్త సినిమా చూశాం’ అనుకోకుండా... ‘సినిమా బాగుంది’ అనుకుంటే చాలు. ఆ కోరిక నెరవేరింది’’ అని చెప్పారు. మరికొన్ని విషయాలు చెబుతూ -‘‘‘జానీగద్దర్’ నా ఫేవరెట్ మూవీ. ఆ సినిమాను ఫ్రీమేక్ చేయాలని అప్పట్లో అనుకున్నాను. నాతో పాటు చాలామంది కూడా ప్రయత్నాలు చేశారు. అయితే... చివరకు ఆ కథను రీమేక్ చేసే అవకాశం నాకు దక్కింది. ఎక్కడా ఆ కథలోని ఆత్మ చెడకుండా చాలా జాగ్రత్తగా ఈ సినిమా తీశాను. కేరక్టరైజేషన్ల విషయంలో మాత్రం చిన్న చిన్న మార్పులు చేశాను. టేకింగ్ విషయంలో ‘జానీగద్దర్’ స్లోగా ఉంటుంది. కానీ ఈ సినిమా మాత్రం వేగవంతమైన కథనంతో తెరకెక్కించాను. చూసిన ప్రతి ఒక్కరూ సినిమా బాగుంది అంటుంటే చాలా సంతోషం అనిపిస్తోంది’’ అని చెప్పారు. ప్రయోగాలతో ప్రయాణం చేస్తే కమర్షియల్ హిట్ దక్కడం కష్టమేమో? అనంటే- ‘‘నా ఎదురుచూపులు కమర్షియల్ హిట్ కోసమే. అయితే... అలాంటి విజయం దక్కాలంటే, మంచి హీరో కుదరాలి. తగ్గ నిర్మాత దొరకాలి. అలాంటి అవకాశం వస్తే నేనేంటో రుజువు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను’’ అన్నారు. ఇద్దరు నిర్మాతలతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, వాటి వివరాలు త్వరలో తెలియజేస్తానని లక్ష్మీకాంత్ చెప్పారు. -
కమీనా సినిమా రివ్యూ!
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో సీక్వెల్స్ లతోపాటు రీమేక్ ల పర్వం ఎక్కువగానే కొనసాగుతోంది. తెలుగులో ఇతర భాషల్లో విజయం సాధించిన చిత్రాలను తెలుగులో రీమేక్ చేసి హిట్ సాధించిన చిత్రాలు తక్కువగానే కనిపిస్తుంటాయి. తాజాగా హిందీలో విజయవంతమైన జానీ గద్దర్ చిత్రం ఆధారంగా కమీనా చిత్రాన్ని దర్శకుడు లక్ష్మికాంత్ చెన్నా రూపొందించారు. కమీనా చిత్రం సెప్టెంబర్ 13 తేది శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా టాలీవుడ్ లో విడుదలైన కమీనా చిత్రం ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుందో తెలుసుకోవాలంటే ఓ కథేంటో తెలుసుకుందాం! అక్రమదందాలు, చట్టవ్యతిరేకమైన వ్యాపారాలు చేసే ధర్మ, తేజ, కైలాశ్, శివ, సిద్దార్థ్ లు ఐదుగురు పార్ట్ నర్స్. ఓ అక్రమ వ్యాపారంలో ఐదుకోట్లు పెట్టుబడి పెట్టి పదికోట్లు సులభంగా సంపాదించాలనుకునేందు ఐదుగురు ప్లాన్ చేస్తారు. ఆ క్రమంలోనే ఐదుకోట్లు సమకూర్చి...ఒడిశాలోని భువనేశ్వర్ కు శివ ద్వారా తరలించాలని సిద్ధమవుతారు. అయితే ఓ కారణంతో డీల్ పూర్తికాకుండానే ఐదుకోట్ల రూపాయలు కొట్టేసేందుకు సిద్ధార్థ్ పథకం రచిస్తాడు. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం శివను చంపేసి ఐదుకోట్ల రూపాయలను సిద్దు చేజిక్కించుకుంటాడు. అయితే ఎందుకు ఐదు కోట్ల రూపాయలను కొట్టేయాలనుకుంటాడు. ఏ కారణం కోసం సిద్ధార్థ్ డబ్బు కాజేయాలనుకుంటాడో ఆ లక్ష్యం నెరవేరిందా? సిద్ధార్థ్ మోసానికి గురైన మిగితా ముగ్గురు ఏం చేశారు అనే ప్రశ్నలకు సమాధానమే కమీనా చిత్రం. తెలుగు సినిమారంగంలో క్రైమ్, యాక్షన్, థ్రిల్లర్ నేపథ్యంలో ఇలాంటి కథలు చాలానే వచ్చాయి. అయితే బాలీవుడ్ లో జానీ గద్దర్ సాధించిన విజయం చిత్ర యూనిట్ ను రీమేక్ ఆలోచనకు ప్రాణం పోసి ఉండవచ్చు. అయితే శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో నీల్ నితిన్ ముఖేశ్ బాలీవుడ్ కు పరిచయం అవుతూ.. 2007 లో విడుదలైన జానీ గద్దర్ ప్రేక్షకుల్లో సంతృప్తిని మిగిల్చింది. అదే కథను తీసుకుని తెలుగులో కమీనాగా లక్ష్మికాంత్ తెరపై ఆవిష్కరింప చేయడంలో లక్ష్యాన్ని చేరుకున్నాడనిపిస్తుంది. తనదైన పక్కా స్క్రీన్ ప్లేతో చిత్రాన్ని ఆసక్తికరంగా మలిచారు. టేకింగ్, పాత్రల నుంచి నటనను రాబట్టుకున్న విధానం దర్శకుడి ప్రతిభకు అద్దం పట్టాయి. సాయి కుమార్, ఆశీష్ విద్యార్థి, సుబ్బరాజు, బ్రహ్మాజీల పాత్రల ఎంపిక కమీనా చిత్రానికి కొంత బలాన్ని చేకూర్చింది. సాయి కుమార్ ఫుల్ లెంగ్త కాకపోయినప్పటికి.. అతిధి పాత్రకు పరిమితం కాకుండా.. ఆ పాత్ర ప్రభావం చివరి వరకు కనిపించింది. బ్రహ్మజీ, సుబ్బరాజు, ఆశీష్ విద్యార్థిలు తమకు అందివచ్చిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకున్నాడు. ఈ చిత్రంలోని కైలాశ్ పాత్ర పోషించిన బ్రహ్మజీ మంచి మార్కులే పడటం ఖాయం. బ్రహ్మజీ భార్యగా నటించిన రోజా పాత్ర కూడా ఈ చిత్రంలో ప్రధానమైందే. పోలీస్ అఫీసర్ గా రవిబాబు నటన పాత్ర పరిధి మేరకు కాకుండా కొంత శృతిమించిందనిపిస్తుంది. ఇక సిద్దార్థ్ పాత్రలో హీరోగా కనిపించిన క్రిష్ కు తొలి అవకాశంగా మంచి పాత్రనే లభించింది. తన శక్తి సామర్ధ్యాల మేరకు పూర్తిగా న్యాయం చేకూర్చేందుకే ప్రయత్నించాడు. అయితే హిందీలో ఇదే పాత్రలో కనిపించిన నీల్ నితిన్ ముకేశ్ నిర్ధేశించిన లక్ష్యాన్ని క్రిష్ చేరుకోలేకపోయాడన్నది స్పష్టంగా కనిపించింది. హీరోయిన్ లేఖా వాషింగ్టన్, మరో ప్రధాన పాత్రలో కనిపించిన ప్రస్థానం కథానాయిక రూబీ పరిహార్ లు పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు. ఈచిత్రానికి సంగీతం అందించిన అగస్త్య, సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ విభాగాల పనితీరు పర్వాలేదనిపించే స్థాయిలో ఉంది. ఇక ఎటువంటి ప్రచార ఆర్భాటం లేకుండా టాలీవుడ్ లో విడుదలైన కమీనా.. ప్రేక్షకులకు దగ్గరయ్యే అవకాశాలను బట్టే చిత్ర విజయం ఆధారపడి ఉంటుంది. -
సాయికుమార్ ప్రత్యేక పాత్రలో ‘కమీనా’
‘‘స్వార్థం అనేది ఎంత ప్రమాదమో తెలిపే చిత్రం ఇది. ‘ప్రస్థానం’ తర్వాత నేను ఇందులో మంచి పాత్ర చేశాను’’ అన్నారు సాయికుమార్. ఆయన ప్రత్యేక పాత్రలో రూపొందిన చిత్రం ‘కమీనా’. లక్ష్మీకాంత్ చెన్నా దర్శకుడు. వరప్రసాద్ అరిమండ నిర్మాత. క్రిషి, లేఖా వాషింగ్టన్ జంటగా నటించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఇది క్రైమ్ డ్రామా అయినప్పటికీ వినోద ప్రధానంగా సాగుతుంది. అద్భుత కావ్యం అని చెప్పను కానీ అన్ని వర్గాలవారికీ నచ్చే చిత్రం అవుతుంది’’ అన్నారు. హిందీ చిత్రం ‘జానీ గద్దర్’ ఆధారంగా ఈ చిత్రం చేశారని, అందులో వినయ్ పాటక్ చేసిన పాత్రను చేశానని బ్రహ్మాజీ చెప్పారు. కిషి మాట్లాడుతూ-‘‘హీరోగా నాకిది తొలి చిత్రం. దర్శకుడు నా నుంచి మంచి నటన రాబట్టుకున్నారు. సీనియర్ ఆర్టిస్టుల సహకారం మరవలేనిది’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: విజయశారదారెడ్డి అరిమండ. -
కమీనా ఏం చేశాడు?
అయిదుగురు మిత్రులు అయిదు కోట్ల రూపాయల డీల్‌ను హ్యాండిల్ చేస్తారు. అందులో ఒకడికి కమీనా బుద్ధి పుట్టి ఏం చేశాడనే కథతో రూపొందిన చిత్రం ‘కమీనా’. హిందీలో ఘనవిజయం సాధించిన ‘జానీ గద్దర్’ ఆధారంగా తెలుగులో రూపొందిన చిత్రం ఇది. లక్ష్మీకాంత్ చెన్నా దర్శకుడు. క్రిషి, లేఖా వాషింగ్టన్, సాయికుమార్, రోజా, బ్రహ్మాజీ ముఖ్యతారలు. విజయశారదారెడ్డి అలిమండ సమర్పణలో కుబేరా సినిమాస్ పతాకంపై వరప్రసాద్‌రెడ్డి అరిమండ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 13న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘‘వినోదం, వాణిజ్య అంశాలు మిళితమైన క్రైమ్ కథ ఇది’’ అని దర్శకుడు చెప్పారు. ఇందులో హీరోగా నటించిన క్రిషి మాట్లాడుతూ -‘‘సినిమా చాలా బాగా వచ్చింది. అగస్త్య పాటలు, నేపథ్య సంగీతం మెయిన్ హైలైట్. దర్శకుడు చాలా గ్రిప్పింగ్‌గా, స్టయిలిష్‌గా సినిమాను తెరకెక్కించారు. క్లాస్‌నీ మాస్‌నీ ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉన్నాయి’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: అగస్త్య, కెమెరా: జవహర్‌రెడ్డి. -
కమీనా అందరికీ నచ్చుతుంది
‘‘హిందీలో వచ్చిన ‘జానీ గద్దర్’ చాలా మంచి సినిమా. దానికి రీమేక్ ‘కమీనా’. ఇందులో సన్నివేశాలన్నీ చాలా గ్రిప్పింగ్‌గా ఉంటాయి. ఈ రోజుల్లో సినిమా బావుండాలే కానీ, చిన్నా పెద్దా తారతమ్యాలు లేవు. ‘కమీనా’ కచ్చితంగా పెద్ద హిట్టవుతుంది’’ అని హీరో ఆది చెప్పారు. క్రిషి, లేఖా వాషిం గ్టన్ జంటగా లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వంలో విజయశారద రెడ్డి అరిమండ సమర్పణలో కుబేరా సినిమాస్ సతాకంపై వరప్రసాద్‌రెడ్డి అరిమండ నిర్మించిన ‘కమీనా’ ప్రచార చిత్రాన్ని బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ -‘‘ఈ చిత్ర దర్శకుడు నాకు ఎప్పటినుంచో మిత్రుడు. మేమిద్దరం కలిసి సినిమా చేద్దామనుకున్నాం. ఎందుకో కుదర్లేదు. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘తొలి కాపీ సిద్ధమైంది. సెప్టెంబర్ రెండో వారంలో చిత్రాన్ని విడుదల చేస్తాం. వినోదం, వాణిజ్య అంశాలు కలగలిసిన క్రైమ్ డ్రామా ఇది’’ అని తెలిపారు. క్రిషి మాట్లాడుతూ -‘‘నాకిది తొలి సినిమా. దర్శకుడు అన్నీ దగ్గరుండి చెప్పి చేయించుకున్నారు’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇంకా సంగీత దర్శకుడు అగస్త్య, కెమెరామేన్ జవహర్‌రెడ్డి, ఎడిటర్ లోకేష్, సహనిర్మాత నవీన్‌రెడ్డి మాట్లాడారు.